Satish Jarkhiholi: హిందూ వ్యాఖ్యలపై క్షమాపణ..సీఎంకు లేఖ

ABN , First Publish Date - 2022-11-09T20:01:29+05:30 IST

బెంగళూరు: హిందూ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని, దీనికి ఆ భాషలో అత్యంత మురికి అనే అర్ధం వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన...

Satish Jarkhiholi: హిందూ వ్యాఖ్యలపై క్షమాపణ..సీఎంకు లేఖ

బెంగళూరు: 'హిందూ' అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని, దీనికి ఆ భాషలో అత్యంత మురికి అనే అర్ధం వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ జార్కిహోలి (Satish Jarkiholi) ఎట్టకేలకు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశారు. ఇదే లేఖలో తనను హిందూ వ్యతిరేకిగా (anti-Hindu)గా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.

జార్కిహోలి గత ఆదివారంనాడు బెళగవి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందూ అనే పర్షియన్ పదం అని, హిందూ పదానికి అత్యంత మురికి అనే అర్ధం వస్తుందని అన్నారు. ఆ పదాన్ని ఇక్కడి ప్రజలపై బలవంతంగా రుద్దారని, దీనిపై సరైన చర్చ (డిబేట్) జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీతో పాటు పలు హిందూ సంస్థల నుండి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, తన వ్యాఖ్యలపై జార్కిహోలి వెనక్కి తగ్గలేదు. పలు గ్రంథాలను ఆయన ఉటంకిస్తూ అందులోని మాటలే తాను చెప్పానని, తాను తప్పుచేసినట్టు రుజువైతే క్షమాపణలు చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో వివాదం మరింత ముదరకుండా ఎట్టకేలకు ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. క్షమాపణలు తెలియజేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

Updated Date - 2022-11-09T20:07:12+05:30 IST