Share News

బిల్లులు రావు.. పనులు సాగవు

ABN , First Publish Date - 2023-11-29T00:44:28+05:30 IST

మండలంలోని బొండాం పంచాయతీ మజ్జివలసలో చేపడుతున్న అరకులోయ ఏకలవ్య రెసిడెన్సియల్‌ మోడల్‌ పాఠశాల భవన సముదాయం ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి. దాదాపు నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నా బిల్లులు మంజూరుకాకపోవడంతో పనులకు బ్రేక్‌ పడింది. అరకులోయలోని మహిళా డిగ్రీ కళాశాల భవన సముదాయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ రెండు భవన సముదాయాల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది.

బిల్లులు రావు.. పనులు సాగవు
పనులు నిలిచిపోయిన అరకులోయ ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌

- అరకులోయ ఏకలవ్య పాఠశాల, మహిళా డిగ్రీ కళాశాల పనులకు బ్రేక్‌

- నిర్మాణాలు చివరి దశకు వచ్చినా బిల్లులు రాని వైనం

- పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు

- విద్యార్థులకు తప్పని అవస్థలు

అరకులోయ, నవంబరు 28: మండలంలోని బొండాం పంచాయతీ మజ్జివలసలో చేపడుతున్న అరకులోయ ఏకలవ్య రెసిడెన్సియల్‌ మోడల్‌ పాఠశాల భవన సముదాయం ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి. దాదాపు నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నా బిల్లులు మంజూరుకాకపోవడంతో పనులకు బ్రేక్‌ పడింది. అరకులోయలోని మహిళా డిగ్రీ కళాశాల భవన సముదాయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ రెండు భవన సముదాయాల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది.

మండలంలోని బొండాం పంచాయతీ మజ్జివలసలో 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో మూడేళ్ల క్రితం ప్రారంభించిన అరకులోయ ఏకలవ్య రెసిడెన్సియల్‌ మోడల్‌ పాఠశాల భవన సముదాయ నిర్మాణం తొలి దశ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. అంచనా వ్యయం కన్నా మరో రూ.2 కోట్లు కాంట్రాక్టరు అదనంగా ఖర్చు చేయడం, ప్రభుత్వం నుంచి ఇంకా రూ.4 కోట్లు నిధులు రావలసి ఉండడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం తరగతులకు సంబంధించిన భవనంతో పాటు బాల,బాలికల వసతి గృహాలు, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ భవనం, బాలబాలికల వార్డెన్‌ల నివాస గృహాలు, ప్రహరీ, ప్రధాన ప్రవేశ ద్వారం.. ఇలా అన్ని రకాల పనులు పూర్తి చేశారు. ఇంకా తలుపులు, కిటికీలు, ప్లంబింగ్‌, వైరింగ్‌ పనులు చేపట్టవలసి ఉంది. అలాగే భవన సముదాయ ప్రాంగణంలో రహదారులు నిర్మించాల్సి ఉంది. బిల్లుల మంజూరులో జాప్యం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. కాగా డుంబ్రిగుడకు కేటాయించిన పాఠశాలను అరకులోయలోని ఆర్‌ఐటీఐలో, అనంతగిరి, అరకులోయకు సంబంధించి బాలురకు క్రీడా పాఠశాలలో, బాలికలకు యండపల్లివలస గురుకులంలో తరగతులు కొనసాగుతున్నాయి. దీంతో అసౌకర్యాల నడుమ విద్యార్థిని, విద్యార్థులు చదువుకోవలసి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బిల్లులు మంజూరయ్యేలా చేసి ఏకలవ్య పాఠశాలను అందుబాటులోకి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మహిళా డిగ్రీ కళాశాల ఎప్పటికి పూర్తయ్యేనో!

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూసా నిధులతో మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అరకులోయకు కళాశాలను మంజూరు చేశారు. 2019 ఫిబ్రవరి 3న జమ్ము కశ్మీరులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో మహిళా కళాశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా అరకులోయలో కూడా ఆ రోజే పనులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో మహిళా డిగ్రీ కళాశాల భవనం, వసతి గృహం భవన నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన నాడే రూ.6 కోట్ల నిధులు కళాశాల ఖాతాలో జమ చేసింది. అయితే స్థల కేటాయింపు, కొవిడ్‌ ప్రభావం వల్ల పనులు ఆలస్యమయ్యాయి. ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టరు పనులు చేపట్టారు. మరో రూ.2 కోట్ల నిధులు మంజూరు కావడంతో పనులు చురుగ్గా సాగాయి. అయితే ఆ తరువాత నుంచి బిల్లులు రాకపోవడంతో ఏడాదిగా పనులకు బ్రేక్‌ పడింది. ఈ భవన సముదాయ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇంకా కిటికీలు, తలుపులు అమర్చి, వైరింగ్‌ పనులు చేయాలి. అలాగే రంగులు వేస్తే పనులు పూర్తయినట్టే. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా రూ.4 కోట్లు రావలసి ఉండడంతో కాంట్రాక్టరు పనులను నిలిపివేశారు. ఆ బిల్లులు వస్తేనే పనులు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కాగా ప్రస్తుతం ప్రభుత్వ కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలో మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తుండడంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్నం వేళల్లో మాత్రమే తరగతులు జరుగుతుండడం, పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. కళాశాల భవన సముదాయ నిర్మాణం పూర్తయి అందులోకి వెళితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థినులకు నిరాశే మిగిలింది.

Updated Date - 2023-11-29T00:44:30+05:30 IST