Share News

అంగట్లో బోగస్‌ సర్టిఫికెట్లు!

ABN , First Publish Date - 2023-11-28T00:34:35+05:30 IST

ఏదైనా విద్యార్హత సర్టిఫికెట్‌ సాధించాలంటే ఏళ్ల తరబడి కళాశాలకు వెళ్లాలి.

అంగట్లో బోగస్‌ సర్టిఫికెట్లు!

రాష్ట్రంలో 1,800 వెటర్నరీ అసిస్టెంట్ల భర్తీకి నోటిఫికేషన్‌

వేలల్లో పుట్టుకొస్తున్న ‘నకిలీ సర్టిఫికెట్లు’

రూ.లక్ష ఇస్తే మూడు రోజుల్లో ధ్రువపత్రం

అరికట్టపోతే నష్టపోతామంటున్న అర్హులు

ఏదైనా విద్యార్హత సర్టిఫికెట్‌ సాధించాలంటే ఏళ్ల తరబడి కళాశాలకు వెళ్లాలి. హాజరు తగ్గకుండా చూసుకోవాలి. గురువులు చెప్పిన పాఠాలు వింటూ నోట్‌ చేసుకోవాలి. రోజు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టాలి. తుది పరీక్షల్లో ప్రతిభ చూపాలి. కానీ ఇవేమీ లేకుండా ఇన్‌స్టంట్‌గా సర్టిఫికెట్‌ వచ్చేస్తుంది. లక్ష రూపాయలు చేతిలో ఉంటే కష్టపడకుండానే ఎలాంటి విద్యార్హత సర్టిఫికెట్‌ అయినా ఇట్టే వచ్చేస్తుంది. కావాల్సినన్ని మార్కులు, గ్రేడ్‌లతో కూడిన పత్రాలు ఇచ్చేస్తున్నారు. అయితే అవన్నీ బోగస్‌ సర్టిఫికెట్లే. అచ్చం ఒరిజినల్స్‌లాగా ఉన్న నకిలీ సర్టిఫికెట్లు.

కర్నూలు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రాష్ట్రంలో 1,800కి పైగానే సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన డిప్లామా ఇన్‌ వెటర్నరీ కోర్సు, ఎమ్మెస్సీ డెయిరీ సైన్సు, బీఎస్సీ డెయిరీ సైన్స్‌ వంటి కోర్సులు చదివి ఉండాలి. అయితే కొందరు అక్రమార్కులు ‘వెటర్నరీ డిప్లామా కోర్సు’ చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తులు చేస్తున్నారని అర్హులైన నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రూ.లక్ష ఇస్తే మూడు రోజుల్లో బోగస్‌ విద్యార్హత పత్రాలు ఇచ్చేస్తున్నారని, అంకురంలోనే అడ్డుకోకపోతే అర్హులైన నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు జారీకి ఓ బృందం పని చేస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో వందల వేల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తులు స్వీకరణకు డిసెంబరు 11న ఆఖరు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో 250 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2019లో సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు నియామకానికి ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అనుమతి పొందిన కళాశాలలు జారీ చేసే బీవీఎస్‌, వెటర్నరీ ఇన్‌ డిప్లామా, ఎంఎస్‌సీ డెయిరీ సైన్సు, బీఎస్సీ డెయిఇరీ సైన్సు సహా డిప్లమో ఇన్‌ వెటర్నరీ ఒకేషనల్‌ కోర్సులకు అనుమతి ఇచ్చిస్తే.. తాజాగా ఎంవీఎస్‌, బీవీఎస్‌ సహా 12 విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తుకు అర్హులు. దీనిని అసరాగా చేసుకున్న అక్రమార్కులు కొందరు కాసులకు కక్కుర్తి పడి నకిలీ సర్టిఫికెట్లు అమ్మకానికి పెట్టారు. దీంతో ఎంట్రెన్స్‌ టెస్టుల్లో అర్హత సాధించి సీటు పొందడమే కాకుండా ఏళ్ల తరబడి చదివిన అర్హులైన నిరుద్యోగులు నష్టపోవాల్సి వస్తోంది.

రూ.లక్ష ఇస్తే నకిలీ సర్టిఫికెట్‌

సచివాలయాల్లో వేల సంఖ్యలో వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఎలాంటి అర్హతలు లేని నిరుద్యోగులు కొందరు నకిలీ సర్టిఫికెట్లతో ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు నగరం బిక్యాంప్‌, బిర్గా గేట్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి ఏజెంట్లను పెట్టుకొని నకిలీ సర్టిఫికెట్లు అమ్మకాలు చేస్తూ, వాటిని అసలైన సర్టిఫికెట్లుగా నమ్మిస్తున్నారని సమాచారం. పది నెలలుగా ఈ బాగోతం సాగుతున్నట్లు తెలుస్తుంది. మొదట్లో రూ.50-60 వేలకు ఒక సర్టిఫికెట్‌ అమ్మకానికి పెడితే.. ప్రస్తుతం సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్స్‌ పోస్టుల నియమాకాలకు నోటిఫికేషన్‌ రావడంతో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్‌గా రూ.50 వేలు ఇవ్వాలని, మూడు నాలుగు రోజుల్లో సర్టిఫికెట్‌ ఇస్తే మిగిలిన మొత్తం ఇవ్వాలనే ఒప్పందం మేరకు నకిలీ విద్యార్హత పత్రాలు అమ్మకాలకు పెట్టినట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, చెన్నై కేంద్రంగా కొనసాగే భారత్‌ సేవక్‌ యోజన వంటి సంస్థల పేరుతో డిప్లమో ఇన్‌ వెటర్నరీ కోర్సుకు సంబందించి నకిలీ సర్టిఫికెట్లు అంగట్లో సరుకుల్లా అమ్మకానికి పెట్టారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వందలు, వేల సంఖ్యలో ఇలాంటి బోగస్‌ విద్యార్హత పత్రాలు వచ్చాయని అంటున్నారు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం అనుమతి పొందిన కాలేజీల్లో చదివిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల మంది ఉంటే నకిలీ సర్టిఫికెట్లు కూడా ఆ స్థాయిలో ఉంటాయని పేరు బయటకు చెప్పని ఓ నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. వీటిపై గత జనవరి 13న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పశుసంవర్ధక శాఖ అధికారులు దరఖాస్తుల పరిశీలన సందర్భంగా ఒకటికి రెండుసార్లు పరిశీలించి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న ముఠాను అరెస్టు చేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

క్లస్టర్‌ పేరుతో కోత

క్లస్టర్‌ విధానం పేరుతో సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్స్‌ పోస్టులకు కోత పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,500 ఖాళీలకు గానూ 1,800 పోస్టులకు కుదించారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 550 ఖాళీలు ఉంటే.. క్లస్టర్‌ విధానం తీసుకురావడంతో 250కి తగ్గిపోయాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పోస్టుల భర్తీ పేరుతో ఆశలు కల్పిస్తూనే మరో వైపు కోతలు పెట్టి ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా 2019లో దరఖాస్తు రుసుం రూ.300 ఉంటే ప్రస్తుతం రూ.1,000కు పెంచారు. నాన్‌ లోకల్‌ అభ్యర్థులకు ఎలాంటి రుసుం ఉండేది కాదు. నాన్‌ లోకల్‌ కింద దరఖాస్తు చేసినా రూ.1,000 రుసుం చెల్లించాలి. ఒక్కో అభ్యర్థి మూడు జిల్లాల్లో దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మూడు జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవాలంటే రూ.3 వేలు రుసుం చెల్లించాల్సి రావడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ సర్టిఫికెట్లు అని తేలితే చర్యలు

ఉమ్మడి జిల్లాలో 250 సచివాలయాల్లోని వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇచ్చాం. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. మెరిట్‌ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తాం. ఆ సమయంలో నకిలీ సర్టిఫికెట్లు అని తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

- రామచంద్రయ్య, జేడీ, పశుసంవర్ధక శాఖ, కర్నూలు

Updated Date - 2023-11-28T00:34:39+05:30 IST