Share News

వైద్యుల నిర్లక్ష్యమంటూ బాధితుల ధర్నా

ABN , First Publish Date - 2023-11-28T22:54:42+05:30 IST

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండుగర్భిణి బలైంది. పైగా రెండురోజులైనా పోస్టుమార్టాన్ని కూడా పట్టించుకోలేదు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందనిబంధువులు మంగళవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వైద్యుల నిర్లక్ష్యమంటూ బాధితుల ధర్నా
రిమ్స్‌ ఎదుట ధర్నా చేస్తున్న వారిని పక్కకు లాగేస్తుండగా సీఐ లక్ష్మణ్‌, సిబ్బందితో మృతురాలి బంధువుల వాగ్వాదం

జీజీహెచ్‌లో ఆందోళన

ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి

రెండురోజులైనా పోస్టుమార్టం చేయని వైద్యాధికారులు

ఒంగోలు (కార్పొరేషన్‌), నవంబరు 28 : ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండుగర్భిణి బలైంది. పైగా రెండురోజులైనా పోస్టుమార్టాన్ని కూడా పట్టించుకోలేదు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందనిబంధువులు మంగళవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... పొ దిలి సమీపంలోని తుమ్మగుంట గ్రామానికి చెందిన కుంచ ఏస మ్మ(30) ఆదివారం రాత్రిడెలివరీ కోసం ఆసుప్రతిలో చేరింది. ఆ సమయంలో వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆసుపత్రిలో చేరిన ఐదు నిమిషాలకే ఆమె ప్రాణాలు విడిచింది. ఇదిలాఉండగా అప్పటి నుంచి మార్చురీలోనే ఏసమ్మ మృతదేహాన్ని ఉంచగా, మంగళవారం వరకు పోస్టుమార్టం చేయలేదు. దీంతో బంధువులు జీజీహెచ్‌ వైద్యులను నిలదీయడంతో పొదిలికి చెందిన పోలీసులు రావాల్సి ఉందని, శవపంచనామా చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో వైద్యుల తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పొదిలి పోలీసులు జీజీహెచ్‌ వద్దకు చేరుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినామూడు గంటలకు కూడా మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఏసమ్మ చనిపోయిందని, ఆదివారం కావడంతో ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. అదేవిధంగా రెండు రోజులైనా పోస్టుమార్టం చేయకుండా జాప్యం చేశారని, ఏసమ్మ మరణానికి జీజీహెచ్‌ వైద్యులే కారణమని వారు ఆరోపించారు. భర్త బేల్దారీ పనులు చేసుకుంటూ ఉంటాడని, ఏసమ్మకు ఆరుగురు సంతానం ఉన్నారని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌ సిబ్బందితో జీజీహెచ్‌ వద్దకు చేరుకుని వారిని బలవంతంగా పక్కకు నెట్టేశారు. దీంతో ఏసమ్మ బంధువులు మరింత ఆగ్రహం చేశారు. తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తుంటే పోలీసులు అన్యాయంగా తమపై దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. ఇదే విషయమై జీజీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ తిరుమలరావును వివరణ కోరగా, ఏసమ్మకు ఇప్పటికే ఆరు కాన్పులు అయ్యాయన్నారు. ఏడో కాన్పుగా ఆదివారం జీజీహెచ్‌లో చేరగా, చేరిన రెండు నిమిషాలకే ప్రాణాలు విడిచిందని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని చెప్పారు. ఇతర అనారోగ్య కారణాలు ఉండొచ్చని ఆయన తెలిపారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో ఆలస్యం జరిగిన ప్రభావం పోస్టుమార్టంపై పడిందని, త్వరగా ఇంటికెళ్లాలనే ఉద్దేశంతోనే వారు రోడ్డెక్కి ధర్నా చేశారని తిరుమలరావు తెలిపారు.

Updated Date - 2023-11-28T22:54:46+05:30 IST