Share News

జనంపై జంతు ప్రదర్శన

ABN , First Publish Date - 2023-11-29T01:23:16+05:30 IST

నగరంలో గల ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆసియాలోనే అతి పెద్దది.

జనంపై జంతు ప్రదర్శన

జూలో ఎలుగుబంటి దాడిలో గతంలో ఒక మహిళ మృతి

సోమవారం నాటి సంఘటన రెండోది

రక్షణ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం

జూ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ మంత్రుల ప్రగల్భాలు

కనీసం జంతు సంరక్షకుల నియామకాలు కూడా లేవు

శిక్షణ లేని అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే అన్ని పనులూ...

ఎం.వి.పి.కాలనీ, నవంబరు 23:

నగరంలో గల ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆసియాలోనే అతి పెద్దది. అయితే సంచలనాత్మక సంఘటనలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో ఏనుగు తొండంతో కొట్టి మావటిని చంపేసింది. ఆ సంఘటన జంతువుల పట్ల సంరక్షకులు మరింత అప్రమత్తంగా ఉండాలని గుర్తుచేసింది. అయితే అది జరిగి నెల రోజులు కాకముందే ఇక్కడి జూ పార్కులో సోమవారం ఎలుగుబంటి దాడిలో యానిమల్‌ కీపర్‌ చనిపోయారు. ఈ ఘటన ఇటు యానిమల్‌ కీపర్ల నిర్లక్ష్యాన్ని, అటు అధికారులు వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌ జూలో చోటుచేసుకున్న ఘటనతో పాటు గతంలో ఇక్కడ జరిగిన వాటి నుంచి కూడా తగిన పాఠం నేర్చుకోలేదనే విమర్శ వినిపిస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యం అంటూ జరిగిన సంఘటనను చిన్నదిగా చూపేందుకు అధికారులు అధికారులు యత్నిస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు ఇక్కడ షరా మామూలే అని గతం చూస్తే తెలుస్తుంది.

అసలేం జరిగింది?

మన రాష్ట్రంలో రెండు (విశాఖలో ఒకటి, తిరుపతిలో మరొకటి) జూ పార్కులు ఉన్నాయి. వీటిలో జంతు సంరక్షకుల నియామకాలను ప్రభుత్వం ఆపేసి, చాలాకాలం అయ్యింది. పదవీ విరమణలే తప్ప, నియామకాల్లేవు. దాంతో ఉన్నవారితో, శిక్షణ లేని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతానికి వస్తే...ఎలుగు బంటి ఎన్‌క్లోజరు వద్ద ఒక సంరక్షకుడు, మరో సహాయకుడు విధులు నిర్వహించేవారు. సోమవారం వారిద్దరూ సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో జూలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా వున్న నగేష్‌బాబును...ఎలుగుబంటి ఎన్‌క్లోజరు శుభ్రం చేయడానికి అధికారులు పంపించారు. అప్పటికే సమీపంలోని కొన్ని ఎన్‌క్లోజర్లు శుభ్రం చేసిన నగేష్‌...సమయం మించిపోతుండడంతో ఎలుగుబంటి ఎన్‌క్లోజరు వద్దకు వెళ్లి, దానిని బహిరంగ ఎన్‌క్లోజరులోకి వదిలాడు. సాధారణంగా ఆ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లోపలకు వెళ్లిన వెంటనే సందర్శకులు రాకుండా ప్రధాన గేటును మూసివేయాలి. తర్వాత ఎలుగు బహిరంగ ఎన్‌క్లోజరులోకి వెళ్లడానికి గేటు ఎత్తాలి. తర్వాత దానిని మూసివేసి, శుభ్రం చేయడానికి ఎన్‌క్లోజర్‌లోనికి అడుగు పెట్టాలి. కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఎఫ్‌.ఎస్‌.ఒ.లు సైతం అక్కడ లేకపోవడంతో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని చెప్పేవారు లేకపోయారు. అతను గదులను శుభ్రం చేస్తుండగా, బహిరంగ ఎన్‌క్లోజరులోని ఎలుగు తిరిగి గదుల్లోకి వచ్చేసింది. అక్కడ కనిపించిన నగేష్‌పై దాడి చేసింది. తర్వాత గదిలోంచి బయటకు రావడమే కాకుండా, ప్రధాన గేటు దాటి కూడా బహిరంగ ప్రదేశంలోకి వచ్చేసింది. మరికొంత సమయం ఆలస్యమైతే, సందర్శకుల మధ్యకు వచ్చేసేదే. ఎలుగును సెక్యూరిటీ గార్డు చూసి, అధికారులను అప్రమత్తం చేశాడు. అప్పుడు తేరుకున్న అధికారులు నగేష్‌ ఎక్కడున్నది ఫోన్‌ చేశారు. కానీ స్పందన లేకపోవడంతో, మరో చోటకు వెళ్లుంటాడు అనుకున్నారు. తేనె చూపించి, ఎలుగును సులభంగానే ఎన్‌క్లోజరులోకి తిరిగి తీసుకువెళ్లగలిగారు. తీవ్ర గాయాలతో పడివున్న నగేష్‌ను అప్పుడు చూశారు. అప్పటికే ఆలస్యం అయ్యింది. నగేష్‌ మృతిచెందాడు. ఎలుగు దాడి చేసినప్పుడు పెనుగులాట, కేకలు వేసినా సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల అతడిని రక్షించేవారు కరవయ్యారు.

అధికారుల వైఫల్యం

ప్రస్తుతం జరిగిన దురదృష్టకర సంఘటనకు సంరక్షకుని నిర్లక్ష్యం కారణమంటూ అధికారులు చెప్పవచ్చు గానీ అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించే వ్యవస్థ జూ పార్కులో లేదు. ఇతర జూ పార్కుల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెను వెంటనే స్పందించే వ్యవస్థ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చే ట్రాంక్విలైజర్‌ గన్‌తో సిబ్బంది సిద్ధంగా ఉండాలి. కానీ అలాంటిదేమీ ఇక్కడ కనిపించదు. వీరు స్పందించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇక మంత్రులు వచ్చినప్పుడల్లా అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామంటూ చెప్పడమే తప్ప చేతలు శూన్యం. వన్యప్రాణి సంరక్షణలో కీలకమైన జంతు సంరక్షకులనే ప్రభుత్వం నియమించడం లేదు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన అనుభవం, శిక్షణ లేని వారిని నియమించుకుని, వారితోనే పనులు చేయిస్తున్నారు. కిందిస్థాయి అధికారులు జూ పార్కు మొత్తం ఉదయమే కలియతిరగాలి. ప్రతి ఎన్‌క్లోజర్‌ను వ్యక్తిగతంగా పరిశీలించాలి. కానీ జూ పార్కులో బ్యూటిఫికేషన్‌ వంటి పనులపై శ్రద్ధ వహిస్తున్నారు తప్ప, జంతు సంరక్షణపై పెద్దగా దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చింపాంజీ, జీబ్రా, జిరాఫీ వంటి పలు జంతువులు సైతం మృత్యువుపాలయ్యాయి. ఇప్పటికైనా జూ ఉన్నతాధికారులు మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.

గతంలోనూ భయానక సంఘటనలు!

- గతంలో ఎలుగు బంటి బహిరంగ ఎన్‌క్లోజరులో తిరుగాడుతుండగానే గోడపై చెక్క బల్ల వేసి పనులు చేయిస్తుండగా ఓ మహిళ జారి ఎన్‌క్లోజరులో పడిపోయింది. ఆమెపై ఎలుగు దాడి చేసి, చంపేసింది.

- కొద్ది నెలల క్రితం ఓ ఎలుగు బంటి ఎన్‌క్లోజరు గోడ ఎక్కి బయటకు వచ్చేసి, అక్కడే తిరుగాడింది. అదృష్టవశాత్తూ సమీపంలో సందర్శకులు లేరు. సిబ్బంది చాకచక్యంగా దానిని బంధించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

- ఓ సారి గోవా నుంచి తీసుకువచ్చిన ఖడ్గమృగం ఎన్‌క్లోజరులోకి విడిచి పెట్టే సమయంలోనే గేటును పగులగొట్టి బయటకు వచ్చేసింది. నిర్మాణం పచ్చిగా ఉండగానే ఖడ్గమృగాన్ని విడిచి పెట్టడం వల్ల గేటును తోసుకుంటూ సందర్శకుల మధ్యకు వచ్చి పరుగులు తీసింది. అక్కడే ఉన్న అప్పటి క్యూరేటర్‌ కొడుకును పొడిచేసింది.

- కొద్ది సంవత్సరాల క్రితం పోలీస్‌ కమిషనర్‌ అతిథిగా రాగా, ఆయనకు ఏనుగుతో దండ వేయించడానికి యత్నించగా, తొండంతో ఆయన్ను తోసేసింది. అలాగే చాలాకాలం క్రితం జూ పార్కు నుంచి ఏనుగు బయటకు తప్పించుకున్న సంఘటన కూడా ఉంది.

- అడవి పందుల ఎన్‌క్లోజరులోకి యువకులు వెళ్లిపోయారు. అవి తిరిగి దాడి చేయడానికి యత్నించడంతో త్రుటిలో తప్పించుకుని బయటపడ్డారు.

- ఇవి కాక సందర్శకుల చేతులను పులి కొరికేయడం, పెద్ద పులిని తోటి పులి చంపేయడం, అడవి చిరుతలు సందర్శకులు ఉంటుండగానే జూ లోపలకు ప్రవేశించడం, టాయ్‌ ట్రైన్‌ బోల్తా పడి అందులోని సందర్శకులకు గాయాలు కావడం వంటి సంఘటనలు జరుగుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Updated Date - 2023-11-29T01:23:17+05:30 IST