Share News

ఏం వెలగబెట్టారని ?

ABN , First Publish Date - 2023-11-29T02:15:10+05:30 IST

గత టీడీపీ ప్రభుత్వం డక్కిలి మండలం ఆల్తూరుపాడు వద్ద రూ. 270 కోట్లతో రిజర్వాయర్‌ పనులు ప్రారంభించింది

ఏం వెలగబెట్టారని ?
కలువాయి మండలంలో అసంపూర్తిగా సోమశిల-కండలేరు కాలువ విస్తరణ పనులు కలువాయి మండలంలో అసంపూర్తిగా సోమశిల-కండలేరు కాలువ విస్తరణ పనులు

ఆల్తూరుపాడు

పనులు పూర్తి చేసేదెవరు?

గత టీడీపీ ప్రభుత్వం డక్కిలి మండలం ఆల్తూరుపాడు వద్ద రూ. 270 కోట్లతో రిజర్వాయర్‌ పనులు ప్రారంభించింది.వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ టెండర్లను రద్దు చేసి రివర్స్‌ టెండర్లు నిర్వహిస్తామని ప్రకటించింది. తర్వాత పట్టించుకోకపోవడంతో నాలుగున్నరేళ్ళుగా పనులాగిపోయాయి. నిర్మాణ పనుల్లో భాగంగా ఆల్తూరుపాడు చెరువు కట్టను తొలగించి వుండడంతో నీరు నిలవడం లేదు. దీంతో చెరువు కింద ఆయకట్టు రైతులు నాలుగేళ్ళుగా పంటలు సాగు చేయడం లేదు. ఇదే మండలం మార్లగుంట వద్ద తెలుగు గంగ 3వ బ్రాంచి కాలువ నిర్మాణ పనులు 20 ఏళ్ళుగా పెండింగులో వున్నందున 3 వేల ఎకరాలకు సాగునీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

  • అసంపూర్తిగా రిజర్వాయర్‌ పనులు

ఆగిన కండలేరు కాలువ విస్తరణ పనులు

తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన సోమశిల-కండలేరు వరద కాలువ సామర్ధ్యం 12 వేల క్యూసెక్కులు కాగా దాన్ని 24 వేలకు పెంచింది ప్రస్తుత ప్రభుత్వం. దానికోసం కాలువ విస్తరణకు గానూ రూ.776 కోట్లతో 2021 జూన్‌లో పనులు ప్రారంభించింది. రెండున్నరేళ్ళు అవుతున్నా 30 శాతం పనులు కూడా జరగలేదు. చేసిన పనులకు ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించక పోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాలువ విస్తరణ పూర్తయితే అదనంగా 50 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాలకు, చెన్నై నగరానికి నీరు అందే అవకాశముంది.

  • బిల్లులు రాక ఆగిన నిర్మాణం

డక్కిలిలో తహసిల్దారు కార్యాలయ నూతన భవనమిది.నిర్మాణం దాదాపు పూర్తయి ఫినిషింగ్‌ పనులు మాత్రమే పెండింగులో వున్నాయి. అయినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టరు పనులు ఆపేశారు. రాపూరు మండలంలో తహసిల్దారు, సబ్‌ ట్రెజరీ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రూ. 1.50 కోట్లతో చేపట్టిన భవనాల నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయి రెండేళ్ళవుతోంది. దాదాపుగా అన్ని మండలాల్లోనూ పలు సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణం బిల్లులందని కారణంగా ఆగిపోయి వున్నాయి.

  • ప్రమాదకర స్థితిలో హాస్టల్‌ భవనాలు

వెంకటగిరిలోని మూడవ నంబరు సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌ భవనం దుస్థితి ఇది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో పైకప్పు కిందకు వంగిపోయి కాంక్రీటు పెచ్చులూడిపోయి ఇనుప కమ్ములు కనిపిస్తున్నాయి.ఇక్కడే నాలుగో నంబరు హాస్టల్‌ పరిస్థితి కూడా ఇలానే వుంది. జడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలోని బాలికల హాస్టల్‌ భవనం, డక్కిలి, కలువాయిల్లోని బీసీ బాలుర హాస్టల్‌ భవనాలు శిధిలావస్థకు చేరుకుని కూలిపోయే స్థితిలో వున్నాయి. రాపూరు పశువైద్యశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాలతో పాటు వెంకటగిరి ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ అతిధి గృహాల భవనాలు కూడా కూలేందుకు సిద్ధంగా వున్నాయి.

  • సైదాపురం మండలంలో క్వార్డ్జ్‌, పల్‌స్పర్‌, మైకా వంటి ఖనిజాలు అపారంగా వున్నాయి. దాదాపు ప్రతి గ్రామ పరిధిలోనూ నిక్షేపాలున్నాయి. 19 మైన్లకు లీజు గడువు ముగిసిపోగా అధికార పార్టీ నేతలు వాటిల్లో అక్రమంగా మైనింగ్‌ జరుపుతున్నారు. ఈ ఖనిజాల కోసం ప్రభుత్వ, అటవీ భూముల్లో సైతం ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. మండలంలో ఈ ఖనిజాలకు సంబంధించి 200కు పైగా డంపింగ్‌ యార్డులున్నాయి. ప్రభుత్వ, అటవీ భూముల్లో తవ్వకాలు జరిపి వెలికి తీసిన ఖనిజాలను రాత్రిళ్ళు ఈ డంపింగ్‌ యార్డులకు చేరవేస్తున్నారు. తెల్లారే సరికి ఆ నిల్వలు అఽనుమతి వున్న మైన్లలో తవ్వితీసిన ఖనిజ నిల్వలుగా మారిపోతున్నాయి. ఇపుడు క్వార్ట్జ్‌ ధర టన్నుకు రూ. 9 వేలు పలుకుతుండగా అధికార పార్టీ నేతలు రూ. 5 వేలకే సరఫరా చేయాలని హుకుం జారీ చేసినట్టు సమాచారం.

  • ఐఐహెచ్‌టీలో టీచింగ్‌ పోస్టులేవీ?

వెంకటగిరిలో 1992లో ఏర్పాటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తోంది. లెక్చరర్‌, ఇన్‌స్ట్రక్టర్‌ వంటి రెగ్యులర్‌ టీచింగ్‌ పోస్టులు 12 వుంటే ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ లెక్చరర్లు వున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన నలుగురు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఇద్దరు పనిచేస్తున్నారు. మిగిలిన నాలుగు పోస్టులు ఖాళీగా వున్నాయి. అనుభవజ్ఞులైన రెగ్యులర్‌ టీచింగ్‌ సిబ్బంది లేకపోవడం విద్యార్థుల సంఖ్యపై ప్రభావం చూపుతోంది. 180 సీట్లకు గానూ ఇపుడు 70 మంది వున్నారు. బాలురకు, బాలికలకు హాస్టల్‌ సదుపాయం కూడా లేదు. నిధుల కొరత దీనికి కారణం. వీటిపై ప్రభుత్వం దృష్టిపెట్టిన దాఖలాలు లేవు.

  • వీటిని రోడ్లంటారా ?

సైదాపురం-పొదలకూరు మార్గంలో రోడ్డుపై గోతులు రహదారుల దుస్థితికి అద్దం పడుతున్నాయి.రాపూరు-గూడూరు, వెంకటగిరి-గూడూరు, వెంకటగిరి- నాయుడుపేట వంటి ప్రధాన రోడ్లు సైతం మోకాటి లోతు గోతులు ఏర్పడి దారుణంగా దెబ్బతిన్నాయి. మొత్తం ఆరు మండలాల్లో ప్రధాన రోడ్లతో పాటు గ్రామీణ రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. డక్కిలి మండలం వీరాయపాళెం రోడ్డు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే శంకుస్థాపన చేసినా ఇంతవరకూ పనులు మొదలు కాలేదు. ఇదే మండలం కొత్తపల్లి రోడ్డు సుమారు మూడు కిలోమీటర్ల మేర గుంతలు ఏర్పడడంతో ఆ గ్రామానికి 108 వాహన సేవలు కూడా నిలిచి పోయాయి. వర్షాలకు గోతుల్లో నీరు నిలిచి లోతు తెలియక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

  • వెక్కిరిస్తున్న శిలాఫలకం

డక్కిలి మండల పరిషత్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 80 లక్షలు మంజూరు చేసింది. నిర్మాణ పనులకు తొమ్మిది నెలల కిందట శంకుస్థాపన కూడా జరిగింది. అయితే ఇంతవరకూ పనులు మొదలు కాలేదు. టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. పనులు చేసినా బిల్లులు రావనే భయం వెంటాడుతున్నందున ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

  • రాపూరులో పరిశ్రమలేవీ ?

నిరుద్యోగ సమస్య తీవ్రంగా వున్న రాపూరులో పరిశ్రమలు నెలకొల్పుతానని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి అధిష్టించి నాలుగున్నరేళ్ళు పూర్తి కావస్తున్నా ఇంతవరకూ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. సరికదా కనీసం పారిశ్రామికవాడకు భూముల కేటాయింపు కూడా జరగలేదు.

Updated Date - 2023-11-29T02:15:11+05:30 IST