Share News

తిరుపతి కమిషనర్‌కు వారెంట్‌

ABN , First Publish Date - 2023-11-29T02:22:20+05:30 IST

తిరుపతిలో గ్రూప్‌ థియేటర్స్‌ అధినేత, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి చెందిన స్థల వివాదంలో కోర్టు ధిక్కారంపై తిరుపతి మున్సిపల్‌ అధికారులకు హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

తిరుపతి కమిషనర్‌కు వారెంట్‌

గ్రూప్‌ థియేటర్స్‌ వివాదంలో

కోర్టు ధిక్కరణపై హైకోర్టు ఆదేశం

తిరుపతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : తిరుపతిలో గ్రూప్‌ థియేటర్స్‌ అధినేత, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి చెందిన స్థల వివాదంలో కోర్టు ధిక్కారంపై తిరుపతి మున్సిపల్‌ అధికారులకు హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. పిటీషనర్‌ తరపు న్యాయవాధి ఎన్‌.అశ్విన్‌ కుమార్‌ వాదన విన్న జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌ రావు ఈనెల 23న మున్సిపల్‌ కమిషనర్‌ హరిత, అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి బాలసుబ్రమణ్యంలను బాధ్యులుగా చేస్తూ తీర్పు ఇచ్చారు.తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ఫిబ్రవరి నెలలో జరిగిన రోడ్డు విస్తరణ పనులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ గ్రూప్‌ థియేటర్స్‌ యాజమాన్యం తరపున చదలవాడ కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అప్పటికే గ్రూప్‌ థియేటర్‌కు చెందిన కొంతమేర గోడను తొలగించి, కోర్టు ఉత్తర్వుల మేరకు పనులు నిలిపివేశారు. అయితే గంగజాతర లోపు పనులు పూర్తిచేయాలని భావించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఏప్రిల్‌ 24న నగర అభివృద్ధి కోసం సహకరించాలని చదలవాడను కోరారు. వందేళ్ల కిత్రం బొబ్బిలి రాజా వారు నిర్మించిన గ్రూప్‌ థియేటర్స్‌ స్థలానికి ఒరిజనల్‌ పట్టా ఉందని, అలాంటిది అక్రమంగా గోడ తొలగించడం భావ్యం కాదని చదలవాడ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.చదలవాడ అల్లుడు వైసీపీ ఎమ్మెల్యే కావడంతో ఆయన ద్వారా రాజీ ప్రయత్నం చేసి వివాదానికి తెరవేసి రోడ్డును పూర్తిచేశారు. అయితే మున్సిపల్‌ అధికారులు హైకోర్టుకు హాజరై సరైన నివేదిక సమర్పించకపోవడంతో ధిక్కారం కింద బెయిలబుల్‌ వారంట్‌ అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోర్టు ఆదేశించింది. కాగా రోడ్డుకు అంగీకరించడం వలనే గ్రూప్‌ థియేటర్స్‌కు ప్రహరీ గోడ కూడా చదలవాడే నిర్మించుకున్నారని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-11-29T02:22:20+05:30 IST