Share News

జనవరికి అంబేడ్కర్‌ స్మృతివనం సిద్ధం

ABN , First Publish Date - 2023-11-28T01:01:48+05:30 IST

బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం జనవరి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. స్వరాజ్య మైదానంలో నిర్మితమవుతున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం పనులను మంత్రి సోమవారం ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.

జనవరికి అంబేడ్కర్‌ స్మృతివనం సిద్ధం

కృష్ణలంక/వన్‌టౌన్‌, నవంబరు 27 : బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం జనవరి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. స్వరాజ్య మైదానంలో నిర్మితమవుతున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం పనులను మంత్రి సోమవారం ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అంబేడ్కర్‌ స్మృతివనం పనులు సుమారు రూ.410 కోట్ల వ్యయంతో 20 ఎకరాల స్థలంలో చేస్తున్నామన్నారు. కన్వెన్షన్‌ సెంటర్‌, శ్లాబ్‌ పనులు పూర్తి కావచ్చాయన్నారు. థియేటర్‌, మ్యూజిక్‌ ఫౌంటేన్‌, స్మారక మ్యూజియం, స్మారక హాల్‌, గ్రంథాలయం వంటి నిర్మాణాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రపంచ, దేశ పర్యాటకులను ఆకర్షించే విధంగా నిర్మాణాలు చేస్తున్నామన్నారు. విగ్రహం కింది భాగంలో అంబేడ్కర్‌ జీవిత విశేషాలను భవిష్యత్‌ తరాలు తెలుసుకొనే విధంగా మినీ థియేటర్‌ 1600 మంది కూర్చునే విధంగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం చేస్తున్నామని, జనవరి నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

అంబేడ్కర్‌ ఆశయాల స్పూర్తితో పాలన

- మంత్రి కొట్టు సత్యనారాయణ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాల స్పూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాలన సాగిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అంబేడ్కర్‌ స్మృతివనం పనులను సోమవారం మంత్రి సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, పనులను సత్వరం పూర్తి చేసి ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-11-28T01:01:50+05:30 IST