Share News

ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకంగా వ్యవహరిస్తాం

ABN , First Publish Date - 2023-11-29T01:21:37+05:30 IST

రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు, విజ్ఞప్తికి సరైన పరిష్కారాన్ని చూపిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విశాఖ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు జె.శ్యామలరావు పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకంగా వ్యవహరిస్తాం

రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు జె.శ్యామలరావు

తప్పుల తడకలుగా ఉన్నాయని టీడీపీ, బీజేపీ నేతల ఫిర్యాదు

పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు

విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు, విజ్ఞప్తికి సరైన పరిష్కారాన్ని చూపిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విశాఖ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు జె.శ్యామలరావు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ అందరి సహకారంతో అత్యంత కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషిచేస్తామన్నారు. తప్పులతో కూడిన జాబితాలను రూపొందిస్తున్నారని, కొంతమంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆరోపించారు. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. కొన్నిచోట్ల అర్హత ఉన్నప్పటికీ ఓట్లను తొలగిస్తున్నారని, అలాగే డెత్‌ సర్టిఫికెట్‌ లేదనే కారణంతో మరణించిన వారి ఓట్లను తొలగించడం లేదన్నారు. ఫొటోలు తప్పుగా వస్తున్నాయని, ఒకరికి రెండు, అంతకంటే ఎక్కువ ఓట్లు ఉంటున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఒకే కుటుంబంలో వ్యక్తులకు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలను కేటాయించారని పరిశీలకులు శ్యామలరావు దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై ఆయన స్పందిస్తూ ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ పరిధిలో ఉండే అంశాలకు తక్షణమే చర్యలు తీసుకుంటామని, లేనిపక్షంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకుంటామని బదులిచ్చారు. అందరి సహకారంతో ముందుకు వెళతామని, పారదర్శక విధానాలు అవలంబిస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ఇప్పటివరకు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వినతులపై తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లా ఓటర్ల జాబితా రూపకల్పన, ప్రత్యేక క్యాంపులు, అవగాహన శిబిరాల గురించి వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబరు 26 నాటికి జిల్లాలో 19,15,682 మంది ఓటర్లు ఉండగా, డ్రాఫ్ట్‌ వెరిఫికేషన్‌ తరువాత ఈ నెల 26వ నాటికి 19,15,316 మంది వున్నట్టు వివరించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో తమ దృష్టికి వచ్చిన వినుతులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, ఆప్‌, సీపీఎం, బీఎస్పీ తదితర పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T01:21:38+05:30 IST