Tamilnadu: హిందీని బలవంతంగా రుద్దే కేంద్రం చర్యకు నిరసనగా వృద్ధుడి ఆత్మాహుతి

ABN , First Publish Date - 2022-11-26T19:55:58+05:30 IST

తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దే కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ 85 ఏళ్ల వృద్ధుడు శనివారంనాడు ఆత్మాహుతి..

Tamilnadu: హిందీని బలవంతంగా రుద్దే కేంద్రం చర్యకు నిరసనగా వృద్ధుడి ఆత్మాహుతి

సేలం: తమిళనాడులో (Tamilnadu) హిందీని బలవంతంగా రుద్దే (Imposition of Hindi) కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ 85 ఏళ్ల వృద్ధుడు శనివారంనాడు ఆత్మాహుతి చేసుకున్నాడు. సేలం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని మెట్టూరు సమీపంలోని తలైవూర్‌ గ్రామానికి చెందిన తంగవేల్‌గా గుర్తించారు. డీఎంకే వ్యవసాయ విభాగం యూనియన్ ఆర్గనైజర్‌గా సేవలందించిన తంగవేల్ కొద్ది సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు.

తలైవూరులోని పార్టీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటల ప్రాంతానికి తంగవేల్ వచ్చారు. పార్టీ కార్యాలయం ముందు ఆయన ఒక లేఖను ఉంచినట్టు మెట్టూరు పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. తమిళం మాట్లాడే రాష్ట్రంలో హిందీని బలవంతంగా మోదీ ప్రభుత్వం రుద్ద కూడదని, ఆ విధంగా చేస్తే ఇక్కడి విద్యార్థులు నష్టపోతారని ఆ లేఖలో తంగవేల్ పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. తంగవేల్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారని, దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే తమిళనాడు కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సీవీ గణేషన్, పలువురు డీఎంకే నేతలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తంగవేల్ కుటుంబ సభ్యులకు స్వాంతన పలికారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-11-26T19:56:00+05:30 IST