Share News

తీసుకొచ్చినా ఉండలే!

ABN , First Publish Date - 2023-11-29T00:10:29+05:30 IST

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు నాయకులు జనాన్ని తరలించినా వారు ఉండడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. సభ ప్రారంభమైన కాసేపట్లోనే వెనుతిరిగారు.

తీసుకొచ్చినా ఉండలే!
మంత్రులు ప్రసంగిస్తుండగా వెనుదిరిగిన జనం

తీసుకొచ్చినా ఉండలే!

మంత్రులు మాట్లాడుతుండగా వెనుతిరిగిన జనం

విజయనగరం-పాలకొండ రోడ్డులో వైసీపీ బస్సుయాత్ర సభ

వాహన చోదకులకు ఇబ్బందులు.. స్తంభించిన ట్రాఫిక్‌

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ నెల్లిమర్ల

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు నాయకులు జనాన్ని తరలించినా వారు ఉండడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. సభ ప్రారంభమైన కాసేపట్లోనే వెనుతిరిగారు. వచ్చేవారికన్నా వెళ్లిన వారే అధికంగా కనిపించారు. మరోవైపు రోడ్డు మధ్యలో సభ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు.. వాహన చోదకులు అనేక అవస్థలు పడ్డారు. మంగళవారం ఉదయం నుంచే రోడ్డు మధ్యలో సభా వేదిక ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రధాన మార్గంలో విజయనగరం నుంచి నెల్లిమర్ల మీదుగా గరివిడి, చీపురుపల్లి, రాజాం, పాలకొండ వైపు వెళ్లే వాహనాలను వేరే రహదారి గుండా మళ్లించారు. దీంతో వారికి సుమారు 15 కిలోమీటర్ల దూరం అదనంగా పెరిగింది. వాహన చోదలకులు, ప్రయాణికులు నానా అవస్థలు చవి చూశారు. నెల్లిమర్ల గాంధీనగర్‌ కాలనీ మీదుగా ఆటోలు, కార్లు, బైకులను మళ్లించడంతో ఇరుకు రోడ్డులో వెళ్లడానికి నరకయాతన పడ్డారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయి విసుగెత్తిపోయారు.

- సభావేదిక వద్దకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. కొంతమంది ఆటోల్లో వచ్చిన సభా వేదిక వద్దకు రాకుండా ఆటోల వద్దే ఉండిపోవటం కన్పించింది.

- మంత్రులు ప్రసంగిస్తుండగానే అనేక మంది వెనుతిరిగి వెళ్లిపోవటం కన్పించింది. ముఖ్యంగా మహిళలు, యువత ఎక్కువగా ఆదిలోనే తిరుగుముఖం పట్టారు. కొంతమంది ఎల్‌ఈడీ స్ర్కీన్ల వద్ద ఉన్నారు.

- జనాన్ని రప్పించేందుకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నెల్లిమర్ల ప్రతివార్డు నుంచి జనాన్ని రప్పించేందుకు వలంటీర్లకు, డ్వాక్రా మహిళకు బాధ్యతలు అప్పగించారు. వార్డు నుంచి వంద మంది మహిళలు, రెండు వందల మంది పురుషులను తీసుకు రావాలని టార్గెట్లు ఇచ్చి మరీ జనాన్ని రప్పించారు.

- నెల్లిమర్ల, విజయనగరం కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు సుమారు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. రామతీర్థం కూడలి నుంచే ఆటోలు, బస్సులను వేరే రోడ్డులోకి మళ్లించారు. నెల్లిమర్ల, జరజాపుపేట, మొయిద వైపు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఉంటే ఉండండి పోతే పొండి: మంత్రి ధర్మాన

మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగిస్తుండగా జనం వెళ్లిపోవటం.. మరో వైపు సభా వేదిక ముందున్న ప్రజలు పిచ్చాపాటిగా మాట్లాడుకోవటాన్ని ధర్మాన గుర్తించారు. దీంతో సహనం కోల్పోయి ఉంటే ఉండండి.. పోతే పొండి అంటూ జనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-29T00:10:54+05:30 IST