Share News

ప్రయాణం.. ప్రమాదం!

ABN , First Publish Date - 2023-11-28T00:11:47+05:30 IST

జిల్లాలోని పంట కాల్వలపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి.

ప్రయాణం.. ప్రమాదం!
కోతకు గురైన గుర్వాయిపాలెం వంతెన అప్రోచ్‌ రోడ్డు

ప్రమాదకరంగా పంట కాల్వలపై వంతెనలు.. అప్రోచ్‌ రోడ్లు

జిల్లాలోని పంట కాల్వలపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. వంతెనలకు ఉన్న అప్రోచ్‌ రోడ్లు సైతం అధ్వానంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాకా కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్యను ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని అయా గ్రామస్థులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

రెయిలింగ్‌ లేని కొండంగి లాకుల వంతెన

కలిదిండి, నవంబరు 27 : కొండంగి లాకుల వద్ద ఉన్న వంతెన అప్రోచ్‌ రోడ్డుకు ఇరువైపులా రెయిలింగ్‌ లేక వాహనాలు అదుపు తప్పి కాల్వలోకి బోల్తా పడుతున్నాయి. మద్వానిగూడెం, కొండంగి, పల్లిపాలెం, యడవల్లి, మట్టగుంట, అమరావతి గ్రామాల ప్రజలు ఈ వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ వంతెన మలుపు ప్రమాదకరంగా ఉండడంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈఈ అరవింద్‌ను వివరణ కోరగా, గుర్వాయిపాలెం – పెదలంక రహదారి మరమ్మతులకు రూ.11 కోట్లు మంజూరయ్యాయని రహదారి మరమ్మతులు పనులు చేపట్టినప్పుడు గుర్వాయిపాలెం వంతెన ఇరుపక్కల రెయిలింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మద్వానిగూడెం – మట్టగుంట రహదారి మరమ్మతులకు రూ.మూడు కోట్లు మంజూరయ్యాయని, రహదారి మరమ్మతులు చేపట్టినప్పుడు కొండంగి లాకుల వంతెన ఇరువైపులా రెయిలింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

రెండుగా విడిపోతున్న బొమ్మినంపాడు వంతెన

ముదినేపల్లి : బొమ్మినంపాడు వద్ద క్యాంప్‌ బెల్‌ ప్రధాన పంట కాల్వపై ఉన్న వంతెన ప్రమాద స్థితిలో ఉంది. వంతెనకు రెండు వైపులా శ్లాబు రోడ్డు నుంచి విడిపోతున్నది. ఒక వైపు వంతెన విడిపోగా, మరోవైపు రోడ్డు కోతకు గురైంది. ఈ కాల్వలో పడవలు వెళ్లే విధంగా డిజైన్‌ చేసి ఎత్తుగా వంతెనను నిర్మించడం, అందుకు తగ్గ అప్రోచ్‌ రోడ్లు నిర్మించక పోవడంతో వంతెన విడిపోతోంది. గ్రామ నడి బొడ్డున ఉన్న ఈ వంతెన ప్రమాదస్థితిలో ఉండడం గ్రామస్థులను ఆందోళనకు గురి చేస్తోంది. సూర్యనారాయణపురం వైపు వంతెన విడిపోయి రోడ్డు కృంగిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. పల్లంగా ఉన్న రోడ్డు నుంచి ఒకేసారి ఎత్తయిన వంతెనపైకి లోడు వాహనాలు ఎక్కే సమయంలో వంతెన ఊగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతె నకు అవతలి వైపున ఉన్న కొత్తూరు, గొల్లగూడెం, కొత్త దళితవాడల నుంచి నిత్యం వాహనాల్లో విద్యార్థులు ఈ వంతెనపై నుంచే వెళ్తుంటారు. రైతులు, ఆక్వా రైతులు తమ ఉత్పత్తుల రవాణా చేసేందుకు ఈ వంతెనే ఆధారం. అధికారులు వంతెనకు రక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కోతకు గురైన గుర్వాయిపాలెం వంతెన అప్రోచ్‌ రోడ్డు

కలిదిండి మండలంలోని గుర్వాయిపాలెం వంతెన అప్రోచ్‌ రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా ఉంది. అప్రోచ్‌ రోడ్డుకు ఇరు పక్కల రెయిలింగ్‌ లేక వాహనాలు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడుతు న్నాయి. ద్విచక్ర వాహనదారులు గాయాల పాలవు తున్నారు. రోడ్డు మార్జిన్‌ లేకపోవడంతో ఎదురెదురు గా వస్తున్న వాహనాలు పక్కకు తప్పుకోవడానికి వీలు లేక గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. కొత్తూరు, సంతోషపురం, భాస్కరావుపేట, మూల్లంక, రామకృష్ణపురం, పెదలంక గ్రామాల ప్రజలు అప్రోచ్‌ రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. చేపలు, రొయ్యల చెరువులు అధికంగా ఉండడంతో తవుడు లోడుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అదుపు తప్పి ఒక్కొసారి బోల్తా పడుతున్నాయి.

Updated Date - 2023-11-28T00:11:51+05:30 IST