Share News

ఐడీటీఆర్‌పై నీలినీడలు

ABN , First Publish Date - 2023-11-28T00:38:43+05:30 IST

అంతర్జాతీయ ప్రమాణాలతో దర్శి సమీపంలో నిర్మించతలపెట్టిన జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం (ఐడీటీఆర్‌) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఐడీటీఆర్‌పై నీలినీడలు
నాలుగేళ్లుగా పునాదుల్లోనే నిలిచిపోయిన ఐడీటీఆర్‌ కేంద్రం

పాత టెండర్ల రద్దుతో సమస్య మొదటికి

రూ.26 కోట్లతో కొత్త ప్రతిపాదన

నెలలు గడుస్తున్నా స్పందన కరువు

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం

అంతర్జాతీయ ప్రమాణాలతో దర్శి సమీపంలో నిర్మించతలపెట్టిన జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం (ఐడీటీఆర్‌) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాత టెండర్‌ రద్దుతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్‌అండ్‌బీ అధికారులు కొత్త టెండర్ల కోసం రూ.26 కోట్లతో తాజా అంచనాలు తయారు చేసి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. నెలలు గడుస్తున్నా సర్కారు నుంచి స్పందన లేదు. వైసీపీ పాలకులు ఉద్దేశపూర్వకంగానే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణంపట్ల నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దర్శి, నవంబరు 27 : గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దర్శి పట్టణ సమీపంలోని కురిచేడు రోడ్డులో సుమారు 20 ఎకరాల స్థలంలో రూ.18.50 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం నిర్మాణానికి పూనుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు అప్పటి రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు శంకుస్థాపన చేశారు. కొంతమేరకు పనులు జరిగిన తర్వాత 2019లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. అతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐడీటీఆర్‌ నిర్మాణాన్ని గాలికొదిలేసింది. అప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు కూడా రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. మూడేళ్లు గడిచిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ చొరవ తీసుకొని రూ.1.75 కోట్ల పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయించారు. బిల్లులు తీసుకున్న తర్వాత కూడా కాంట్రాక్టర్‌ సక్రమంగా పనులు చేయలేదు.

రీటెండర్‌కు స్పందన కరువు

గత ఏడాది ఆర్‌అండ్‌బీ రాష్ట్ర అధికారులు ఐడీటీఆర్‌ ప్రాజెక్టును పరిశీలించి పునాదుల్లో నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆదేశాల మేరకు స్థానిక అధికారులు పాత టెండర్‌ను రద్దు చేశారు. ఆ తర్వాత రీటెండర్‌ పిలిచినప్పటికీ పాత ధరలు గిట్టుబాటు కాకపోవడంతో కాంట్రాక్టర్లు షెడ్యూల్‌ దాఖలు చేయలేదు. పలు దఫాలు రీటెండర్లు పలిచినా స్పందన లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.26 కోట్ల తాజా అంచనాలతో కొత్త ప్రతిపాదనలు తయారు చేసి అనుమతుల కోసం పంపారు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం అలాగే మూలనపడింది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు వస్తున్నందున ఇప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లభించే అవకాశాలు కనిపించడం లేదు. వైసీపీ హయాంలో అనేక శాఖల్లో చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఎన్నికల ముందు టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యేది కలే.

ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

దర్శి ప్రాంతానికి బహుళ ప్రయోజనాలు చేకూర్చే ఐడీటీఆర్‌ ప్రాజెక్టు నిర్మాణం పునాదుల్లో నిలిచిపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల అతిపెద్ద ప్రాజెక్టు మూలన పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దర్శి నియోజకవర్గంతో పాటు పశ్చిమ ప్రకాశంలో యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఏడాదికి వెయ్యి మందికి భారీ వాహనాలు, తేలికపాటి వాహనాలు నడిపేందుకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఏటా 14,500 మందికి పునశ్ఛరణ తరగతులు నిర్వహిస్తారు. 4వేల మందికి ప్రమాదకరమైన సరుకులు రవాణా చేసే వాహనాలకు డ్రైవింగ్‌ తరగతులు నిర్వహిస్తారు. వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు, వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోవడానికి పాలకుల అసమర్థతే కారణమని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

Updated Date - 2023-11-28T00:38:45+05:30 IST