Share News

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్లు నమోదు

ABN , First Publish Date - 2023-11-29T00:53:11+05:30 IST

టీడీపీ, జనసేన కూటమితో వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి దొంగ ఓట్ల నమోదుకు తెగబడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్లు నమోదు
ఓటరు జాబితాల్లో లోపాలను కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టికి వివరిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు.

టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపణ

స్వచ్ఛమైన ఓటరు జాబితాలు రూపొందించాలని కలెక్టర్‌కు వినతి

అనకాపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ, జనసేన కూటమితో వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి దొంగ ఓట్ల నమోదుకు తెగబడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. ఓటరు జాబితాల్లో లోపాలను గుర్తించి స్వచ్ఛమైన జాబితాలను రూపొందించాలని మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టిని కలిసి కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాలో అనేక లోపాలు ఉన్నాయని కలెక్టర్‌కు వివరించామన్నారు. జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లను, చనిపోయిన, డబుల్‌ ఎంట్రీ, సున్నా డోర్‌ నంబర్లు, వలస వెళ్లిపోయిన వారి ఓట్లు తొలగించాలని కోరినట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి వైసీపీ నాయకులు కావాలనే టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ పరిశీలనలో గుర్తించిన వివరాలను కలెక్టర్‌కు అందించామన్నారు. ఆయనతోపాటు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పీవీజీ కుమార్‌ (మాడుగుల), ప్రగడ నాగేశ్వరరావు (ఎలమంచిలి), టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కార్యదర్శి బి.శ్రీనివాసరావు తదితరులు కలెక్టర్‌ను కలిశారు.

టీడీపీ కార్యాలయంలో ఫూలేకు నివాళి

సామాజిక విప్లవ ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావుఫూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, ఎలమంచిలి ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, తదితరులు జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫూలే గొప్పదనాన్ని వక్తలు కొనియాడారు. టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:53:12+05:30 IST