Share News

చెరువు కుంటలే ఇళ్ల స్థలాలు !

ABN , First Publish Date - 2023-11-28T00:11:31+05:30 IST

తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కృష్ణాయపాలెంలో చెరువు కుంటలను ఇళ్ల స్థలాలకు ఇచ్చేలా అధికారులు పావులు కదుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా చేపల కోసం వేలంపాట నిర్వహించి పట్టుబడులు చేసే ప్రాంతంలో ఇప్పుడు జగనన్న ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

చెరువు కుంటలే ఇళ్ల స్థలాలు !
ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న చెరువు కుంట స్థలం

కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల అవస్థలు

బురద కయ్య ప్రాంతంలో సచివాలయం

కుంగి కిందకు దిగబడిన భవనం

అయినా తీరుమారని ప్రభుత్వం

పేదలకు స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు

అదే జరిగితే మురుగుకు అవరోధం..రహదారికి అడ్డంకులు

గగ్గోలు పెడుతున్న గ్రామస్థులు ..పట్టించుకోని అధికారులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కృష్ణాయపాలెంలో చెరువు కుంటలను ఇళ్ల స్థలాలకు ఇచ్చేలా అధికారులు పావులు కదుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా చేపల కోసం వేలంపాట నిర్వహించి పట్టుబడులు చేసే ప్రాంతంలో ఇప్పుడు జగనన్న ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే జరిగితే రైతుల రాక పోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. పంటపొలాలు నీట మునిగి పోనున్నాయి. డ్రెయినేజీ లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు వెళ్లేందుకు ఇబ్బందులు పడనున్నారు. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా స్థలాలు ఇచ్చేందుకు హద్దులు వేశారు. దీనిని గ్రామస్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

జగనన్న ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలు నిర్మాణాలకు అనువుగా లేవు. ఇప్పటికీ లేఅవుట్‌లు పూడిక చేయలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు, కుంటల్లో స్థలాలు ఇచ్చేశారు. వాటిని పూడ్చేందుకు ప్రభుత్వానికి అతీ గతీ లేదు. అయినా సరే ప్రభుత్వం తన తీరు మార్చుకోవడం లేదు. కొత్తగా స్థలాలు ఇవ్వడానికి చెరువు కుంటలు, పంట బోదెలు, పుంత రహదారులను ఎంపిక చేస్తోంది. రైతులు, గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతిమంగా లబ్ధిదారులు ఆసక్తి చూపకపోయినా సరే బలవంతంగా కట్టబెడుతున్నారు. ఫలితంగా జిల్లాలో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఇవేమీ ఇప్పుడు అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. చెరువుకుంటలను ఎంపిక చేసి లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గుతున్నారు.

కుంగిన సచివాలయం

గ్రామంలో చెరువు ప్రాంతాన్ని పూడ్చివేసి సచివాలయాన్ని నిర్మించారు. అది పూర్తి కాకుండానే ఒకవైపు కిందికి కుంగిపోయింది. దాంతో బీటలు వారింది. దానికి సమీపంలోనే రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించారు. ఇప్పుడు అదే ప్రాంతానికి ఆనుకుని ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ స్థలం ఇరుకుగా ఉంది. ఒక పర్యాయం దానిని పూడ్చారు. అయినా కిందికి దిగిపోయింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సచివా లయమే కుంగిపోతే పేదల ఇళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్థలాలకు ఇచ్చే ప్రాంతమంతా చెరువు అని చెపుతున్నాసరే అధికారులు పెడచెవిన పెడుతున్నారు. చెరువు కాదంటూ తెగేసి చెపుతున్నారు. అదే ఇప్పుడు గ్రామస్థులను కలవరపెడుతోంది.

పూడికకే సొమ్మంతా

లబ్ధిదారులకు స్థలం మంజూరు చేసినా ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేదు. పూడిక కోసమే వేలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అయినా సరే గట్టి పడుతుందన్న గ్యారంటీ లేదు. చెరువు అడుగు భాగంలో కయ్యగా మారింది. అక్కడ మట్టిని తవ్విపోసి వేరే ప్రాంతానికి తరలించాలి. ఆ తర్వాత నాణ్యమైన కంకరతో పూడిక చేయాలి. అప్పుడే నిర్మాణాలకు అనువుగా ఉంటుంది. అలా చేయకపోవడం వల్లే సచివాలయం కుంగింది. అదే దుస్థితి జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు ఎదురుకానుంది. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే సొమ్మంతా పూడికకోసమే వెచ్చించాల్సి ఉంటుంది. ఇక నిర్మాణాలు ఎలా చేపడతారో అధికారులకే తెలియాలి.

మురుగుకు మార్గమేదీ

కృష్ణాయపాలెం గ్రామంలో దాదాపు 200 ఇళ్లకు సంబంధించిన మురుగు నీరు చెరువు ప్రాంతం నుంచే వెళుతుంది. అక్కడ డ్రెయిన్‌ నిర్మించాల్సి ఉంటుంది. అలా చేయకుండానే సచివాలయం, రైతు భరోసా కేంద్రం కోసం ఆ స్థలాన్ని పూడ్చేశారు. దాంతో మురుగు వెళ్లే మార్గం మూసుకుపోయింది. వర్షాకాలంలో మురుగునీరంతా ఎగదన్ని మంచినీటి చెరువులో కలిసిపోతోంది. చెరువు కలుషితమవుతోంది. మంచినీటికి ఇబ్బందులు పడే పరిస్థితి. మురుగు నీరు వెళ్లేందుకు గ్రామస్థులే తాత్కాలికంగా సచివాలయం, రైతు భరోసా కేంద్రాల పక్కనుంచి పైపులు వేసుకున్నారు. అదికూడా తాత్కాలికమే. మరోవైపు మంచినీటి చెరువులో పూడిక తీయాలన్నా సరే నీరు తోడి చెరువు కుంట ప్రాంతం నుంచే బయటకు పంపాలి. అంతటి ప్రాధాన్యం ఉన్న స్థలాన్ని ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం కేటాయించేందుకు ప్రణాళిక రచించారు.

రహదారికి అవరోధాలు

ప్రస్తుతం చెరువు కుంట ప్రాంతంలోనే పుంత రహదారి ఉంది. దానిని గ్రామస్థులు అభివృద్ధి చేసుకున్నారు. రహదారి కోసం సొంత స్థలాలను వదులుకున్నారు. నర్సాపురం ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రహదారి అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకున్నారు. నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దానికి ఇప్పుడు అధికారులు అడ్డు తగులుతున్నారు. రహదారి నిర్మాణాన్ని నిలిపివేశారు. స్థలాల ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఆ రహదారి రైతులకు ధాన్యం రవాణా చేసేందుకు అవసరం కానుంది. దానికి కూడా అడ్డు తగిలి స్థలాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంపై గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు.

పంటపొలాలు మునక

చెరువు కుంట ప్రాంతాలకు మురుగునీరు వెళ్లేలా పంటపొలాలు విస్తరించి ఉన్నాయి. అధిక వర్షాల్లో పంటపొలాల నుంచి నీరు అదే చెరువు కుంటలోకి వెళుతుంది. ఆ మార్నాన్ని కూడా అధికారులు పూడ్చివేశారు. దాంతో పంట పొలాలు ముంపు బారిన పడుతున్నాయి. రైతులు మళ్లీ పూడికను తొల గించారు. ఇలా అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయి. అయినా అధికారులకు కనువిప్పు కలగడం లేదు. అధికార పార్టీ ఒత్తిడితో కుంటలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఉత్సాహం చూపుతున్నారు.

Updated Date - 2023-11-28T00:11:38+05:30 IST