Share News

శివ నామస్మరణతో హోరెత్తిన యాగంటి

ABN , First Publish Date - 2023-11-28T00:18:41+05:30 IST

ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి సోమవారం శివనామస్మరణంతో హోరెత్తింది.

శివ నామస్మరణతో హోరెత్తిన యాగంటి

బనగానపల్లె, నవంబరు 27: ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి సోమవారం శివనామస్మరణంతో హోరెత్తింది. కార్తీక సోమవారం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి, యాగంటి బసవేశ్వరుడు, ఉమామహేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులు అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు చిన్న కోనేరు, శ్రీవీరబ్రహ్మేంద్రగవి, శంకర గవి, వెంకటేశ్వరస్వామి గవిని దర్శించుకున్నారు. భక్తుల కోసం దాతలు అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. దేవదాయశాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి ఉమామహేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలకమండలి చైర్మన్‌ తోట బుచ్చిరెడ్డి, ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ వీరాంజనేయులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంగమతీరం.. భక్తజన సంద్రం..

కొత్తపల్లి, నవంబరు 27: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సంగమక్షేత్రం కిక్కిరిసింది. సోమవారం కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తులు సప్తనదుల్లో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రాచీన సంగమేశ్వరా లయంలో ఇంకా అడుగు మేర నీరు ఉన్నప్పటికీ భక్తులు ఎగువ ఉమామ హేశ్వరాలయం నుంచి నీటిలోనే వచ్చి గర్భాలయంలో ఉన్న వేపదారు శివలింగాన్ని దర్శించుకున్నారు. ప్రతి ఏడాది 8 నెలల పాటు నది గర్భంలో నిక్షిప్తమయ్యే సంగమేశ్వరుడు ఈ ఏడాది కృష్ణానదికి సరైన వరదనీరు రాకపోవడంతో నాలుగు నెలల ముందుగానే ఆలయం బయల్పడింది. ఈ నేపథ్యంలో సరిగ్గా కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అర్చకులు వేపదారు శివలింగానికి సప్తనది జలాలచే అభిషేకిం చారు. భక్తులకు భకాశిరెడ్డి నాయన ఆశ్రమ నిర్వహకులు అన్నదానం చేపట్టారు.

మహానందిలో పోటెత్తిన భక్తులు

మహానంది, నవంబరు 27: కార్తీక రెండో సోమవారం పురస్కరించుకుని మహానందిక్షేత్రం వేలాదిమంది భక్తులతో పోటెత్తింది. ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతో పాటు రెండో ప్రాకారంలోని కోనేర్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఉదయం 6:30 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అభిషేక ప్రియుడైన మహానందీశ్వరుడికి వంద సామూహిక అభిషేకాలు, 111 కేదారేశ్వర నోములను ఆచరించారు. ఆలయం ఎదుట నంద్యాలకు చెందిన మహిళలు నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. పలు ప్రాంతాల్లో అన్నదానం నిర్వహించారు. ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈఓ ఎర్రమల్ల మధు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిమ్మాపురం పీహెచ్‌సీ ఎంపీహెచ్‌ఈఓ హుస్సేన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

Updated Date - 2023-11-28T00:18:44+05:30 IST