Share News

సాధికార యాత్రకు అర్హత ఉందా?

ABN , First Publish Date - 2023-11-29T00:12:22+05:30 IST

సామాజిక సాధికార యాత్ర చేయడానికి వైసీపీకి ఏ అర్హత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు ఎత్తివేశారని, బీసీలకు మొండిచేయి చూపించారని విమర్శించారు.

సాధికార యాత్రకు అర్హత ఉందా?
మాట్లాడుతున్న పురంధేశ్వరి

సాధికార యాత్రకు అర్హత ఉందా?

అన్ని వర్గాలను పథకాలకు దూరం చేసిన ప్రభుత్వం

అప్పుల రాష్ట్రంగా పేరు సిగ్గుచేటు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి

విజయనగరం దాసన్నపేట, నవంబరు 28: సామాజిక సాధికార యాత్ర చేయడానికి వైసీపీకి ఏ అర్హత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు ఎత్తివేశారని, బీసీలకు మొండిచేయి చూపించారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లా పర్యటనకు మంగళవారం విచ్చేసిన ఆమెకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఈఆర్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం బూత్‌ స్వశక్తికరణ సమావేశానికి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్‌ బియ్యం ఐదు కిలోలు ఉచితంగా అందిస్తుంటే, రేషన్‌ బ్యాగులపై జగన్మోహన్‌రెడ్డి ఫొటోను ముద్రించుకుంటున్నారని, ఈ స్టిక్కర్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం పిల్ల కాలువలు కూడా పూర్తిచేయలేదన్నారు. గరివిడి సమీపంలో మైనింగు టెండర్లు పిలిచి ఎవరిని పాల్గొనకుండా వైసీపీ నాయకులు వారి అనుచరులకే టెండర్లు దక్కించుకున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన ఇళ్లను రూ.50 వేల నుంచి రూ.లక్షకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఏపీ పూర్తిగా అప్పుల ఊబిల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టడం బాధకరమన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేకపోవడం దయనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు విద్యుత్‌ బిల్లు పెంచడంతో నడపలేక మూతపడుతున్నాయన్నారు. వంశఽధార, నాగావళి నదుల్లో వైసీపీ నాయకులు ఇష్టానుసారం ఇసుకను దోచుకుంటున్నారని, ఆ నదులు ప్రమాదం అంచుకు చేరాయన్నారు. జిల్లాలో చక్కెర కర్మాగారాలు మూతపడడంతో రైతులు, కూలీలు, వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నడికుదిటి ఈశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి.దేవానంద్‌, నాయకులు రెడ్డిపావని, భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి, గద్దె బాబురావు, రాజేష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:12:24+05:30 IST