Director Bapu: శోభన్ బాబును రాముడిగా ఫిక్స్ అయి దర్శకుడు బాపు సినిమా తీస్తే.. ఎన్టీఆర్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-12-15T14:08:17+05:30 IST

బాపు తొలి పౌరాణిక చిత్రం ‘సంపూర్ణ రామాయణం’(1972) చిత్రానికి శోభన్ బాబును రామ పాత్రకు ఎంపిక చేసేసరికి చిత్ర పరిశ్రమలో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పాత్రకు ఎన్టీఆర్ సరైన నటుడని..

Director Bapu: శోభన్ బాబును రాముడిగా ఫిక్స్ అయి దర్శకుడు బాపు సినిమా తీస్తే.. ఎన్టీఆర్ ఏమన్నారంటే..

ఈ రోజు దర్శక దిగ్గజం బాపు జయంతి (Bapu Birth Anniversary) (15 డిసెంబర్ )

ఆయన బీ.కాం చదివారు. కామర్స్ మాట అలా ఉంచి ‘కామ్’ గా ఉంటారు. బిఎల్ చదివారు ‘లా’చదివారు అన్న మాటే గాని ‘లా’ వొక్కింతయు ప్రాక్టీసు చేయలేదు. ‘సత్తిరాజు లక్ష్మి నారాయణ’ (Sattiraju Lakshminarayana) అని పేరుకేగాని ఆ పేరుతో ఆయన్ని ఎవరు పిలవరు. జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన బిడ్డ కావడం వల్ల మహాత్ముడి స్పూర్తితోనూ,తన తండ్రి పేరు కలిసివచ్చేలా ఆయన్ని ముద్దుగా ‘బాపు’ (Director Bapu) అని పిలుచుకునేవారు. ఆయన తల్లిగారు తర్వాతి కాలంలో అదే అసలు పేరుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. సినిమా దర్శకత్వంలో బాపు ఏ శిక్షణ పొందలేదు. ఎవరి వద్ద శిష్యరికం చేయకుండానే తన గీతలు రాతల్లాగే ‘బాపుబొమ్మ’ అని సినిమాలకు తనదైన ఓ బ్రాండ్ రూపొందించుకున్నారు. చెప్పడం మొదలుపెడితే ఇలాంటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి బాపుగారితో.

ఇలా మొదలైంది

బాపు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని కంతేరు. తల్లిదండ్రులు సూర్యకాంతమ్మ,వేణుగోపాలరావు. 1933 డిసెంబర్ 15న నిడుమోయిలోని అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి. పెద్ద తమ్ముడు శంకర నారాయణ-బాపు స్పూర్తితోనే పెన్సిల్ రేఖా చిత్రకారుడిగా మంచిపేరు సంపాదించుకున్నారు.

Bapu.jpg

తండ్రి వృత్తిరీత్యా కుటుంబం మద్రాసుకు వచ్చి స్థిరపడటంతో బాపు చదువు అక్కడే కొనసాగింది. కేసం స్కూల్లో 1942లో బాపు ఐదో తరగతి చదువుతూ ఉండగా, ఆ స్కూల్లోనే ఆరవ తరగతి చదువుకుంటున్న ముళ్ళపూడి వెంకటరమణ పరిచయమయ్యాడు. ఆ స్నేహబంధం క్షణ క్షణాభివృద్ది చెందుతూ వచ్చి,ఆ తర్వాత బంధుత్వంతో కూడా మరింత గట్టిపడింది. బాపు తండ్రిగారు తమ కుమారుణ్ణి లాయర్ గా చూడాలని ఆశించి ‘లా’ చదివించారు. బి.ఎల్ విజయవంతంగా చదివినా, నల్లకోటు నచ్చక 1955లో ఆంధ్రపత్రికలో పొలిటికల్ కార్టూనిస్టుగా చిత్ర జీవితాన్ని ప్రారంభించారు. 1967కల్లా బాపు చిత్రకారుడిగాను ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్య, చిత్ర రంగాల్లో రచయితగా మంచిపేరు సంపాదించుకున్నారు. తను రాసిన ఓ కథ ఆధారంగా బాపు దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా ఓ చిత్రం తీయాలని సంకల్పించారు రమణ ఆ చిత్రమే ‘సాక్షి’.

‘పక్కింటికి నిప్పంటుకుంటే నాకేంటే’ అని ఉదాసీనంగా కూర్చోకు తర్వాత అది నీ కొంపమీదకే వస్తుంది’ అనే సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పడానికి చేసిన ప్రయత్నమే ‘సాక్షి’. 19 రోజుల్లో షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి అయిన ఖర్చు ఒక లక్షా ఎనభైవేల రూపాయలు! విడుదలైన తర్వాత పెట్టిన ఖర్చును రాబట్టుకుందా చిత్రం. ‘గొప్ప ప్రయోగం’ అన్న పేరుతో పాటు ‘సాక్షి’ చిత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. ఎవరు ఎంతగా మెచ్చుకున్నా కొంతకాలం తర్వాత ‘సాక్షి’ చిత్రం చూశాక బాపులోని విమర్శకుడు ‘నేనా ఇలాంటి సినిమా తీశాను’ అని బహిరంగంగా విచారించారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Bapu1.jpg

‘సాక్షి సినిమా కథ డైలాగులవల్ల నిలిచింది కానీ పాత్రల నటనలో నాటకీయత, ఓవర్ యాక్షన్ లేకుండా చూడవలసిన దర్శకుని బాధ్యత బొత్తిగా విస్మరించాను’ అని బాధపడ్డారు బాపు. అలా తనను తాను అంత కఠినంగా విమర్శించుకోవడం తన పరాజయాలను ‘స్పోర్టివ్’ గా అంగీకరించడం,తన తీరుపై తనే కార్టూన్లు వేసుకోవడం బాపుగారికే చెల్లింది. ఉదాహరణకు “ ఒక ఉత్తమ ఇల్లాలు ఆవిడ భర్తతో తప్ప సినిమాకు వెళ్ళదు. నా సినిమా రాగానే “ఏమండీ బాపుగారి సినిమా రిలీజయింది ఇవాళ మొదటి ఆటకే వెళదామండి” అనేది ఆయన ఇవాళ శుక్రవారం కదే ఆఫీసుంది. రేపు ఆదివారం వెళదాం అనేవారు. ఆవిడ అంతవరకూ ఉండదండి అని కంటనీరు తుడుచుకునేది”.

తన మీద తానే చెణుకు విసురుకున్నారు బాపు. “థియేటర్ లో నాలుగు హృదయాల్ని కదిలించే చిత్రం కన్నా, నలుగుర్ని థియేటర్ కి నడిపించేదే మంచి చిత్రం” అని నా అభిప్రాయం అనేవారు బాపు.

“ఇది వ్యాపారం కస్టమర్ కి నచ్చిన ప్రోడక్ట్ ఇవ్వాలి. అందులో క్వాలిటీ ఏ కస్టమర్ వద్దనడు. మన సినిమా హిట్ అయినప్పుడు ప్రేక్షకుల అభిరుచి గొప్పదనీ, లేనప్పుడు టేస్ట్ లేదని వ్యాఖ్యానించడం మర్యాదకాదు...” అనే రమణగారి మాటలతో ఏకీభవించేవారు బాపు.

‘సాక్షి’ తర్వాత..

----------

రెండవ చిత్రం ‘బంగారు పిచుక’(1968) బాపు రమణల సొంత చిత్రమే. రెండున్నర లక్షల బడ్జెట్ లో తయారైన ఈ చిత్రం అంతంత మాత్రంగానే ఆడింది. విశేషం ఏమిటంటే ఈ జంట ఇదే కథను 1994లో ‘పెళ్ళికొడుకు’ పేరుతో తీశారు. ‘బంగారు పిచుక’లో హీరో చంద్రమోహన్ అయితే ‘పెళ్ళికొడుకు’ లో నరేశ్ కథానాయకుడు. ఈ రెండు చిత్రాలు చూసిన ప్రముఖ రచయిత దర్శకుడు జంధ్యాల-మొదటిది ‘టూ ఎర్లీ’ అనీ, రెండవది ‘టూ లేట్’ అని కామెంట్ చేశారు!

bapu2.jpg

మూడవ చిత్రం ‘బుద్దిమంతుడు’ (1969) విజయవంతం కావడంతో బాపు ‘హిట్ లిస్ట్’ లోకి చేరారు! ఇదీ దీని తర్వాత రూపొందిన ‘బాలరాజు కథ’ కూడా సొంతంగా నిర్మించినవే. డూండీ నిర్మాతగా తయారైన ‘ఇంటిగౌరవం’(1970) దర్శకుడిగా బాపు ఐదవ చిత్రం.

బాపు తొలి పౌరాణిక చిత్రం ‘సంపూర్ణ రామాయణం’(1972) చిత్రానికి శోభన్ బాబును రామ పాత్రకు ఎంపిక చేసేసరికి చిత్ర పరిశ్రమలో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పాత్రకు ఎన్టీఆర్ సరైన నటుడని అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటే, వీళ్ళే వాటి ‘ట్రెండ్’ మారుస్తున్నారని అనుకున్నారు. కానీ బాపు-రమణలు నమ్మిన రాముడు ఆ చిత్రాన్ని విజయపథంలో నడిపించారు. 18లక్షల వ్యయంతో తయారైన ‘సంపూర్ణ రామాయణం’ నిర్మాతలకు(బాపు-రమణ) లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని తమిళం,కన్నడం,హింది భాషల్లోకి ‘డబ్బింగ్’ చేసి విడుదల చేయడంతో దర్శకుడిగా బాపు ప్రతిభ ఏమిటో ఇతర ప్రాంతాల వారికి తెలిసింది. సౌత్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన బాపుకు ఆ సంవత్సరపు ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ ఇచ్చి సత్కరించారు.

హిందీ చిత్ర సీమలో బాపు

అందాల రాముడు(1973) చిత్రం మరో ప్రయోగం. రమణ గారు రాసిన ‘జనతా ఎక్స్ ప్రెస్’ కథలోని పాత్రలను పునాదిగా చేసుకొని తయారైన ఈ చిత్రం ‘సెకెండ్ రన్’ లో హిట్ కావడం విశేషం. పొట్లూరి వెంకటనారాయణ నిర్మాతగా, బాపు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (1974)లో ఎన్టీఆర్ రాముడిగా, ఆర్జా జనార్ధనరావు ఆంజనేయుడిగా నటించారు. బాపు దర్శకత్వంలో శోభన్ బాబు శ్రీరాముడిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ గతంలోనూ ప్రత్యేకంగా వేయించుకొని చూసిన ఎన్టీఆర్ బాపు భుజం తట్టి శోభన్ బాబును మెచ్చుకున్నారు. అందువల్ల ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ లో బాపు- ఎన్టీఆర్ ల అనుబంధం సులువుగా ప్రారంభమై ఆ తరువాత దృఢతరమైంది. బాపు దర్శకత్వంలో ఎమ్వియల్ నిర్మించిన ‘ముత్యాలముగ్గు’(1975) ప్రసిద్ధ ఛాయాగ్రహకుడు ఇషాన్ ఆర్య మెరుపులతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మురిపించింది. పన్నెండున్నర లక్షల బడ్జెట్ తో తయారైన ఈ చిత్రం మొదటి రిలీజ్ ఇరవై నాలుగో వారానికి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది. రమణ గారి డైలాగులు, రావుగోపాలరావు నోట పలికి విశేష ఆదరణకి నోచుకున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ముత్యాలముగ్గు’ జాతీయ బహుమతిని గెలుచుకుంది.

ఆ తర్వాత బాపుగారు విజయావారి ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ చిత్రానికి పనిచేసినా, దర్శకుడిగా తనపేరు వేసుకోలేదు. కృష్ణంరాజు సోదరుల ‘భక్తకన్నప్ప’ తర్వాత, బాపు గారికి విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన ‘సీతా కళ్యాణం’(1976) విడుదలైంది. సీతగా జయప్రద, రాముడిగా రవి అనే మలయాళ నటుడు నటించారు. వ్యాపారరీత్యా విజయవంతం కాలేదు. అయితే లండన్, చికాగో వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. లండన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో పాఠ్యగ్రంథమైన ఘనత సంపాదించుకుంది. ఆ విధంగా తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో వ్యాపింపజేశారు బాపు.

ఆ తర్వాత ‘దోస్తీ’ హింది చిత్రం ఆధారంగా తీసిన ‘స్నేహం’ ద్వారా రాజేంద్రప్రసాద్, సాయికుమార్ వంటి నటులను పరిచయం చేశారు. అంతకుముందు ‘ముత్యాల ముగ్గు’ ద్వారా నూతన్ ప్రసాద్ పరిచయమయ్యారు. బాపు చలన చిత్ర జీవితంలో మరో మలుపు అని చెప్పుకోదగ్గ చిత్రం. ‘మన ఊరి పాండవులు’(1978)లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా భానుచందర్, గీత పరిచయమయ్యారు. చిరంజీవి తొలి రోజుల్లో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ఇది. ప్రముఖ రూపశిల్పి జయకృష్ణ నిర్మాత ఈ చిత్రమే హిందీలో ‘హాం పాంచ్’ గా రూపుదిద్దుకుంది. నిర్మాత బోనీకపూర్. బాపు దర్శకత్వం వహించిన తొలి హింది చిత్రం ఇదే. ఈ చిత్రానికి ఎస్.పి.బాలసుబ్రమణ్యం రీ-రికార్డింగ్(నేపథ్య సంగీతం) సమకూర్చి మంచిపేరు తెచ్చుకున్నారు. పాటలకు లక్ష్మీ కాంత్-ప్యారే లాల్ సంగీతం సమకూర్చారు. ‘హాం పాంచ్’ విజయం సాధించి, ఆ తర్వాత బాపుగారు హిందీలో మరిన్ని చిత్రాలు తీయడానికి దోహదపడింది.

తెలుగులో ‘గోరంత దీపం’ ‘తూర్పు వెళ్ళే రైలు’ ‘కలియుగ రావణాసురుడు’, ‘రాజాధిరాజు’, ‘వంశవృక్షం’ (ఈ చిత్రం ద్వారా అనిల్ కపూర్ ను వెండితెరకు పరిచయం చేశారు బాపు. ఆ తర్వాత ఆయన హిందీలో అగ్రనటుల్లో ఒకటయ్యారు), ‘రాధా కళ్యాణం’ చిత్రాల తర్వాత 1981లో నవతా కృష్ణంరాజు నిర్మించిన ‘త్యాగయ్య’ చిత్రాన్ని బాపు డైరెక్టు చేశారు. ఈ చిత్రం అపజయంపాలై ఎంతో నిరుత్సాహాన్ని మిగిల్చింది.

అనంతరం ‘కృష్ణావతారం’, ‘ఏది ధర్మం’, ‘పెళ్లీడు పిల్లలు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సీతమ్మ పెళ్లి’ చిత్రాలు వెలువడ్డాయి. ‘సీతమ్మ పెళ్లి’ తెలుగులో ఫెయిల్ అయినా బాపు దర్శకత్వంలోనే హిందీలో ‘ప్యారీ చెహనా’ గా తీస్తే అక్కడ పెద్ద హిట్ అయింది!

‘బుల్లెట్’, ‘జాకీ’, కళ్యాణ తాంబూలం చిత్రాల తర్వాత సొంతంగా తీసుకున్న ‘పెళ్లిపుస్తకం’(1991)బాగా ఆడింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి ‘శ్రీనాథ కవి సార్వభౌమ’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు బాపు. అనంతరం ‘మిస్టర్ పెళ్ళాం’, ‘పెళ్లికొడుకు’, ‘రాంబంటు’, ‘రాధా గోపాళ౦’, ‘సుందరాకాండ’ చిత్రాల తర్వాత చివరిగా ‘శ్రీరామ రాజ్యం’(2011) చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ బడిపిల్లల కోసం బాపు-రమణ ‘బడిపిల్లల కోసం’ వీడియో పాఠాలు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ఈనాడు టెలివిజన్ లో ప్రసారమైన ‘భాగవతం’ ధారావాహిక కూడా బాపు దర్శకత్వ ప్రతిభకు మరో ‘మెచ్చు’ తునక. బాపుగారి డ్రీమ్ ప్రాజెక్టు ‘శ్రీ కృష్ణలీలలు’ అది భారీ ఎత్తున ప్రతిష్టాత్మకమైన సినిమాగా తీయాలని అనుకునేవారు. కానీ బుల్లితెరపై ‘భాగవతం’ తోనే సంతృప్తిపడాల్సి వచ్చింది.

బాపు దర్శకత్వం వహించిన చిత్రాలు- బేజుబాన్ వో సాత్, మొహాజత్, మేరాధరమ్, దిల్ జలా, ప్రేమ్ ప్రతిజ్ఞ, పరమాత్మ-ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆయన 1982లో ‘నీతి దేవన్ మయక్కం’ అనే తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.

దర్శకత్వ శైలి

‘దృశ్య మాద్యమంలో మాటలు- కథ నడపడానికే ఉండాలి కానీ దృశ్యాన్ని మింగేసేలా ఉండకూడదు. సినిమాలో ప్రధానమైనది-కథ, దాన్ని చెప్పే తీరు! మిగతా టెక్నికల్ నైపుణ్యాన్ని అలంకారాలు. కేవలం సాంకేతిక విలువలు ఉంటే సినిమా సక్సెస్ కాదు. పాటలన్నీ హిట్ అయినా చాలదు. వీటిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి మంచి పునాది- కథ’ అని బాపు-రమణల నమ్మకం.

ఇక నటన విషయానికొస్తే,పాత్రధారులు సందర్భానికి అనుగుణంగా, సహజంగా నటించాలని ఆశించేవారు. మధ్యాహ్నం వరకు మరో సినిమాలో నటించిన నటులు అక్కడి ధోరణిలో నాటకీయంగా సంభాషణలు చెబుతూ, కనుబొమ్మలు పైకెత్తి కృత్రిమంగా నటిస్తూ ఉంటే విసుక్కునేవారు బాపు.

“మనం నిజ జీవితంలో అలా మాట్లాడుకోవడంలేదు కదా. మీరెందుకలా నటిస్తున్నారు?” అని మెల్లగానే చెబుతూ,తన ధోరణిలోకి వచ్చేలా నటీ నటులను ‘మౌల్డ్’ చేసేవారు. అందుకనే బాపు చిత్రాల్లోని నటీమణులు-చిన్న పాత్ర ధరించినవారైనా, పెద్ద పాత్ర ధరించిన వారైనా సహజంగా విలక్షణ ధోరణిలో కనిపించడం ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించేది.

అభిమాన చిత్రాలు

బాపు-తను దర్శకత్వం వహించిన చిత్రాలలో ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతా కళ్యాణం’, ‘పెళ్లి పుస్తకం’, ‘మిస్టర్ పెళ్ళాం’, ‘ముత్యాల ముగ్గు’, ‘గోరంతదీపం’ చిత్రాలను విశేషంగా అభిమానించేవారు. ఆయనకు ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ సంగీతం అంటే ప్రాణం. బాపు చక్కగా మౌత్ ఆర్గాన్ వాయిస్తారనేది చాలా కొద్దిమందికే తెలిసిన విషయం.

Bapu3.jpg

‘బాలహక్కు బ్రహ్మ హక్కు’ అంటారు. ఆ మాటను బాపు నమ్ముతారు. ‘రాధాకళ్యాణం’ చిత్రం ఆధారంగా హిందీలో ‘ఓ సాత్ దీన్’(1984) చిత్రాన్ని బాపు డైరెక్షన్ చేస్తున్నారు. ఓ మార్వాడీ దుకాణంలో ఆ షూటింగ్ జరుగుతుండగా బాలనటుడు మాస్టర్ రాజు –“అంకుల్ . ఆ మార్వాడీ వేషం మీరు వెయ్యండి. డైరెక్టర్ గారు వేషం వేస్తే పిక్చర్ హిట్” అని చెప్పి బాపును వొప్పించాడు. ఒకే ఒక షాట్ గా తీసిన ఆ దృశ్యంలో బాపు కనిపిస్తాడు. అదే చాలా అరుదైన దృశ్యం!

రివార్డులు

-----------

యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన బాపు అందుకున్న అవార్డుల జాబితా పెద్దదే. ముఖ్యమైనవి- ముత్యాలముగ్గు, మిస్టర్ పెళ్ళాం, బాలరాజు కథ, అందాల రాముడు, పెళ్లి పుస్తకం, శ్రీరామరాజ్యం- ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతులు, ఉత్తమ చిత్రాలుగా నంది అవార్డులు గెలుచుకున్నాయి.

Mister-Pellam.jpg

1986లో ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారితో కలిసి ప్రతిష్టాత్మకమైన ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును అందుకున్నారు. 2013లో బాపు ‘పద్మశ్రీ’ గౌరవాన్ని స్వీకరించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పురస్కారాలతోపాటు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను అందుకున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్ తో కలిసి మరెన్నో అవార్డులు,గౌరవాలు అందుకున్నారు.

చివరి రోజులు

2011లో ముళ్ళపూడి వెంకటరమణ జీవితరంగం నుంచి నిష్క్రమించడంతో బాపు ‘గోడలేని చిత్తరువు’ అయ్యారు. ఎవరైనా సినిమా తీయమని వస్తే ‘బ్రహ్మగారు లేరు సినిమా ఎలా వస్తుంది?’ అనేవారు బాపు.

రమణగారు లేని బాపుగారి చివరి రోజుల గురించి రమణ గారి సతీమణి ముళ్ళపూడి శ్రీదేవి గారి మాటల్లో చెప్పాలంటే ‘రోజు రాత్రిపూట ఫోన్ చేసి ఎలా ఉన్నావయ్యా’ అని అడిగేందుకు రమణగారు లేరు. ‘వంట్లో బావుందా భోజనం చేశావా మందులు వేసుకున్నవా’ అని అడిగేందుకు రమణగారు లేరు. ‘ఏదన్నా సినిమా చూద్దామంటే పక్కన కూర్చునేందుకు రమణగారు లేరు’. ‘బొమ్మవేసి ఎలా ఉందయ్యా’ అని అడిగేందుకు రమణగారు లేరు. బావుందని చెప్పేందుకు రమణగారు లేరు. మంచి పుస్తకం చదివితే ఆ మాట చెప్పేందుకు రమణ గారు లేరు. ‘ఈ మినపరోట్టి బాగా వచ్చింది ఇవాళ –తిను’ అని తెచ్చిపెట్టేందుకు రమణగారు లేరు. మనసుకు కష్టం కలిగితే చెప్పుకునేందుకు రమణగారు లేరు. చేసిన పని నచ్చకపోతే, వాదించేందుకు పోట్లాడేందుకు రమణగారు లేరు. ఇలా కష్టపెట్టుకున్నారు బాపు గారు.

ఇంకా ఎన్ని రోజులు గడపాలి?

‘ఆ తర్వాత ఇంక బాపుగారికి అనారోగ్యం మొదలైంది. అసలు భాగ్యమతి (బాపు సతీమణి) పోయినప్పటినుంచి బాగా కుంగిపోయారు. యాభై- అరవై ఏళ్ళ తనతో కలిసి నడిచిన ఇద్దరూ ఒకళ్ల తర్వాత ఒకళ్లు తనని విడిచి వెళ్లిపోవడంతో మానసికంగా దెబ్బతిన్నారు. ఇంక కోలుకోలేక పోయారు. రోజు రోజుకీ దిగజారిపోయారు. పక్కన ఎవరూ లేని సమయంలో బాపుగారు-రమణ గారినీ, భాగ్యవతిని తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుండేవారు. ఇంకా ఇంకా బాధపడకుండా బాపుగారు-రమణగారిని, భాగ్యవతిని కలుసుకోవడానికి వెళ్ళిపోయారు- 2014లో ఆగస్టు 31న!

‘అందాల రాముడు’ చిత్రంలో ఒక డైలాగ్ ఉంది. ‘జీవితంలో చాలామందికి దొరికే బొమ్మలు నచ్చవు. నచ్చే బొమ్మలు దొరకవు’ అని బాపు బొమ్మలు చాలామందికి నచ్చుతాయి. నచ్చని బొమ్మలు ఆయన తీ(వే)యరు!

BK-ESWAR.jpg

- బి.కె. ఈశ్వర్

(సీనియర్ సినీ పాత్రికేయులు, రచయిత)

Updated Date - 2022-12-15T15:24:21+05:30 IST