Chandrababu: కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్కు చంద్రబాబు లేఖ
ABN , First Publish Date - 2023-07-15T15:38:34+05:30 IST
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి భూపేందర్ యాదవ్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల ఆక్రమణలపై తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు.
అమరావతి: కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి భూపేందర్ యాదవ్కు (Union Minister Bhupender Yadav) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu ) లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల ఆక్రమణలపై తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు.
లేఖలోని అంశాలు ఇవే..
’’అల్లంచెర్లరాజుపాలెం గ్రామంలోని పాత సర్వే.నెం.453లో పర్యావరణ పరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతం అవుతోంది. అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతం కింద 3255 ఎకరాల అటవీ భూమి 1950 నుంచి అటవీ శాఖ అధీనంలో ఉంది. అటవీ శాఖ అధికారులకు చెప్పకుండా రెవెన్యూ అధికారులు కొంతమేర అటవీ భూమిని గతంలో సాగుభూమిగా ప్రకటించారు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు నాడు తీసుకున్న నిర్ణయంపై కోర్టులలో వివాదం నడుస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని తాజాగా అల్లంచెర్ల రాజుపాలెం పాలెం ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని 226, 227, 231, 232, 233 సర్వే నంబర్లలోని భూమి తమ ఆధీనంలో ఉందని ఆక్రమణదారులు, వారి వారసులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేస్తున్నారు. బోరు బావులు తవ్వుతున్నారు. తద్వారా భూమి తమ ఆధీనంలో ఉందని, దానిని అటవీ భూమిగా ప్రకటించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు తప్పుడు వాదనలకు దిగుతున్నారు. అటవీ భూముల అక్రమణకు జరుగుతున్న ఈ ప్రయత్నాలకు, అక్రమ రెవెన్యూ రికార్డులు సృష్టించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తోంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ శాఖ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని అటవీ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. తక్షణమే మొత్తం అటవీ భూమిని సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలి. వివిధ న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసులపై ప్రభుత్వం గట్టిగా పోరాడాలి. భూ కబ్జాదారులను నుంచి అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి అక్కడ నిరంతరం నిఘా ఉంచాలి. అల్లంచెర్లరాజుపాలెం ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతం చేయడానికి భూ కబ్జాదారులతో కుమ్మక్కైన సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి’’ అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.