Pilli Subhash chandra Bose: రామచంద్రాపురం వైసీపీలో ఆధిపత్య పోరు.. పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-07-23T13:51:26+05:30 IST

స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం సద్దుమణగలేదు. మంత్రి వేణు, ఎంపీ బోసు నువ్వా? నేనా? అన్నట్టు ఇరు వర్గాలు తలపడుతున్నాయి. తనకు వ్యతిరేకంగా మంత్రి వేణు వర్గం పనిచేస్తున్నా.. అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఎంపీ బోసు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వచ్చే నెలలో ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.

Pilli Subhash chandra Bose: రామచంద్రాపురం వైసీపీలో ఆధిపత్య పోరు.. పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

కోనసీమ జిల్లా: రామచంద్రాపురం వైసీపీ (YCP)లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ (Chelluboyina Venugopal), ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరి పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) వరకు చేరుకుంది. సయోధ్యకు ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) యత్నించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమే అయింది.

స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం సద్దుమణగలేదు.. వివాదం మరింత ముదిరిపోయింది. ముఖ్యంగా ఇక్కడ మంత్రి వేణు, ఎంపీ బోసు నువ్వా? నేనా? అన్నట్టు ఇరు వర్గాలు తలపడుతున్నాయి. తనకు వ్యతిరేకంగా మంత్రి వేణు వర్గం పనిచేస్తున్నా అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఎంపీ బోసు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వేణుకు టికెట్ ఇస్తే వైసీపీకి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను లేదంటే తన కొడుకు రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని అన్నారు. వేణుతో విబేధాల జగన్ తనను పిలిచి మాట్లాడారని, మంత్రి వేణుతో కూర్చుని చర్చిస్తానని జగన్ తనతో చెప్పారన్నారు. అయితే వేణుతో భేటీకి తాను రానని జగన్ కు చెప్పానని పిల్లి సుభాష్ చెప్పారు. ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు చెప్పానని అన్నారు. వేణు చెప్పు కింద బతికే వాళ్ళు నియోజకవర్గం లో ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవసరమైతే వైసీపీకి గుడ్‌బై..

ఇరువురి మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితుల్లో వచ్చే నెలలో ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేసేందుకు పిల్లి సుభాస్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం మంత్రి వేణుకే టిక్కెట్ ఖరారు చేస్తే.. ఇండిపెండెంట్‌గానైనా లేదా టీడీపీ తరఫున బరిలోదిగి వేణును ఓడించాలని నిర్ణయించారు. స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ మంత్రి వర్సెస్ బోసుగా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి వేణు వర్గం వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రిగా వేణు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను సన్మానించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై తనకు సమాచారం లేదని పిల్లి సుభాష్ చెబుతున్నారు. మరోవైపు గతవారం బోస్ వర్గం నిర్వహించిన సమావేశంలో రాబోయే ఎన్నికల్లో బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తారని మంత్రికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దీంతో మూడేళ్ల బలప్రదర్శన కార్యక్రమం ఇప్పుడు రెండు వర్గాల ఆధిపత్యపోరును మరోసారి బయటపెట్టింది. ఎవరికి వారే నేతలు ఇష్టనుసారం వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-07-23T14:32:10+05:30 IST