Share News

సీఎం వర్చువల్‌ సభ వెలవెల

ABN , First Publish Date - 2023-11-28T22:53:08+05:30 IST

మంత్రి సురేష్‌ సొంత నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన సీఎం వర్చువల్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభ సభ జనం లేక వెలవెలబోయింది. రాష్ట్రవ్యాప్తంగా 220/132/33 కేవీ సబ్‌స్టేషన్లను సీఎం జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో తాడేపల్లి నుంచి శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా మంగళవారం పుల్లలచెరువు మండలంలోని కొమరోలు పంచాయతీ రంగన్నపాలెం వద్ద రూ.145కోట్లతో గిడ్లను సబ్‌స్టేషన్లకు అనుసంధానించే స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.

సీఎం వర్చువల్‌ సభ వెలవెల
సీఎం వర్చువల్‌ శంకుస్థాపన కార్యక్రమానికి జనంలేక ఖాళీగా ఉన్న కుర్చీలు

సబ్‌స్టేషన్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన

పుల్లలచెరువు, నవంబరు 28 : మంత్రి సురేష్‌ సొంత నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన సీఎం వర్చువల్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభ సభ జనం లేక వెలవెలబోయింది. రాష్ట్రవ్యాప్తంగా 220/132/33 కేవీ సబ్‌స్టేషన్లను సీఎం జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో తాడేపల్లి నుంచి శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా మంగళవారం పుల్లలచెరువు మండలంలోని కొమరోలు పంచాయతీ రంగన్నపాలెం వద్ద రూ.145కోట్లతో గిడ్లను సబ్‌స్టేషన్లకు అనుసంధానించే స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు పెద్దఎత్తున హడావుడి చేసినా, ప్రజ ల నుంచి మాత్రం స్పందన రాలేదు. దీంతో సభ వెలవెలబోయింది. మం త్రి సురే్‌షతో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకా యమ్మ, కలెక్టర్‌ హాజరైనా కూడా ప్రాంగణంలో ప్రజలు మాత్రం రాలేదు. వేసిన కుర్చీలు చాలావరకు ఖాళీగానే దర్శనమిచ్చాయి. దీంతో వైసీపీ నేతలు సైతం కంగుతిన్నారు. జనాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా పెద్దగా స్పందన లేదు. మొత్తానికి శంకుస్థాపన కార్యక్రమం చప్పగా సాగిందంటూ ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. వచ్చిన జనం కోసం అరకొరగా భోజనం ఏర్పాటు చేశారు. అయితే అది సరిపడక ఖాళీ కడుపులుతో పలువురు ఇళ్లకు వెళ్లారు. ఈ కార్యక్రమం ఫెయిల్‌ కావడంతో ఆ పార్టీ నేతలు సైతం నీరసపడ్డారు. చుట్టుపక్కల పది గ్రామాలకు ఈ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ, రైతులు కూడా పెద్దగా హాజరుకాకపోవడం గమనార్హం.

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు, వరికపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరు దినేష్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు రామచంద్రారెడ్డి, శేషారెడ్డి, ఏఈ సత్యనారాయణ, కృష్ణారెడ్డి, మండల వైసీపీ కన్వీనరు రెంటపల్లి సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వాగ్యానాయక్‌, ఎంపీపీ వెంకటయ్య, కొమరోలు సర్పంచి కొల్లిపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T22:53:11+05:30 IST