Share News

దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం

ABN , First Publish Date - 2023-11-29T02:20:48+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి జిల్లాలో లక్షకు పైగా దొంగ ఓట్లున్నాయని.. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తారు. దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని మండిపడ్డారు.

దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం
దొంగ ఓటర్ల జాబితాను కలెక్టర్‌కు అందిస్తున్న నాని, సుగుణమ్మ, నరసింహయాదవ్‌, హేమలత తదితరులు

- ఆధారాలు సమర్పించినా అఽధికారులు స్పందించడం లేదు

  • కలెక్టర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

తిరుపతి(కలెక్టరేట్‌), నవంబరు 28: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి జిల్లాలో లక్షకు పైగా దొంగ ఓట్లున్నాయని.. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తారు. దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని మండిపడ్డారు. చిత్తూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు నరసింహయాదవ్‌,మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ,హేమలత, నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు మంగళవారం కలెక్టర్‌ వెంకటరమణారెడ్డిని కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు.ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 70 వేల దొంగ ఓట్లున్నాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.ఎన్నికల సంఘం యాప్‌లో పీఎ్‌సఈ(ఫొటో సిమిలర్‌ ఎంట్రీ)లో 13,295ఓట్లుండగా అధికారులు 12,050 ఓట్లే చూపిస్తున్నారని, డీఎ్‌సఈ(డెమోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీ) లో 24వేలు చూపిస్తుండగా ఈఆర్వో మాత్రం 1,717ఓట్లున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇష్టమొచ్చిన రీతిలో దొంగ ఓట్లను నమోదు చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. చంద్రగిరి ఎనిమిది నియోజకవర్గాల మధ్యలో ఉండడంతో ఆయా నియోజకవర్గాల నుంచి తమకు అనుకూలమైన వారి ఆధార్‌కార్డులు, ఫొటోలు సేకరించి చెవిరెడ్డి దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని, అందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇక దామినేడు, పాడిపేట హౌసింగ్‌ కాలనీల్లో విచ్చలవిడిగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. పాడిపేట హౌసింగ్‌ కాలనీలో 3,266 ఇళ్లకు గాను 729 కాపురాలు మాత్రమే ఉన్నాయని అక్కడ కూడా 1,200 ఓట్లు కొత్తగా నమోదు చేయించారని వీటి వెనుక అధికార పార్టీకి ఎలక్షన్‌ డీటీలు, రెవెన్యూ అధికారులు సహకరించారని ఆరోపించారు. ఆరు మండలాలకు సంబంధించిన దొంగ ఓట్ల పత్రాలను అందించి ఇప్పటికైనా స్పందించి ప్రింటింగ్‌లో వున్న దొంగఓట్లను తొలగించాలని కలెక్టర్‌ను కోరారు.రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన ఏ ఒక్క అధికారినీ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.తిరుపతి నియోజకవర్గంలో 34వేలు, గూడూరులో పదివేలు, వెంకటగిరిలో 8వేలు.....అన్ని నియోజకవర్గాల్లో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని, షిఫ్టింగ్‌, డెత్‌, డబుల్‌ఎంట్రీలు తొలగించాలని పదేపదే కోరుతున్నా అధికారుల్లో స్పందన కరువైందని వాపోయారు.తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్‌ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే వైసీపీ గెలిచిన విషయం అందరికీ తెలిసేందనన్నారు.ముసాయిదా జాబితాలో ఉన్న దొంగ ఓట్లు తొలగించి డిసెంబరు 9న పారదర్శక ఓటర్లజాబితా ఇవ్వాలని కోరారు.తిరుపతిలో తహసీల్దారు కార్యాలయం కేంద్రంగా దొంగ ఓట్ల ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు.ఆయా నియోజకవర్గాల వారీగా నమోదయిన దొంగ ఓట్ల రికార్డులను కలెక్టర్‌కు అందించారు.ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటున్నామని, ఖచ్చితంగా పారదర్శకమైన ఓటర్ల జాబితానే అందిస్తామని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.టీడీపీ నాయకులు శ్రీధర్‌వర్మ,పులిగోరు మురళి, అమిలినేని మధు, ఈశ్వరరెడ్డి, మధుశేఖర్‌, దంపూరి భాస్కర్‌, కిషోర్‌, మునిశేఖర్‌, కత్తి సుధ,సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T02:20:50+05:30 IST