Share News

రబీ ఆశలు ఆవిరి

ABN , First Publish Date - 2023-11-29T00:30:15+05:30 IST

రబీ సీజనలో కూడా రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో వర్షాభావంతో భారీగా పంటనష్టం వాటిల్లింది. పంట కీలక దశల్లో వర్షం పడకపోవడంతో వేరుశనగ, ఇతర రకాల పంటలు ఎండిపోవడంతో కోతకు ముందే పంటను రైతులు దున్నేశారు.

రబీ ఆశలు ఆవిరి
విడపనకల్లులో ఎండిపోయిన పప్పుశనగ

ఈ సీజనలోనూ వెంటాడిన వర్షాభావం భారీగా తగ్గిన పప్పుశనగ సాగు

అరకొర వర్షాలకు సాగు చేసిన పంట ఎండుముఖం

రక్షకతడులతో పంటను కాపాడాలంటున్న రైతులు

అనంతపురం అర్బన/పుట్లూరు, నవంబరు 28: రబీ సీజనలో కూడా రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో వర్షాభావంతో భారీగా పంటనష్టం వాటిల్లింది. పంట కీలక దశల్లో వర్షం పడకపోవడంతో వేరుశనగ, ఇతర రకాల పంటలు ఎండిపోవడంతో కోతకు ముందే పంటను రైతులు దున్నేశారు. రబీ సీజనలో అదే సీన రిపీట్‌ అయింది. అక్టోబరు మాసం నుంచి రబీ సీజన మొదలైంది. సీజన ఆరంభంలో అరకొరగా పడిన వానకు బెలుగుప్ప, తాడిపత్రి, పుట్లూరు, విడపనకల్లు, కణేకల్లు తదితర మండలాల్లో పప్పుశనగ సాగు చేశారు. పదును వర్షం కూడా కురవకపోవడంతో మిగతా ప్రాంతాల్లో ఎక్కువ శాతం విస్తీర్ణంలో పప్పుశనగ సాగు చేయలేకపోయారు. రబీ సీజనలో పంటల ఈ క్రాపింగ్‌ ప్రక్రియను ఇంకా మొదలు పెట్టలేదు. వర్షాభావంతో ఎండిపోయిన పంటను దున్నేసిన రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రాపింగ్‌ ఆధారంగానే పంటనష్టపరిహారం, పంటల బీమా, ఇతర రకాల లబ్ధిని ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇదివరకే ఎండిపోయిన పంటను దున్నేసిన రైతులకు ఈ క్రాపింగ్‌ చేయకుండా ఏ రకంగా న్యాయం చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బాధిత రైతులను ఆదుకోవాల్సి ఉంది. మరి ఏ మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.

భారీగా తగ్గిన పప్పుశనగ సాగు

రబీ సీజనలో సాధారణ సాగు విస్తీర్ణం 1.23 లక్షల హెక్టార్లు కాగా.. ఇందులో అత్యధికంగా పప్పుశనగ వాటా 78వేల హెక్టార్లు. కాగా మిగతా విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, జొన్న, రాగి, పెసలు, ఉలవలు, అలసందలు, పొద్దుతిరుగుడు తదితర రకాల పంటలు ప్రతి ఏడాది సాగు చేస్తూ వస్తున్నారు. ఈసారి సీజన ఆరంభంలో అరకొర వర్షాలకు పలు ప్రాంతాల్లో పప్పుశనగ పంట సాగు చేశారు. గతేడాది 1.07 లక్షల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో 60వేల ఎకరాల్లో మాత్రమే పప్పుశనగ సాగైంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పప్పుశనగ సాగు భారీగా తగ్గింది. ఇప్పటి దాకా జిల్లా వ్యాప్తంగా 34వేల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు సాగవ్వగా, ఇందులో 27వేల హెక్టార్లకే పప్పుశనగ సాగు పరిమితమైంది. ఈనెల 15 వతేదీనాటికే పప్పుశనగ సాగుకు అదును దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో మిగతా భూమిని బీడుగా పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

నిట్టనిలువునా ఎండిన పంట

రబీ ఆరంభంలో అరకొర వర్షాలకు సాగు చేసిన పప్పుశనగ పంట ఎండుముఖం పట్టింది. వర్షాభావంతో కళ్లెదుటే పంట ఎండిపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పటికే సీజనలో సాగుచేసిన విస్తీర్ణంలో 30 శాతం పంటఎండిపోవడంతో రైతులు దున్నేశారు. వర్షాభావంతో ఖరీప్‌ సీజన తరహాలోనే రబీ సీజనలోనూ ఎక్కువ శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో ఆకాశం మేఘావృతమైనా వర్షం పడటంలేదు. కనీసం ఓ మోస్తారు వర్షం కురిసినా ఇదివరకు సాగు చేసిన పంటలు చేతికందేవి. వర్షం పడకపోతే పంట లు పూర్తిగా చేతికి అందడం కష్టమే. ఎంత మొత్తం పరిహారం ఇచ్చినా పంటపండకపోతే ప్రజలు ఎలా జీవిస్తారు?

రక్షకతడులు ఇచ్చి కాపాడలేమా?

ఎండుముఖం పట్టిన పంటను బతికించేందుకు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదు. టీడీపీ హయాంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబునాయు డు రక్షక తడులు అందించి పంటను కాపాడేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలోనూ తగిన సమయంలో వర్షం పడకపోవడంతో వేరుశనగ, ఇతర రకాల పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. రబీ సీజనలోనూ అదే దుస్థితి తలెత్తింది. ఈ పరిస్థితుల్లో ఎండుతున్న పంటల పరిసర ప్రాంతాల్లో బోరుబావులను గుర్తించి రక్షక తడులు అందించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. పంటలు ఎండకుండా సాయం చేయలేని అధికారులకు వ్యవసాయ డిగ్రీలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పంటంతా ఎండుముఖం పట్టింది

సీజన ఆరంభంలోనే ఐదెకరాల్లో పప్పుశనగ సాగు చేశా. పంట సాగు చేసిన తర్వాత వర్షం పడకపోవడంతో పంటంతా ఎండుముఖం పడుతోంది. మరి కొద్దిరోజుల్లో వర్షం పడకపోతే పంటంతా ఎండిపోతుంది. ఓ మోస్తారు వర్షం వచ్చినా పంట బతుకుతుంది. వాన పడకపోతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నాం. వరుణ దేవుడు కరుణించి వర్షం కురిపిస్తే కాస్తో.. కూస్తో దిగుబడి వస్తుంది. లేదంటే పంటను దున్నేయాల్సిందే.

- రైతు శ్రీనివాసులురెడ్డి, గాండ్లపాడు, పుట్లూరు మండలం

పొలాన్ని బీడుగా ఉంచా..

11 ఎకరాల్లో పప్పుశనగ విత్తేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నా. 5.50 క్వింటా ళ్ల పప్పుశనగ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నా. పదును వర్షం కూడా పడకపోవడంతో పొలాన్ని బీడుగా పెట్టా. పప్పుశనగ సాగుకు సమయం కూడా దాటిపోయింది. ఈ సారి పొలాలన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.

- రైతు శివశంకర్‌రెడ్డి, శనిగలగూడురు, పుట్లూరు మండలం

Updated Date - 2023-11-29T00:30:18+05:30 IST