Potti Sriramulu: పొట్టి శ్రీరాములు వల్లే దేశ భౌగోళిక చిత్రంలో అనేక మార్పులు.. ఈ రాష్ట్రాల ఏర్పాటుకు కూడా ఆయనే కారణం..!

ABN , First Publish Date - 2022-12-15T14:02:21+05:30 IST

భార్య వియోగంతో 25 ఏళ్ళ ప్రాయంలోనే ఐహిక బంధాలను త్యజించి, గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు చేరారు. ఆశ్రమంలో ఆయన సేవానిరతికి గాంధిజీ ముగ్ధులయ్యారు. 'మొండితనా'నికి ముచ్చటపడ్డారు.

Potti Sriramulu: పొట్టి శ్రీరాములు వల్లే దేశ భౌగోళిక చిత్రంలో అనేక మార్పులు.. ఈ రాష్ట్రాల ఏర్పాటుకు కూడా ఆయనే కారణం..!

నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఎవరు పొట్టి శ్రీరాములు?

కోస్తాంధ్రుడా? నెల్లూరు జిల్లాకి మాత్రమే పరిమితమా? లేక ఇంకా కురచవైన కులమతప్రాంతీయ చీలిక వర్గాల ప్రతినిధా? జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన చరిత్రకారులు - అమరజీవి పొట్టి శ్రీరాములుని 'Gerardus Mercator of India'- అన్నారు. బహు భాషల, బహుళ సంస్కృతుల భారత సమాజానికి, ప్రజలకి ఏది అవసరమో ఆకళింపు చేసుకొని, అది సాధించేందుకు ఆత్మార్పణ చేసుకున్న అమరజీవి ఆలోచనల్ని పాశ్చాత్య, వలసవాద భావాలతో నిండిన జవహర్లాల్ నెహ్రు, రాజాజీ వంటి వారు అందుకోలేకపోయారని Andre Béteille వంటి కొందరు సోషియాలజిస్టులు విశ్లేషించారు. కాబట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు, ప్రపంచ మానవుడు, విశ్వనరుడు.

అమరజీవి పోరాట మూలాలెక్కడ?

మద్రాసు ప్రెసిడెస్సీ పరిధిలోని అన్ని దేవాలయాల్లోకి హరిజనుల ప్రవేశాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ 1, 1946 న ఒక గాంధేయుడు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. స్వాతంత్ర్యోద్యమం ఉత్తుంగ తరంగమై దేశప్రజలను ఉరికిస్తున్న ఆ దశ అది. అటువంటి పరిస్థితుల్లో హరిజన దేవాలయ ప్రవేశం ప్రాథాన్యత లేని అంశమని కాంగ్రెస్ నాయకులు భావించారు. అందుకే దీక్ష విరమించవలసిందిగా ఆ గాంధేయ వాదికి విజ్ఞప్తిచేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి వారు స్వయంగా మహాత్మ గాంధి జోక్యాన్ని కోరవలసి వచ్చింది. దీక్ష విరమణ అయ్యింది. ఆ సందర్భంగా ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులుకు గాంధీజీ లేఖ రాశారు- ఆ 'మొండి' మనిషి తన మాట మన్నించి దీక్ష విరమించిన సందర్భంగా. ఆ మొండితనానికి మారు పేరు మేరునగ ధీరత్వం, మొక్కవోని పట్టుదల. ఆ ధీరత్వానికి, దీక్షకు తల్లిదండ్రులు పెట్టిన పేరు 'పొట్టి శ్రీరాములు'. 1901న మద్రాసులోని అతి సంప్రదాయమైన కుటుంబంలో జన్మించిన శ్రీరాములు శానిటరీ ఇంజనేరింగ్ పట్టభధ్రులై, గ్రెట్ ఇండియన్ పెనెన్స్యులర్ రైల్వేలో చేరారు. భార్య వియోగంతో 25 ఏళ్ళ ప్రాయంలోనే ఐహిక బంధాలను త్యజించి, గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో చేరారు. ఆశ్రమంలో ఆయన సేవానిరతికి గాంధిజీ ముగ్ధులయ్యారు. 'మొండితనా'నికి ముచ్చటపడ్డారు.


potti-sriramulu-1.jpg

ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసి...

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర మహర్షి బులుసు సాంబమూర్తి ఇంట అక్టోబర్ 1952 న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు శ్రీరాములు. అప్పటికి గాంధీజీ లేరు. ఐరోపా ఆధునికత నరనరాల నిండి ఉన్న మన నేతల నిర్లక్ష్యంతో డిసెంబర్ 15 అర్ధరాత్రి 1952 న 'ఆమరజీవి' కన్నుమూశారు. అలా పొట్టి శ్రీరాములు, భాషా ప్రయుక్త రాష్ట్ర ఉద్యమాల సారథి అయ్యారు. బొంబాయి, మద్రాసుల్లో ఉవ్వెత్తున రేగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకం అయ్యారు. పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. 56 రోజుల నిరవధిక నిరాహార దీక్షను - నెహ్రూ, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలాచారి (రాజాజి) తేలిగ్గా కొట్టిపారేశారు. శ్రీరాములు మరణంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అందరి దృక్పథాలు మారిపోయాయి, తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ నెహ్రూ ప్రకటన చేయాల్సి వచ్చింది. భాషా ప్రయుక్తంగా రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణను ఆమోదిస్తూ పార్లమెంటులో కాంగ్రెస్ చేసింది. ఫజల్ అలీ నేతృత్వంలోని పునర్వ్యవస్థీకరణ సంఘం తీర్మానం మేరకు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

'Gerardus Mercator of India'

ఆంధ్రరాష్ట్రం అయితే ఏర్పాటయ్యింది గానీ అంతకు ముందు ఆరు దశాబ్దాల నుంచీ భాషా ప్రాతిపదికన రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమిస్తున్న కన్నడిగుల పోరాటాన్ని మాత్రం నేతలు విస్మరించారు. 1890 నుంచి ఆ రాష్ట్రంలో కన్నడ భాషాసంస్థలు కార్యకలాపాలు నిర్వహించాయి. ఆర్.హెచ్. దేశపాండే వంటి ప్రముఖుల నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర నినాదం సర్వత్రా మార్మోగింది. కన్నడిగులకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దశల వారీగా ముందుకు సాగింది. ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని మూడింట రెండొంతుల భాగం ఒడియార్ల పాలనకు ఆవల ఉండేది. హైదరాబాద్ నిజాం, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల ఏలుబడిలో తక్కిన ప్రాంతం కొనసాగింది. ఉత్తర కర్ణాటకలోని చాలా ప్రాంతం బ్రిటీష్, నిజాముల అజమాయిషీలో ఉండేది. వారి దుష్పరిపాలనకు తాళలేక ఆ ప్రాంతంలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. అలూరి వెంకటరావు, సిద్దప్ప, కాంబ్లి, రంగారావు, దివాకర్, కౌజుల శ్రీనివాసరావు వంటి నేతల ఆధ్వర్యంలో భాషా ప్రయుక్త రాష్ట్ర ఉద్యమం ఊపందుకొంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖత చూపకపోవడంతో ఆ పార్టీ నాయకుడు ఎ.జె.దొడేమిటి బాంబే అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి నిరాహార దీక్షకు దిగారు.

ఆ వెన్వెంటనే మరాఠీ, గురాతీలు కూడా ఉద్యమాలు ప్రారంభించారు. బొంబాయి రాష్ట్రంలో ఈ ప్రాంతాలు కలిసి ఉండేవి. ప్రత్యేక మరాఠీ రాష్ట్రం కోసం ఉద్యమం హింసా మార్గం పట్టింది. పోలీసు కాల ఎల్లో 105 మంది మరణించారు. ఫలితంగా బొంబాయి రాష్ట్రం, గుజరాత్, మహారాష్ట్రలుగా విడిపోయింది. అలా భారత దేశం భౌగోళిక చిత్రంలో అనేక మార్పులకి కారణమయినందుకే పొట్టి శ్రీరాములుని 'Gerardus Mercator of India' గా గుర్తించారు చరిత్రకారులు (16వ శతాబ్దానికి చెందిన భూగోళశాస్త్రవేత్త, దేశపట చిత్రకారుడు, Gerardus Mercator ప్రపంచ మ్యాపుని మొట్టమొదట రూపొందించడానికి ఎలా మూలమయ్యాడో, అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా ఇండియా భౌగోళిక చిత్రపట రచనకి మూలమని చరిత్రకారుడు, పర్యావరణవేత్త, రచయిత రామచంద్ర గుహ అంటారు)

******

Updated Date - 2022-12-15T14:03:40+05:30 IST