Share News

ఓటర్ల జాబితా రూపకల్పనకు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2023-11-29T00:25:40+05:30 IST

ఓటర్ల జాబితాలో అవకతవకలు పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్దాపురంలో తెలంగాణా ఓటర్లల వ్యవహారం జిల్లా పరిశీలకుల దృష్టికి వచ్చింది.. తెలంగాణా ఓట్ల వ్యవహారం, విజయవాడ సెంట్రల్‌ డబ్లింగ్‌ డెత్‌ ఓట్లపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేయడంతో.. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేక అధికారి ఆరా తీశారు. విజయవాడ సెంట్రల్‌లోనే 257 పోలింగ్‌ బూత్‌లకు గాను.. 152 పోలింగ్‌ బూత్‌లలో ఎనిమిది వేల డబ్లింగ్‌, డెత్‌ ఓట్లు గుర్తించారు. మిగిలిన బూత్‌లు కూడా పరిశీలిస్తే పది వేలు దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఓటర్ల జాబితా రూపకల్పనకు సమన్వయంతో పనిచేయాలి
డబ్లింగ్‌, డెత్‌ ఓట్లపై ఫిర్యాదు చేస్తున్న నెట్టెం రఘురాం

కృష్ణలంక, నవంబరు 28 : ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎ్‌సఆర్‌) ఏటా జరిగే ప్రక్రియ అని.. అయితే ఎన్నికలకు ముందు జరుగుతున్నందున ఎస్‌ఎ్‌సఆర్‌-2024కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని.. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు సమన్వయంతో పనిచేస్తూ దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషిచేయాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కార్యదర్శి బి.శ్రీధర్‌ అన్నారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ ఆదితిసింగ్‌తో కలిసి ఎస్‌ఎ్‌సఆర్‌-2024పై ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆయా నియోజకవర్గాల ఈఆర్‌వోల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా జిల్లాలో చేపట్టిన సవరణ ప్రక్రియ పురోగతిని కలెక్టర్‌ దిల్లీరావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎస్‌ఎ్‌సఆర్‌ సవరణ ప్రక్రియలో ఈవీఎంల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కీలక భాగస్వామ్యం అందించినట్టు వెల్లడించారు. సవరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు సూపర్‌వైజరీ చెక్‌ చేస్తున్నట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు.

జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు శ్రీధర్‌ మాట్లాడుతూ, అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రూపొందిన స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ఎన్నికల నిర్వహణ విజయవంతమవుతుందని, ఎస్‌ఎ్‌సఆర్‌-2024 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలకు వెళ్తున్నందున ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సవరణ ప్రక్రియలో కీలకమైన బీఎల్‌వోలు క్రియాశీలకంగా వ్యవహరించేలా నిత్యం మార్గదర్శనం చేయాలన్నారు. బీఎల్‌వోలు పోలింగ్‌ స్టేషన్లలో అందుబాటులో వుండేలా చూడాలని.. వారి వద్ద కొత్తగా ఓటరుగా నమోదుకు అవసరమైన ఫారం-6తో పాటు వివిధ రకాల ఫారాలను అందుబాటులో వుండేలా చూడాలన్నారు. అర్హత వున్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేయించుకొనేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని.. విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటు నమోదుకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానాలను వివరించాలన్నారు. డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ప్రచార శిబిరాల ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు వచ్చేలా చూడాలని సూచించారు. 18-19 ఏళ్ల కేటగిరిపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో తమ దృష్టికి తెచ్చిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిష్కరించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో వారిచ్చిన విలువైన సూచనలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వరరావు, తిరువూరు ఆర్డీవో కె.మాధవి, నందిగామ ఆర్డీవో సాయిబాబా, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌.దుర్గాప్రసాద్‌ తదితరులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

అభ్యంతరాలు లేని జాబితా రూపొందిస్తాం..

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఓటర్ల జాబితాలపై ఎలాంటి అపోహలకు తావులేదని, పారదర్శకంగా జాబితాలను తయీరుచేస్తున్నట్టు కృష్ణాజిల్లా ఫొటో ఓటర్ల జాబితాల సంక్షిప్త సవరణ పర్యవేక్షకుడు బి.శ్రీధర్‌ తెలిపారు. కలెక్టర్‌ పి.రాజాబాబుతో కలిసి జిల్లాలోని వివిధ రాజకీయపార్టీల నాయకులు, ఈఆర్వోలతో కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల సవరణలపై అన్ని రాజకీయపార్టీల నాయకుల ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందన్నారు. వాటిని పరిశీలన చేసి ఎవరికీ అభ్యంతరం లేని జాబితాలను తయారు చేస్తామన్నారు. కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ, ఒకే ఇంటి వారు రెండు పోలింగ్‌బూత్‌లో ఓటర్లుగా ఉన్నారని, మరణించిన, వలసవెళ్లినవారు, డబుల్‌ఎంట్రీ పేర్లు ఉన్నాయని జిల్లాలో అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిని పరిశీలనచేసి జిల్లాలో 55686 ఓట్లను తొలగించడం జరిగిందన్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో 1140 ఓట్లకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఒక ఓటరు పేరు రెండు నియోజకవర్గాల్లో నమోదై ఉందనే అంశాలపైనా ఫిర్యాదులు అందాయని, వివాహం చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళాఓటర్ల పేర్లు రెండు నియోజకవర్గాలలో ఉన్నట్టుగా గుర్తించామన్నారు.

ఓటర్ల జాబితా తారుమారు చేశారు..

ఓటర్ల జాబితాలో అవకతవకలు సరిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ అన్నారు. చనిపోయిన, వలసవెళ్లిన ఓటర్ల పేర్లను జాబితాల తొలగించాలని కోరారు. పారదర్శకంగా ఓటర్ల జాబితాలను తయారు చేయాలన్నారు. టీడీపీ నాయకుడు ఐ దిలీ్‌పకుమార్‌ మాట్లాడుతూ, బూత్‌లెవల్‌ అధికారులపై అధికారపార్టీ నేతలు ఒత్తిడిపెడుతున్నారన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఓటర్లజాబితాల సవరణ జరగలేదన్నారు. యశ్వంత్‌ మాట్లాడుతూ, ఓటర్లజాబితాల సవరణ ప్రారంభమై 80 రోజులు గడిచిందని, మచిలీపట్నం నియోజకవర్గంలో 130 పోలింగ్‌బూత్‌లలో పరిశీలనచేసి 29వేలఓట్లు సక్రమంగా లేవని గుర్తించామని, ఈ విషయంపై ఆగస్ట్టునెలలోనే ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

మృతుల పేర్లు తొలగించలేదు : వర్లకుమార్‌ రాజా

పామర్రు టీడీపీ ఇన్‌చార్జి వర్లకుమార్‌రాజా మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల సమగ్రసర్వే జరిగినా మృతిచెందిన ఓటర్ల పేర్లను జాబితాల్లో అలానే ఉంచారన్నారు. కుటుంబసభ్యులు చెప్పినా, బూత్‌లెవల్‌ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. పనిగట్టుకుని భార్య, భర్తల పేర్లను కూడా జాబితాల్లో మార్చివేశారన్నారు. వైసీపీ నేత బందెల థామ్‌స నోబుల్‌ మాట్లాడుతూ, వలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలను పరిశీలన చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా పొరపాట్లు లేకుండా రూపొందించాలని టీడీపీ నేతలు బి.శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు.

భారీ సంఖ్యలో డబ్లింగ్‌, డెత్‌ ఓట్లు..!

ఓటర్ల జాబితా పరిశీలకుడు శ్రీధర్‌కు ఎన్టీఆర్‌జిల్లా టీడీపీ నేతల ఫిర్యాదు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పెద్దాపురంలో తెలంగాణా బోగస్‌ ఓట్ల అంశం ఆంధ్రజ్యోతిలో కథనం ద్వారా జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక అధికారి శ్రీధర్‌ దృష్టికి వెళ్ళింది. కలెక్టర్‌ దిల్లీరావును దీనిపై అడిగి తెలుసుకున్నారు. విచారణకు ఆదేశించినట్టు కలెక్టర్‌, ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిసింది. పెద్దాపురం తెలంగాణా బోగస్‌ ఓట్ల అంశాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావులు ఓటర్ల జాబితా ప్రత్యేక అధికారి శ్రీధర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో పాటు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో డబ్లింగ్‌, డెత్‌ ఓట్లు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. భారీ సంఖ్యలో డబ్లింగ్‌ ఓట్లు ఉండటం రాజకీయ పార్టీలకు భయాన్ని కలిగిస్తోంది. డ్రాప్ట్‌ ఓటర్ల జాబితా అందించినప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్లింగ్‌, డెత్‌ ఓట్లకు సంబంధించి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా తొలగించటం లేదు. ఇప్పటి వరకు ఎనిమిది వేల డబ్లింగ్‌, డెత్‌ ఓట్లు ఉండటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బీఎల్‌ఓలు తొలగిస్తున్నారని చెబుతున్నా రాజకీయ పార్టీలు తెలుసుకోవటం ఎలా? సర్వర్‌ సమస్యలతో రాజకీయ పార్టీలలో ఆయోమయం నెలకొంది. విజయవాడ సెంట్రల్‌లోనే 15 వేలవరకు బోగస్‌ ఓట్లు ఉన్నాయన్నది టీడీపీ ఆరోపణ. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో మొత్తం 257 పోలింగ్‌ బూత్‌లలో ఇప్పటి వరకు 152 పోలింగ్‌ బూత్‌లను పరిశీలించగా.. 8 వేల డబ్లింగ్‌, డెత్‌ ఓట్ల లెక్క తేలింది. మిగిలిన బూత్‌లను కూడా పరిశీలిస్తే ఈ సంఖ్య పదివేలు దాటే అవకాశం కనిపిస్తోంది. ఇంత భారీ సంఖ్యలో డబ్లింగ్‌, డెత్‌ ఓట్లు ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ డబ్లింగ్‌, డెత్‌ ఓట్ల అంశాన్ని మంగళవారం ఓటర్ల జాబితా పరిశీలకుడు శ్రీధర్‌ దృష్టికి జిల్లా టీడీపీ నేతలు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలకు అదనపు విధులు అప్పగించకుండా వారం రోజుల పాటు పూర్తిగా ఎన్నికల విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద ఏజంట్లను అందుబాటులో ఉంచి ఓటర్ల జాబితాలను మరింత స్వచ్ఛీకరణ చేయాలని కోరారు. డ బ్లింగ్‌, డెత్‌ ఓట్ల ఫిర్యాదులను పరిష్కరించిందీ.. లేనదీ తెలుసుకునే వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

Updated Date - 2023-11-29T00:25:44+05:30 IST