Share News

రబీ లేనట్లే!

ABN , First Publish Date - 2023-11-28T23:47:13+05:30 IST

ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు ఈ ఏడాది మళ్లీ ఇబ్బందులు తప్పేలా లేవు. నీటి వనరుల లభ్యత లేకపోవడంతో రబీసాగుకు నీరు ఇవ్వలేమని ఇంజనీర్లు చేతులెత్తేశారు.

రబీ లేనట్లే!

సాగునీరు ఇవ్వలేమని తేల్చి చెప్పిన ఇంజనీర్లు

డిసెంబరు 10 వరకు ఎల్లెల్సీ, కేసీ కాల్వకు నీటి విడుదల

అందులోనూ తాగునీటికే ప్రాధాన్యత

25న ఐఏబీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

రబీ పంటలకు కూడా నీటిని అందించాలని డిమాండ్‌

మంత్రి బుగ్గన వ్యాఖ్యలపై ఇంజనీరింగ్‌ అధికారులు అయోమయం

హంద్రీనీవా నుంచి గాజులదిన్నెకు తీసుకున్నది 0.005 టీఎంసీలే

ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు ఈ ఏడాది మళ్లీ ఇబ్బందులు తప్పేలా లేవు. నీటి వనరుల లభ్యత లేకపోవడంతో రబీసాగుకు నీరు ఇవ్వలేమని ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఇటీవల నంద్యాలలో రబీ ఐఏబీ సమావేశంలో జలవనరుల శాఖ అధికారుల నుంచి సాగునీటి విషయంపై స్పష్టత వచ్చింది. నీటి వనరుల లభ్యత ఆశాజనకంగా లేనందున రబీ పంటకు సాగునీరు ఇవ్వలేమని ఇంజనీర్లు తేల్చి చెప్పారు. అయితే జలాశయాల్లో ఉన్న నీటిని సమర్థవంతగా వినియోగించుకుంటూ సాగులో ఉన్న పంటలతో పాటు రబీ పంటలకు కూడా నీటిని అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి మాటలతో ఇంజనీరింగ్‌ అధికారులు అయోమయానికి గురవతున్నారు. నీళ్లే లేకపోతే ఎలా విడుదల చేయాలని ఇంజనీర్లు అంటున్నారు. వచ్చే నెల 10వ తేదీ వరకు తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), కేసీ కాల్వలకు నీటి విడుదల చేయాలని, తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఎల్లెల్సీ మిరప రైతులకు కొంత ఊరట కలిగిస్తుంది. సీమలో వైసీపీలో కీలక నేత చెప్పాడని జిల్లా నీటి ప్రయోజనాలను తాకట్టుపెట్టి హంద్రీనీవా కాల్వ నీటిని దిగువకు వదిలేయడం.. నాలుగు నియోజకవర్గాల ప్రజలకు తాగునీటికి కీలకమైన గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కి కేవలం 0.005 టీఎంసీలే తీసుకోవడం.. దీనిపై జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు మెదపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

కర్నూలు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి)

శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. 2023-24 నీటి సంవత్సరంలో 136.07 టీఎంసీలు వరద మాత్రమే చేరింది. అందులో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ద్వారా 45.50 టీఎంసీలు దిగువకు వదిలేస్తే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 21.80 టీఎంసీలు వాడుకుంది. మాల్యాల లిఫ్ట్‌ నుంచి హంద్రీనీవా కాల్వకు 13.41 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 28.26 టీఎంసీలు, ముచ్చుమర్రి లిఫ్ట్‌ ద్వారా 3.08 టీఎంసీలు కలిపి 39.75 టీఎంసీలు మాత్రమే ఏపీ వాడుకుంది. అందులో తెలుగుగంగ కాల్వ ద్వారా 9.596 టీఎంసీలు, ఎస్సార్బీసీ కాలువ ద్వారా 7.568 టీఎంసీలు కలిపి 17.164 టీఎంసీలు వారబంది పద్దతిలో ఆయకట్టుకు సాగునీరు ఇచ్చినట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. నీటి నిల్వలు ఆశాజనంగా లేకపోవడంతో రబీ పంటలకు సాగునీరు ఇవ్వలేమని, రైతులు కూడా పంటలు వేసుకోవద్దని ఈ నెల 25న నంద్యాలలో జరిగిన ఐఏబీ సమావేశంలో ఇంజనీరింగ్‌ అధికారులు తేల్చి చెప్పారు. అదే సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బగ్గున రాజేంద్రనాథ్‌రెడ్డి 835 అడుగుల వరకు శ్రీశైలం నీటిని వాడుకోవచ్చన్నారు. జలాశయాల్లో ఉన్న నీటి వనరులను సమర్థంతంగా వాడుకొని ప్రస్తుతం సాగులో ఉన్న పంటలతో పాటు రబీ పంటలకు కూడా నీటిని అందించాలని ఇరిగేషన్‌, వ్యవసాయ అధికారులను ఆదేశించడంపై ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మాటలు నమ్మి రైతులు పంటలు వేస్తే సాగు తడులు అందించేది ఎలా..? పెట్టుబడులు మట్టిపాలై రైతులు నష్టపోరా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎల్లెల్సీ రైతులకు కొంత ఊరట

ఎల్లెల్సీ కాల్వ కింద 45,519 ఎకరాలు ఖరీఫ్‌ ఆయకట్టు ఉంటే.. 35 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఖరీఫ్‌ ఐఏబీలో నిర్ణయిస్తే 30 వేల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఆయకట్టు, నాన్‌ అయకట్టు కింద 20 వేల ఎకరాలకు పైగా మిరప పంటలు వేశారు. ఆగస్టులో సాగునీరు ఇవ్వడంతో నెల ఆలస్యంగా మిరప నాట్లు వేశారు. దిగుబడులు చేరికి రావాలంటే డిసెంబరు ఆఖరు వరకు సాగునీరు ఇవ్వాలని రైతుల డిమాండ్‌. అయితే.. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు అడుగంటిపోతుండటంతో ఈ నెలాఖరుకు నీటిని ఆపేస్తామని టీబీపీ బోర్డు ఎస్‌ఈ శ్రీకాంత్‌రెడ్డి జిల్లా కలెక్టరుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఎకరాకు 15-20 క్వింటాళ్లు చొప్పున రూ.600 కోట్లకు పైగా పంట దిగుబడులు నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 24న ఆయకట్టు రైతులతో కలసి ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ టీబీపీ బోర్డు ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. టీబీపీ డ్యాంలో ఎల్లెల్సీ కోటాగా ఈ ఏడాది 11.887 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పటికే 9.47 టీఎంసీలు వాడుకున్నాం. 2.40 టీఎంసీలు నిల్వ ఉండడంతో డిసెంబరు 10 వరకు తాగునీటి కోసం సరఫరా చేస్తామని తీర్మానించారు. మిరప రైతులకు కొంత ఊరట లభించినా.. డిసెంబరు ఆఖరు వరకు ఇస్తే కష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. కేసీ కాల్వకు కూడా 10వ తేది వరకు నీటి విడుదల కొనసాగించాలని నిర్ణయించారు.

జిల్లా నీటి ప్రయోజనాలు తాకట్టు

హంద్రీనీవా కాల్వ నీటిని చిత్తూరు జిల్లాకు మళ్లించాలని, ఎగువన ఏ ఒక్క తూముకు వదల కూడదని సీమ వైసీపీ, ప్రభుత్వంలో కీలక నేత ఆదేశాలతో ఇంజనీర్లు తూములన్నీ మూసేశారు. దీంతో కళ్ల ముందే కృష్ణా జలాలు తరలిపోతున్నా కనీసం తాగునీటికి కూడా నిల్వ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. పత్తికొండ, డోన్‌, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలు సహా కర్నూలు నగరానికి వేసవి తాగునీటి కోసం కీలక ఆధారం గాజులదిన్నె జలాశయం. రబీలో 24,372 ఎకరాల ఆయకట్టు ఉంది. గరిష్ట సామర్థ్యం 4.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.26 టీఎంసీలే ఉంది. డెడ్‌ స్టోరేజీ, నీటి ఆవిరి పోనూ 0.61 టీఎంసీలే అందుబాటులో ఉంటుంది. నాలుగు నియోజకవర్గాల తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా కాల్వ 110 కి.మీలు నుంచి కృష్ణా జలాలు తీసుకోవడానికి ప్రత్యేక తూములు నిర్మించారు. రోజుకు 100 క్యూసెక్కులు చొప్పున నాలుగు రోజులు తీసుకున్నారో లేదో.. ఆ వెంటనే ఇంజనీర్లు తూములు మూసేశారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు తీసుకున్నది 0.5 టీఎంసీలే. డోన్‌, కృష్ణగిరి, కోడుమూరు పట్టణాలు సహా వివిధ గ్రామాలు వేసవిలో తాగునీటి కోసం జీడీపీపైనే ఆధారపడాల్సి వస్తుంది. సుంకేసులలో నీటి నిల్వలు అడుగింటితే కర్నూలు నగరవాసులు సైతం జీడీపీపై ఆధార పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎల్లెల్సీ నుంచి కొంత నీటిని జీడీపీకి విడుదల చేస్తున్నా.. డిసెంబరు 10న ఆగిపోతాయి. ప్రస్తుతం హంద్రీనీవాకు మాల్యల నుంచి 1350 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి 350 క్యూసెక్కులు జీడీపీకి తీసుకునే అవకాశం ఉన్నా.. సీఎం జగన్‌ వెన్నంటే ఉంటే కీలక నేతపే ప్రశ్నించలేక జిల్లా నీటి ప్రయోజనాలు ఇంజనీర్లు, ప్రజా ప్రతినిధులు మిన్నుకుండిపోతున్నారు.

వివిధ జలాశయాల్లో నీటి నిల్వలు (టీఎంసీల్లో)

జలాశయం సామర్థ్యం ప్రస్తుత నిల్వ

శ్రీశైలం 215.85 61.18

తుంగభద్రప్రాజెక్టు 105.788 17.72

గాజులదిన్నె ప్రాజెక్టు 4.50 1.272

సుంకేసులు బ్యారేజీ 1.20 1.026

వెలుగోడు 16.95 3.575

గోరుకల్లు 12.50 8.05

అవుకు 4.148 1.375

పందికోన (పత్తికొండ)1.126 0.45

కృష్ణగిరి 0.164 0.129

శివభాష్యం సాగర్‌ 0.389 0.067

Updated Date - 2023-11-28T23:47:17+05:30 IST