Share News

పారామెడికల్‌ పోస్టులను పంచుకున్నారు!

ABN , First Publish Date - 2023-11-29T02:24:16+05:30 IST

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు రూ.కోట్లను జేబుల్లో వేసుకున్నారు.73 పారామెడికల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి మెరిట్‌లిస్టు, సెలక్షన్‌ లిస్టు విడుదల చేయకనే అపాయింట్‌మెంటు ఆర్దర్లు కొంతమందికి ఇచ్చేశారన్న విషయం వెలుగులోకి రావడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు.

పారామెడికల్‌ పోస్టులను పంచుకున్నారు!

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు రూ.కోట్లను జేబుల్లో వేసుకున్నారు.73 పారామెడికల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి మెరిట్‌లిస్టు, సెలక్షన్‌ లిస్టు విడుదల చేయకనే అపాయింట్‌మెంటు ఆర్దర్లు కొంతమందికి ఇచ్చేశారన్న విషయం వెలుగులోకి రావడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు.

తిరుపతి సిటీ, నవంబరు 28 : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులతో పాటు, రుయాస్పత్రి పరిధిలో ఖాళీగా ఉన్న 73 పారామెడికల్‌ పోస్టులకు అక్టోబరు 6న నోటిఫికేషన్‌ విడుదల చేశారు.6 నుంచి 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు పెట్టారు.24న ధరఖాస్తుల పరిశీలన, 25న ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల, 26, 27తేదీల్లో అభ్యంతరాలు చెప్పుకునేందుకు గ్రీవెన్స్‌ నిర్వహణ, 31న ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల,నవంబరు 3న అర్హులైన అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి అదేరోజు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను ఇస్తారని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పొందుపరిచారు. ఇదంతా డిస్ర్టిక్‌ సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించాల్సి వుంది. అయితే ఈ ఉద్యోగాలకు ఎంత డిమాండ్‌ ఉందనేది తెలుసుకునేందుకు మాత్రమే ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లుంది.ఎందుకంటే మెరిట్‌ లిస్టు, ప్రొవిజనల్‌ లిస్టు, ఫైనల్‌ లిస్టు వంటి వాటివి కాదు కదా కనీసం కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించకనే పదిరోజుల క్రితం కొందరు అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చేశారు.వారంతా ఒక్కొక్కరుగా ఈ వారం రోజుల్లో ఉద్యోగాల్లో చేరారు. ఇందులో మరొక విశేషం ఏంటంటే రుయాస్పత్రిలో 2 థియేటర్‌ అసిస్టెంటు పోస్టులు అవుట్‌సోర్సింగ్‌ అని నోటిఫికేషన్‌లో ఉన్నా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లో మాత్రం కాంట్రాక్టు అని ఉండడం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కొందరు వైసీపీ ముఖ్య నేతలు పారా మెడికల్‌ ఉద్యోగాలను వారి హోదాలకు తగిన రీతిలో పంచుకున్నట్లు సమాచారం.ఒక్కో పోస్టుకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇప్పించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నోటిఫికేషన్‌ పేరుతో మొత్తం మీద దాదాపు రూ. 2 కోట్లకు పైగానే చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.

రెండు నెలలుగా ఎదురు చూపుల్లోనే అభ్యర్థులు

పారామెడికల్‌ పోస్టులకు సుమారు 5 వేల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇప్పటికీ అసలు విషయం తెలియక మెరిట్‌లిస్టు విడుదలవుతుంది, కౌన్సెలింగ్‌కు పిలుస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువమంది 40ఏళ్లు దాటిన వారే ఉ న్నారు. వీరికి ఇదే చివరి అవకాశం కావడంతో తప్పక ఉద్యోగం వస్తుందనే ధీమాతో ఉన్నారు. అసలు విషయం తెలుసుకున్న కొందరు అభ్యర్థులు మాత్రం ఆర్టీఐ యాక్టు కింద సమాచారం అడిగేందుకు కార్యాలయాల చుట్టూ తి రుగుతున్నారు.అధికారులు మాత్రం వారి దరఖాస్తులు స్వీకరించకుండా ఇది తమ పరిధిలో జరిగింది కాదని, జిల్లా అధికారుల నుంచి వచ్చిన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్ల మేరకు విధుల్లోకి తీసుకుంటున్నామని చెబుతున్నారు.

Updated Date - 2023-11-29T02:24:17+05:30 IST