Share News

అంగన్‌వాడీలపై ఒత్తిళ్లు

ABN , First Publish Date - 2023-11-29T01:10:44+05:30 IST

తమ సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబరు ఎనిమిదో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూని యన్‌ (సీఐటీయూ అనుబంధం) సన్నద్ధమవుతోంది.

అంగన్‌వాడీలపై ఒత్తిళ్లు

నిరవధిక సమ్మెకు వెళ్లకుండా అడ్డుకునేందుకు అధికారుల యత్నాలు

ఆ దిశగా ఉన్నతాధికారులకు ఆదేశాలు

రేషన్‌ సరకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఊరుకోబోమంటూ హెచ్చరికలు

విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

తమ సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబరు ఎనిమిదో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూని యన్‌ (సీఐటీయూ అనుబంధం) సన్నద్ధమవుతోంది. అయితే ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నా. మరోవైపు అసోసియేషన్‌ ప్రతినిధులతో కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే డిమాండ్లను పరిష్కరించేంత వరకు వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అంగన్‌వాడీ వర్కర్స్‌ ఆరోపిస్తున్నారు. గర్భిణులు, బాలింత లకు రేషన్‌ సకాలంలో పంపిణీ చేయకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారంటున్నారు. ఇదంతా తమపై ఒత్తిడి పెంచేందుకేనని, సమ్మెకు దూరం చేసే ప్రక్రియలో భాగమేనని ఆరోపిస్తున్నారు.

సాధారణంగా గర్భిణులు, బాలింతలకు రేషన్‌ నెలలో రెండు విడతలు (మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం)గా పంపిణీ చేస్తున్నారు. అయితే, డిసెంబరు ఎనిమిదో తేదీ నుంచి సమ్మెకు వెళుతున్న నేపథ్యంలో ముందుగానే స్టాక్‌ (రేషన్‌ సరకులు) ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నెలాఖరులోగా సరుకులు విడుదల చేస్తే డిసెంబరు నెలలో ఒకటో తేదీనే శుక్రవారం వస్తోందని, ఆరోజే పంపిణీ పూర్తిచేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. అదేవిధంగా ఏడో తేదీలోగా రెండో విడత రేషన్‌ కూడా అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, అధికారులు మాత్రం అందుకు సమ్మతించడం లేదు. రేషన్‌ సరకులు ముందుగా అందించడం సాధ్యం కాకపోవచ్చునని, లబ్ధిదారులకు మాత్రం పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేస్తున్నారు. సకాలంలో రేషన్‌ సరకులు పంపిణీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు నిరవధిక సమ్మెకు వెళ్లకుండా ఏదోవిధంగా అడ్డుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉన్నట్టు చెబుతున్నారు.

Updated Date - 2023-11-29T01:10:46+05:30 IST