Share News

న్యుమోనియాపై అలర్ట్‌

ABN , First Publish Date - 2023-11-29T01:14:47+05:30 IST

చైనాను కొద్దిరోజుల నుంచి న్యుమోనియా వణికిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

న్యుమోనియాపై అలర్ట్‌

కేజీహెచ్‌ పీడియాట్రిక్‌ వార్డులో 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు

టామీ ఫ్లూ మాత్రలు, సిరప్‌లు సిద్ధం చేసిన వైద్యులు

చిన్నారుల్లో దగ్గు, ఆయాసం, డెక్కలు ఎగురేయడం వంటివి కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచన

విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

చైనాను కొద్దిరోజుల నుంచి న్యుమోనియా వణికిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. ఈ మేరకు కేజీహెచ్‌ అధికారులు ముందు జాగ్రత్తగా పీడియాట్రిక్‌ విభాగంలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. న్యుమోనియా లక్షణాలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు టామీ ఫ్లూ మాత్రలు, సిరప్‌లను సిద్ధంచేశారు. వెంటిలేటర్స్‌ను సిద్ధం చేయడంతోపాటు ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థను పరిశీలించారు. కేసులు వస్తే మెరుగైన సేవలు అందించేందుకు అనుగుణంగా ఏర్పాటుచేశామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు.

ఈ లక్షణాలుంటే అలెర్ట్‌ కావాలి..

చిన్నారుల్లో దగ్గు, ఆయాసం, డెక్కలు ఎగురేయడం, పెదాలు, చేతులు నల్లగా మారడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిలో ఈ తరహా లక్షణాలుంటే తక్షణమే వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. న్యుమోనియా ప్రాథమిక స్థాయిలో జలుబు, దగ్గు, జ్వరం ఉంటాయని, ఆ తరువాత ఇతర లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

హెచ్చరికలతో ముందస్తు ఏర్పాటుచేశాం..

- డాక్టర్‌ ఎంఎస్‌ రాజు, పీడియాట్రిక్‌ విభాగాధిపతి, కేజీహెచ్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలతో ముందస్తుగా వార్డు ఏర్పాటుచేశాం. మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేలా సిబ్బందిని కేటాయించాం. ప్రస్తుతానికి ఆ తరహా కేసులు నమోదుకాలేదు. ఒకవేళ వస్తే మెరుగైన సేవలు అందించేందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నాం. శ్వాసకోశ వ్యాధులతో వచ్చే చిన్నారుల నుంచి ఇన్‌ఫ్లూయెంజా నాసల్‌ స్వాబ్‌ సేకరించి పరీక్షలకు పంపించాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా స్వాబ్‌ సేకరించే కిట్లను సిద్ధం చేశాం. ఆందోళన చెందకుండా అవగాహన ఉండడం మంచిది.

Updated Date - 2023-11-29T01:14:48+05:30 IST