Share News

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

ABN , First Publish Date - 2023-11-28T01:09:06+05:30 IST

కార్తీక పౌర్ణమి వేడుకలు నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో జరిగాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలన్నీ భక్తుల రాకతో కిక్కిరిశాయి.

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

గిద్దలూరు, నవంబరు 27 : కార్తీక పౌర్ణమి వేడుకలు నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో జరిగాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలన్నీ భక్తుల రాకతో కిక్కిరిశాయి. దక్షిణ కాశీగా పేరొందిన గిద్దలూరులోని పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు పోటె త్తారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. పట్టణంలోని వరసిద్ధి వినాయకస్వామి, అమ్మవారిశాల, అభయాంజనేయస్వా మి, అయ్యప్పస్వామి, వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. కుసుమ హరనాథ మందిరం ఆవరణలో సామూహిక అహాషేకాలు చేశారు.

రాచర్ల : కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సోమవారం తెల్లవారుజామునే దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాచర్ల శివాలయం, అనుమలవీడు శివాలయం, రామాపురంలోని సిద్ధిభైరవేశ్వర ఆలయం, కోనలోని సుర భేశ్వర ఆలయం, సత్యవోలులోని రామలింగేశ్వర ఆలయా లయాను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అన్ని చోట్ల భక్తులకు అన్నదానం చేశారు.

త్రిపురాంతకంలో కార్తీక శోభ

త్రిపురాంతకం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. సోమవారం, కార్తీక పౌర్ణమి కావడంతో ఉదయం నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి త్రిపురాంతకేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరిచెట్టు కింద, బెకసోమేస్వర స్వామి, అపరాదేశ్వరస్వామి, రససిద్ధి గణపతి వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. త్రిపురాంతకేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా త్రిపురాంతకేశ్వరస్వామి వారిని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణశాస్ర్తి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ సమీపంలోని అన్ని సామాజిక వర్గాల సత్రాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి, ఽసిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : మండలంలోని శివాలయాల్లో సోమవారం వేకువ జామున నాలుగు గంటల నుంచే మహిళలు కార్తీక పౌర్ణమి దీపాలను వెలిగించారు. శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని కాశీవిశ్వేశ్వరాలయంలో, వేణుగోపాలస్వామి ఆలయంలో, వృశ్ఛికాల మల్లయ్య ఆలయంలో, కొలుకుల, నరసాయపాలెం, అమానిగుడిపాడు శివాలయాల్లో మహిళలు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించారు. గ్రామాల్లో మహిళలు అధిక సంఖ్యలో త్రిపురాంతకం క్షేత్రానికి వెళ్లి అక్కడ ఆలయంలో దీపారాధన చేశారు. ఎర్రగొండపాలెం మండలంలోని శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి, అనంతరం ఆలయాల్లో పార్వతీపరమేశ్వరులకు పూజలు చేశారు.

మునీశ్వరస్వామి ఆలయంలో పూజలు

మార్కాపురం రూరల్‌ : మండలంలోని తిప్పాయ పాలెం సమీపంలోని కొండపై వెలసిన మేనీశ్వర స్వామి ఆలయంలో సోమవారం కార్తీకపూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తు లకు తీర్థప్రసాదాలు అందజేశారు.

పొదిలి : కార్తీకమాసం సందర్భంగా పట్టణంలోని శివాలయం, సాయిబాబా దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఆదివారం, సోమవారం రెండురోజులు పౌర్ణమి వచ్చింది. దీంతో ఆదివారం సాయంత్రం, సోమవారం ఉదయం ఆయా దేవాలయాలకు బారులు తీరారు. సోమవారం ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులు నిర్మామహేశ్వరస్వామి దేవాలయంలో దీపాలు వెలిగించేందుకు పోటెత్తారు. దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : కార్తీక పౌర్ణమి, సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు బారులు తీరారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీజగదాంబ సమేత మార్కండేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్‌ తేజ శర్మలు మార్కండేశ్వరునికి, జగదాంబ మాతకు ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారిజాము నుంచే దర్శనానికి బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు.

Updated Date - 2023-11-28T01:09:10+05:30 IST