Share News

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి

ABN , First Publish Date - 2023-11-28T23:58:46+05:30 IST

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జిల్లా ఎన్నికల పరిశీలకుడు జె.శ్యామలరావు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌.. రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి
కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న కూన రవి, టీడీపీ నేతలు

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

కలెక్టరేట్‌, నవంబరు 28: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జిల్లా ఎన్నికల పరిశీలకుడు జె.శ్యామలరావు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌.. రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూన రవి మాట్లాడుతూ.. ‘జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. గత నెల 27న ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో లోపాలను గుర్తించాం. చనిపోయినవారిలో కొంతమంది పేర్లు తొలగించలేదు. జీరో నెంబర్లతో ఓటర్ల నమోదు, ఒకే డోర్‌నెంబర్‌తో పది కన్నా ఎక్కువ ఓటర్ల నమోదయ్యారు. ఓటర్ల పేర్లలో తప్పొప్పులు ఉన్నట్టు గుర్తించాం. బీఎల్‌వోలు మరోసారి జాబితా క్షుణ్ణంగా పరిశీలించి.. లోపాలు సరిదిద్దాల’ని కోరారు. ‘కలెక్టర్‌ ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లాలో 72,711 మంది కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోగా.. 60,726 మందిని నమోదు చేశారు. 47,020 మంది ఓటర్ల తొలగింపునకు దరఖాస్తు చేసుకోగా, 37,683 మందిని ఆమోదించారు. పేర్లు సవరణకు 1,19,873 మంది దరఖాస్తు చేసుకున్నారు. నమోదు, తొలగించిన ఓటర్ల జాబితా వివరాలన్నీ మాకు అందజేయాల’ని కలెక్టర్‌ను రవికుమార్‌ కోరారు. ఈ మేరకు ఎన్నికల పరిశీలకుడు శ్యామలరావుకు, కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌కు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, శ్రీకాకుళం, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు గుండ లక్ష్మీదేవి, కలమల వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, మాజీ ఎంపీపీ తర్రా రామకృష్ణ, పార్టీ నగర అఽధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, రాష్ట్ర తెలుకల సాధికార సమితి సభ్యుడు కొమ్మనాపల్లి వెంకటరామరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమణ మాదిగ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:58:47+05:30 IST