Share News

ఎలా ఆడుతారో?

ABN , First Publish Date - 2023-11-29T00:16:44+05:30 IST

ఆడుదాం ఆంధ్ర’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్యక్రమంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్వహణకు నిధుల కేటాయింపులు లేవు. ఎలా సమకూర్చాలన్నదానిపై అధికారులకు స్పష్టత కరువు.

ఎలా ఆడుతారో?

ఎలా ఆడుతారో?

‘ఆడుదాం ఆంధ్ర’ ఖర్చులపై స్పష్టత కరువు

సౌకర్యాల మాటమేటో.. నిరుద్యోగులు పాల్గొంటారా?

గ్రామం నుంచి ఐదు స్థాయిల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటన

‘ఆడుదాం ఆంధ్ర’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్యక్రమంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్వహణకు నిధుల కేటాయింపులు లేవు. ఎలా సమకూర్చాలన్నదానిపై అధికారులకు స్పష్టత కరువు. చాలా గ్రామాల్లో మైదానాలు లేవు. ఆటల శిబిరాల వద్ద మౌలిక సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేస్తారో తెలియడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ జిల్లా అధికారి నిరాశ వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో యువత భాగస్వామ్యం కష్టమంటున్నారు. అందులోనూ నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్‌లపై గంపెడాశలు పెట్టుకుని పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. వారు ఆసక్తి చూపకపోవచ్చునన్నది సర్వత్రా విన్పిస్తున్న మాట.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ప్రకటించిన ‘ఆడుదాం ఆంధ్ర’ను చాలా మంది రాజకీయ శిబిరాలుగా అభివర్ణిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రకటించడంపై విమర్శలు సంధిస్తున్నారు. కొత్త తరాన్ని ప్రోత్సహిస్తే క్రీడాస్ఫూర్తి అవుతుందని, అలా కాకుండా 15 ఏళ్లు దాటిన వారంతా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని ప్రకటించడం సరికాదంటున్నారు. నిధుల వృథా కార్యక్రమంగా పేర్కొంటున్నారు. వచ్చే నెల 15 నుంచి ఐదు స్థాయిల్లో అంటే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో 15 ఏళ్లు దాటిన ఏ వయసు వారైనా పాల్గొనవచ్చు. దీనిపై క్రీడా విభాగం అధికారులు అయోమయంలో పడ్డారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ సోమవారం విజయనగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో నిధులపై ప్రశ్నిస్తే కిట్లు, క్రీడా సామగ్రి సమకూర్చుతున్నామని చెప్పారు. ఏ స్థాయిలో అన్నది స్పష్టత ఇవ్వలేదు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి కూడా మౌనమే సమాధానమైంది. గ్రామంలో వలంటీర్లు, పాఠశాలల్లో పనిచేసే పీడీలు ఏర్పాట్లు చూసుకుంటారని అంటున్నారు.

- క్రీడలు నిర్వహించాలంటే కనీసం టెంట్లు వేయాలి. అలాగే తాగునీరు, కూర్చొనేందుకు కుర్చీల ఏర్పాట్లు ఇలా కనీస వసతులు అవసరం. వీటిని ఎవరు సమకూర్చుతారో తెలియని పరిస్థితి. గ్రామ స్థాయిల్లో సిద్ధంగా క్రీడా మైదానాలు లేవు. గత టీడీపీ ప్రభుత్వం పాఠశాల, ఉన్నత పాఠశాలలు, కళాశాలల స్థాయిలో క్రీడా మైదానాల కోసం నిధులు మంజూరు చేసింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వీటిని వదిలిపెట్టింది. దీంతో క్రీడా పోటీలకు ఉపయోగపడే మైదానాలు అరుదైపోయాయి. క్రీడలను ఇన్నాళ్లూ గాలికి వదిలేసి ఇపుడు గ్రామ స్థాయి నుంచి పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. మరోవైపు యువత ఉపాధి వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. గ్రామ స్థాయిలో వయో వృద్ధులు మినహా యువతరం కన్పించని పరిస్థితి ఉంది. మరి క్రీడల్లో ఎవరు పాల్గొంటారో చూడాలి.

- గత ప్రభుత్వ హయాంలో విద్యార్థి దశ నుంచే క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా వేసవి క్రీడా శిబిరాలు జరిగేవి. వీటిని ఈ ప్రభుత్వం కొనసాగించలేదు. ప్రాథమికోన్నత, ఉన్నత, కళాశాల స్థాయిల్లోకూడా క్రీడా పోటీలు కన్పించడం లేదు. కాస్తా ఆసక్తి ఉన్న పీడీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో గత ప్రభుత్వం విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా శిక్షణ పాఠశాలను సైతం వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఇలా క్రీడల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించి ఇపుడు క్రీడా పోటీలకు సిద్ధం కావడమేంటని క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు.

--------

Updated Date - 2023-11-29T00:16:45+05:30 IST