Share News

చేపా.. చేపా.. ఎక్కడున్నావ్‌?

ABN , First Publish Date - 2023-11-29T00:12:08+05:30 IST

జిల్లాలో స్వదేశీ మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వందల సంఖ్యలో పెద్దపెద్ద చెరువులు ఉన్నా వాటిలో ప్రభుత్వాల ప్రోత్సాహంతో చేపలు పెంచుకోలేని పరిస్థితి నెలకొంది. గతంలో ఏటా ఆగస్టులో స్వదేశీ మత్స్యకార సంఘాలకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం(పీఎంఎంఎస్‌వై) కింద చేపపిల్లలు పంపిణీ చేసేవారు.

చేపా.. చేపా.. ఎక్కడున్నావ్‌?
మదనగోపాలసాగరం జలాశయం

- నేటికీ పంపిణీకాని చేపపిల్లలు

- స్వదేశీ సంఘాలకు అందని ‘పీఎంఎంఎస్‌వై’

(టెక్కలి)

టెక్కలి మండలంలో 200 ఎకరాల విస్తీర్ణం దాటిన దాలిచెరువు, మదనగోపాలసాగరం వంటి జలాశయాలు ఉన్నాయి. వీటిలో టెక్కలికి చెందిన శ్రీ చంద్రశేఖర స్వదేశీ మత్స్యకార సంఘం చేపల పెంపకాన్ని చేపడుతోంది. ప్రభుత్వం ఏటా ఆగస్టులో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద 40శాతం సబ్సిడీపై చేపపిల్లలు పంపిణీ చేసేది. కానీ ఈ ఏడాది ఇంతవరకూ చేపపిల్లల పంపిణీ ప్రక్రియ చేపట్టకపోవడంతో మత్స్యకార సంఘం సభ్యులు నిరాశ చెందుతున్నారు.

..............

ఈ నెల 11న హిరమండలంలోని స్వదేశీ మత్స్య సహకార సంఘం ద్వారా చేపల పెంపకం చేపడుతున్న మత్స్యకారులకు 40 శాతం రాయితీపై 4.856 లక్షలు చేప పిల్లలను పంపిణీ చేశారు. వాటిని హిరమండలం వద్ద వంశధార రిజర్వాయర్‌లో మంత్రి సీదిరి అప్పలరాజు చేతులమీదుగా విడిచిపెట్టారు. జిల్లాలో సుమారు 169 చెరువుల్లో చేపపిల్లల పెంపకం చేపట్టాల్సి ఉంది. కాగా, ఇంతవరకూ కేవలం ఒక్కచోట మాత్రమే పంపిణీ చేయడంపై మత్సకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

.........................

జిల్లాలో స్వదేశీ మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వందల సంఖ్యలో పెద్దపెద్ద చెరువులు ఉన్నా వాటిలో ప్రభుత్వాల ప్రోత్సాహంతో చేపలు పెంచుకోలేని పరిస్థితి నెలకొంది. గతంలో ఏటా ఆగస్టులో స్వదేశీ మత్స్యకార సంఘాలకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం(పీఎంఎంఎస్‌వై) కింద చేపపిల్లలు పంపిణీ చేసేవారు. లబ్ధిదారులకు 40శాతం సబ్సిడీపై మత్స్యశాఖ మూడు ఇంచీల సైజు గల కట్ల, రాహు, మృఘాల రకాల చేపపిల్లల్ని పంపిణీ చేసేది. ఈ ఏడాది మాత్రం చేప పిల్లల పంపిణీ కోసం మత్స్యకార సంఘాలు ఎదురుచూడాల్సి వస్తోంది. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇటీవల కేవలం హిరమండలం రిజర్వాయర్‌లో మాత్రమే చేప పిల్లలను విడిచిపెట్టారు. జిల్లాలో 183వరకు ట్యాంక్‌లు, 50 పైగా సొసైటీల పరిధిలో లీజులు నిర్వహిస్తున్నా.. వాటికి చేపపిల్లలు పంపిణీ చేపట్టలేదు. మత్స్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 169 చెరువులకు స్వదేశీ మత్స్యకార సొసైటీల ద్వారా 40శాతం సబ్సిడీపై చేపపిల్లలు అందించాల్సి ఉంది. నవంబరు నెల ముగిసినా ఇంతవరకూ పంపిణీ చేయకపోవడంతో మత్స్యకార సొసైటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చేపలు పెరగాల్సిన సమయంలో విడిచిపెట్టకుండా నీరు తగ్గే సమయానికి చేపపిల్లలు పంపిణీ చేస్తే ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేపపిల్లల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు.

- ఈ విషయమై మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీవీ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. జిల్లాలో 169 చెరువులకు సంబంధించి సొసైటీలు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయని తెలిపారు. వాటిని ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద 40శాతం సబ్సిడీపై వారం రోజుల్లో చేపపిల్లల పంపిణీ చేపడతామన్నారు.

Updated Date - 2023-11-29T00:12:09+05:30 IST