Share News

Amaravathi: టీడీపీ-జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదల.. ప్రజాకర్షక 11 పథకాలు ఏంటంటే?

ABN , First Publish Date - 2023-11-13T19:18:39+05:30 IST

టీడీపీ-జనసేన(TDP, Janasena) కూటమిలో భాగంగా ఎన్నికల సన్నద్ధతలో కీలక పాత్ర పోషించే మినీ మేనిఫెస్టోని(Manifesto) ఇరు పార్టీలు ఇవాళ ప్రకటించాయి. 11 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టో ప్రజాకర్షకంగా ఉంది. వాటిల్లో టీడీపీ ప్రతిపాదించిన 6 పథకాలకుతోడు జనసేన సూచించిన 5 పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు.

Amaravathi: టీడీపీ-జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదల.. ప్రజాకర్షక 11 పథకాలు ఏంటంటే?

అమరావతి: టీడీపీ-జనసేన(TDP, Janasena) కూటమిలో భాగంగా ఎన్నికల సన్నద్ధతలో కీలక పాత్ర పోషించే మినీ మేనిఫెస్టోని(Manifesto) ఇరు పార్టీలు ఇవాళ ప్రకటించాయి. 11 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టో ప్రజాకర్షకంగా ఉంది. వాటిల్లో టీడీపీ ప్రతిపాదించిన 6 పథకాలకుతోడు జనసేన సూచించిన 5 పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు. మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ. 10లక్షల వరకూ రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. దీనిని సూపర్ సిక్స్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

"11 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించాం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రాథమికంగా చర్చించాం. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. వాటిని సీఎం జగన్(CM Jagan) పరిష్కరించట్లేదు. ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు ఉమ్మడి కార్యచరణ రూపొందిస్తాం. తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చిస్తాం. ఈ మీటింగ్ విశేషాలను పార్టీల అధినేతల దృష్టికి తీసుకెళ్తాం. సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు రచించాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం. అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నాం." అని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్ మాట్లాడుతూ... "జనసేన వైపు నుంచి ఆరు ప్రతిపాదనలు పెట్టాం. యువతకు, మహిళలకు పవన్ కొన్ని హామీలిచ్చారు. అలాగే వివిధ వర్గాలకు వారాహి యాత్రలో పవన్ హామీలిచ్చారు. మేం ప్రతిపాదించిన కొన్ని అంశాలు టీడీపీ ప్రతిపాదించిన అంశాల్లోనూ ఉన్నాయి" అని పేర్కొన్నారు.


కమిటీ ఏర్పాటు చేసిన పవన్..

జనసేన – తెలుగుదేశం పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన పక్షాన పవన్ కళ్యాణ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఉభయ పక్షాల సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణను- 'పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' గా నియమితులైన వారు సమన్వయపరచాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకు తీసుకువెళ్లడంపై చర్చించారు. ఇరు పక్షాల నేతలు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాలలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

17వ తేదీ నుంచి నియోజకవర్గ స్థాయిలో జరగబోయే ఇంటింటికీ కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. భవిష్యత్తుకు గ్యారంటీ, ఓటర్ లిస్ట్ పరిశీలన తదితర అంశాలను విజయవంతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు.

Updated Date - 2023-11-13T19:50:15+05:30 IST