Share News

డిసెంబర్‌ 15 నుంచి ఆడుదాం ఆంధ్రా

ABN , First Publish Date - 2023-11-29T00:32:41+05:30 IST

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ నూరు శాతం జరిపి ప్రతి క్రీడాకారుడు ప్రాతినిధ్యం వహించేలా చూడాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు.

డిసెంబర్‌ 15 నుంచి ఆడుదాం ఆంధ్రా

కృష్ణలంక, నవంబరు 28 : ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ నూరు శాతం జరిపి ప్రతి క్రీడాకారుడు ప్రాతినిధ్యం వహించేలా చూడాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు. డిసెంబరు 15వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైన నేపధ్యంలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్‌ దిల్లీరావు మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ సహా జిల్లాలోని 20 మండలాలలో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి క్రీడాకారుల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా క్రీడాకారులు గ్రామ, వార్డు సచివాలయాలలో పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించే ఈ క్రీడలలో ప్రతి క్రీడాకారుడు ప్రాతినిధ్యం వహించేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో 245 క్రీడా మైదానాల్లో క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ వంటి ప్రముఖ క్రీడలతో పాటు స్థానిక ప్రాధాన్య క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి సచివాలయం నుంచి కనీసం రెండు జట్లు తప్పనిసరిగా పోటీలో పాల్గొనేలా చూడాలన్నారు. క్రీడాకారులు 1902 నంబర్‌కు కాల్‌ చేసి లేదా తమ సమీపంలోని సచివాలయం నందు రిజిస్ర్టేషన్‌ చేసుకొనే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, క్రీడలకు సంబంధించిన నియోజకవర్గ స్థాయిలో రూ.35 వేలు ప్రథమ బహుమతి, రూ.15 వేలు ద్వితీయ బహుమతి, రూ.5 వేలు తృతీయ బహుమతిని.. జిల్లా స్థాయిలో రూ.60 వేలు ప్రథమ, రూ.30 వేలు ద్వితీయ, రూ.10 వేలు తృతీయ బహుమతిగాను రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలు ప్రథమ, రూ.3 లక్షలు ద్వితీయ, రూ.2 లక్షలు తృతీయ బహుమతులుగా క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను అందచేసే సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలపాలన్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన క్రీడా పరికరాలను ఇప్పటికే క్రీడాకారులకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో క్రీడా పోటీలను విజయవంతం చేసి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ అన్నారు. మండలాల వారీగా ఎంపీడీవోలతో రిజిస్ర్టేషన్‌పై సమీక్షిస్తూ వెనుకబడిన మండలాల్లో మరింత వేగవంతంగా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌, నోడల్‌ ఆఫీసర్‌ పి.సంపత్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, గ్రామ, వార్డు, సచివాలయాల ప్రత్యేక అధికారి కొడాలి అనురాధ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని, క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ అజీజ్‌, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఉన్నారు.

Updated Date - 2023-11-29T00:32:42+05:30 IST