మురుగు కాలువ నిర్మాణంపై ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-04-08T00:01:30+05:30 IST

ముంజేరు పంచాయతీ సిద్దార్థ కాలనీలో మురుగు కాలువ నిర్మాణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముంజేరు గ్రామం, సిద్దార్థ కాలనీల మధ్య గత కొంత కాలంగా మురుగు కాలువ సమస్య ప్రధాన సమస్యగా మారింది.

మురుగు కాలువ నిర్మాణంపై ఉద్రిక్తత

- జేసీబీతో తవ్వకాలు.. అడ్డుకున్న కాలనీవాసులు

భోగాపురం: ముంజేరు పంచాయతీ సిద్దార్థ కాలనీలో మురుగు కాలువ నిర్మాణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముంజేరు గ్రామం, సిద్దార్థ కాలనీల మధ్య గత కొంత కాలంగా మురుగు కాలువ సమస్య ప్రధాన సమస్యగా మారింది. సిద్ధార్థ కాలనీ సమీపంలో మురుగు కాలువ ఏర్పాటు కోసం గతంలో అధికారులు, పోలీసులు పలుమార్లు వెళ్లగా స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరుగుతూ వస్తు న్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎంపీడీవో దాసరి బంగారయ్య తన సిబ్బంది తోపాటు ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి పోలీసులతో కాలనీకి చేరుకున్నారు. జేసీబీ సాయంతో కాలువ నిర్మానానికి తవ్వకాలు ప్రారంభించారు. దీంతో సిద్దార్థ కాలనీ వాసులు మూకుమ్మడిగా వచ్చి తవ్విన కాలువను కప్పేశారు. అనంతరం జేసీబీకి అడ్డంగా పెద్ద దుంగలు పెట్టి నిరసన తెలిపారు. దీంతో అధికారులు, పోలీసులు, కాలనీవాసుల నడుమ స్థానికులు వాగ్వాదం జరిగింది. ఇది ప్రభుత్వ స్థలమని మురుగునీరు పోయేలా ఇక్కడ కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, ఇందుకు సహకరించాలని లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని అధికారులు హెచ్చ రించారు. మంజేరు గ్రామం నుంచి మురుగు కాలనీ గుండా వస్తే తామంతా రోగాల బారిన పడతామని, ఇందుకు అంగీకరించబోమని ఆ కాలనీవాసులు చెప్పారు. గతంలో ఏ విధంగా మురుగు కాలువ ఉందో అదే విధంగా నిర్మించుకోవాలని, ఇక్కడ నిర్మిస్తే మా ప్రాణాలు ఒడ్డయినా అడ్డుకొంటామన్నారు. దీంతో కొంత సమయం కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. వారం రోజులు గడువు ఇస్తే ఇక్కడ కాలువ నిర్మాణం జరగకుండా అవసరమైన పత్రాలు తీసుకొస్తామని, లేదంటే కాలువ నిర్మాణానికి అడ్డుతగలమని కాలనీవాసులు అన్నారు. దీనికి అంగీకరించిన అధికారులు అక్కడ నుంచి వెనుతిరిగారు. ఇంత రాద్దాంతం జరుగుతున్న మా గ్రామ సర్పంచ్‌ కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ముంజేరు గ్రామానికి చెందిన కొంతమంది ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని మురుగు సమస్యతో పడుతున్న ఇబ్బందులు వివరించారు. వారం రోజుల పాటు మురుగు సమస్యతో ఎలా ఉండాలని ఎంపీడీవోని ప్రశ్నించారు. దీంతో ఎంపీడీవో మళ్లీ సిద్దార్థ కాలనీకి చేరుకుని రెండు రోజుల్లో కాలువ నిర్మాణం చేపడతామని, అడ్డుకొంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీవో ఆదిబాబు, ఏపీఎం రమణ, కార్యదర్శి రాజ్‌కుమార్‌, సచివాలయ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-08T00:01:30+05:30 IST