Share News

సిక్కోలులో కార్డెన్‌సెర్చ్‌

ABN , First Publish Date - 2023-11-29T00:00:14+05:30 IST

శ్రీకాకుళంలోని వాంబే కాలనీ, రాజీవ్‌ గృహకల్పలో పోలీసులు కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. మంగళవారం వేకువజామున సీఐ ఆర్‌.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో 30మంది కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించడంతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు.

సిక్కోలులో కార్డెన్‌సెర్చ్‌
వాంబేకోలనీలో ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న సీఐ సన్యాసినాయుడు

- నగర వాసుల ఉలికిపాటు

శ్రీకాకుళం క్రైం, నవంబరు 28: శ్రీకాకుళంలోని వాంబే కాలనీ, రాజీవ్‌ గృహకల్పలో పోలీసులు కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. మంగళవారం వేకువజామున సీఐ ఆర్‌.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో 30మంది కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించడంతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి.. వివరాలు సేకరించారు. ధ్రువపత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను గుర్తించి.. వాటిని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ.. ‘ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదేశాల మేరకు కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించాం. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వారి వివరాలు పరిశీలించాం. అనుమానితులు, గంజాయి బ్యాచ్‌, రౌడీషీటర్లు, జూదర్లు కూడా ఉన్నట్లు గుర్తించాం. అటువంటి వారిపై నిఘా ఉంచుతాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై సమీప పోలీసుస్టేషన్‌కు లేదా ‘100’కు సమాచారం ఇవ్వాలి. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో.. పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలి’ అని తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణతోనే పిల్లల్లో మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గార పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి సీఐ కామేశ్వరరావు, ఎస్సైలు బలివాడ గణేష్‌, ఎ. విజయకుమార్‌, వన్‌టౌన్‌, రూరల్‌, గార పోలీసుస్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:00:16+05:30 IST