టిక్కా
ABN , First Publish Date - 2021-08-07T18:29:10+05:30 IST
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చేపల మార్కెట్లు కొనుగోళ్లతో సందడిగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో చేప రుచులు నోరూరిస్తుంటాయి. అయితే ఎప్పుడూ చేసుకునే చేపల పులుసు కాకుండా టిక్కా, మంచూరియా,
చేపట్టు పట్టండి
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చేపల మార్కెట్లు కొనుగోళ్లతో సందడిగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో చేప రుచులు నోరూరిస్తుంటాయి. అయితే ఎప్పుడూ చేసుకునే చేపల పులుసు కాకుండా టిక్కా, మంచూరియా, కట్లెట్స్, ఫింగర్స్, కేక్ లాంటివి ట్రై చేయండి. ఆ రెసిపీల తయారీ విశేషాలు ఇవి...
కావలసినవి: చేప ముక్కలు - అరకిలో, పెరుగు - ఒక కప్పు, కారం - ఒకటిన్నర టీస్పూన్, మిరియాల పొడి - అర టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్, పసుపు - చిటికెడు, మెంతి ఆకుల పొడి- అర టేబుల్‌స్పూన్, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాల - అర టీస్పూన్, ధనియాల పొడి - అర టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, శనగపిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, టొమాటో - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి.
తయారీ విధానం: పెరుగు చిక్కగా ఉండాలి. ఒకవేళ పెరుగులో నీళ్లుంటే ముస్లిన్ క్లాత్ సహాయంతో పిండి నీళ్లు తీసేయాలి. తరువాత అందులో శనగపిండి, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కారం, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కసూరి మేతి, గరంమసాల, ధనియాల పొడి కలుపుకోవాలి. కొద్దిగా నూనె వేసి కలుపుకొంటే మసాలా మిశ్రమం బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చేప ముక్కలను వేసి మసాలా ముక్కలకు పట్టేలా కలియబెట్టుకోవాలి. ఓవెన్‌ను 240 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీ హీట్ చేసుకోవాలి. చేప ముక్కలను ట్రేలో పెట్టి ఓవెన్లో పదినిమిషాలు బేక్ చేసుకోవాలి. తరువాత హీట్‌ను 180 డిగ్రీలకు తగ్గించుకుని మరో పదినిమిషాలు బేక్ చేయాలి. ఓవెన్ లేని వారు నిప్పు కణికలపై గ్రిల్ జాలీ పెట్టి కాల్చుకోవచ్చు. టొమాటో, ఉల్లిపాయలను గుండ్రంగా తరిగి గార్నిష్ చేసుకుని ఫిష్ టిక్కా సర్వ్ చేసుకోవాలి.