Vijay Shankar Phanindra: పురోహితులను వేలం వేయడాన్ని ఖండిస్తున్నాం..
ABN , First Publish Date - 2023-07-16T12:23:22+05:30 IST
విశాఖ జిల్లా: అన్నవరం దేవస్ధానంలో పురోహితుల వేలం నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సింహాచలం తొలిపావంచా వద్ద విశ్వహిందూ పరిషత్ , బీజేపీ ధార్మిక పరిషత్ నిరసన కార్యక్రమం చేపట్టింది.
విశాఖ జిల్లా: అన్నవరం దేవస్ధానంలో పురోహితుల వేలం నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సింహాచలం తొలిపావంచా వద్ద విశ్వహిందూ పరిషత్ , బీజేపీ ధార్మిక పరిషత్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర కో కన్వీనర్ విజయ్ శంకర్ ఫణీంద్ర మాట్లాడుతూ.. పురోహితులను వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘పురోహితులతో పెట్టుకుంటారా?.. మీకు సలహాలు ఎవరు ఇస్తున్నారు?.. మీ ప్రభుత్వాన్ని దింపేయడానికే ఈ సలహాలు అన్నీ.. బ్రాహ్మణులను ఇప్పటికే రోడ్డుకు లాగేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పళ్లెంలో భక్తులు వేసే దక్షిణ కూడా హుండీలో వేస్తూ అర్చకుడి పొట్టకొడుతున్నారని.. పురోహితులు ఏడుస్తున్నారని అన్నారు. పురోహితులు ఏమైనా గొర్రెలా వేలం వేయడానికి? అంటూ ప్రశ్నించారు. పాస్టర్లకు, ఇమామ్లకు వేలం పాట పెట్టాలని.. ఆ ధైర్యం మీకు వుందా? అని విజయ్ శంకర్ ఫణీంద్ర నిలదీశారు.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర మఠాలు ఆలయాల పరిరక్షణ కన్వీనర్ పూడి పెద్ది శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని దెబ్బ తీయడానికి.. చులకన చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. పురోహితులకు వేలం పాట అనేది ఎప్పుడూ వినలేదన్నారు. అన్నవరం దేవస్ధానం ఈవోకు వేలం పాట సలహా ఎవరు ఇచ్చారన్నారు. ఆరోపణలు వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వం తమకు సంబంధం లేదని తప్పుకుంటుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ ఏడిసి ఆజాద్ సొంత నిర్ణయం తీసుకున్నారని అంటున్నారని, అలాంటప్పుడు అజాద్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని పూడి పెద్ది శర్మ డిమాండ్ చేశారు.