Share News

’పేట వైసీపీలో వర్గపోరు

ABN , First Publish Date - 2023-11-29T00:54:53+05:30 IST

పాయకరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు మరోమారు బయటపడ్డాయి. అసమ్మతి వర్గానికి చెందిన పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గూటూరు శ్రీనివాసరావు, తదితరులు ‘ఏపీకి జగనే సీఎం ఎందుకు కావాలి’ కార్యక్రమం వేదిక వద్దకు రాకుండా దూరంగా వుండిపోయారు.

’పేట వైసీపీలో వర్గపోరు
సభా వేదికకు దూరంగా జనం మధ్యలో నిల్చున్న అసమ్మతి నేతలు ధనిశెట్టి బాబూరావు, గూటూరు శ్రీనివాసరావు

‘ఏపీకి జగన్‌ ఎందుకు కావాలి’ కార్యక్రమంలో బయటపడిన విభేదాలు

వేదికకు దూరంగా అసమ్మతి నేతలు

పాయకరావుపేట, నవంబరు 28: పాయకరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు మరోమారు బయటపడ్డాయి. అసమ్మతి వర్గానికి చెందిన పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గూటూరు శ్రీనివాసరావు, తదితరులు ‘ఏపీకి జగనే సీఎం ఎందుకు కావాలి’ కార్యక్రమం వేదిక వద్దకు రాకుండా దూరంగా వుండిపోయారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ధనిశెట్టి బాబూరావు, గూటూరు శ్రీనివాసరావు, తదితరులు వేదికపైకి రాని విషయాన్ని గుర్తించిన ఆయన.. వారి వద్దకు వెళ్లి వేదిక వద్దకు రావాలని ఆహ్వానించారు. కానీ వారు సున్నితంగా తిరస్కరించారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొద్దిసేపు కరెంటు నిలిచిపోయి మైకులు పనిచేయకపోవడంతో అసమ్మతి వర్గంలోని పలువురు ఈలలువేసి హేళన చేసినట్టుగా వ్యవహరించారు. కార్యక్రమం మధ్యలో బయటకు వెళ్లిపోతున్న పలువురు వలంటీర్లను, వేదికపై ఉన్న నాయకులు ప్రశ్నిస్తున్న సమయంలో అసమ్మతి వర్గం నుంచి ‘వలంటీర్లకు ప్రభుత్వం జీతాలు ఇస్తోంది, మీరు కాదు’ అన్న మాటలు వినిపించాయి. దీంతో ఎమ్మెల్యే ప్రతిస్పందిస్తూ.. ‘ఆవేశంతో మాట్లాడుతున్నారు.. వారు మన నాయకులే’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు లంక సూరిబాబు, నాయకులు దగ్గుపల్లి సాయిబాబా, గారా ప్రసాద్‌, జగతా శ్రీను, దేవవరపు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:54:55+05:30 IST