Share News

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-11-28T23:46:09+05:30 IST

జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని వేగవంతం చేయాలని గృహనిర్మాణ శాఖ జిల్లా అధికారి కేవీఎస్‌ఆర్‌ రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతి తీరుపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ ఇంజనీర్లతో మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు.

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణశాఖ అధికారి రవికుమార్‌

ఏలూరు సిటీ, నవంబరు 28 : జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని వేగవంతం చేయాలని గృహనిర్మాణ శాఖ జిల్లా అధికారి కేవీఎస్‌ఆర్‌ రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతి తీరుపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ ఇంజనీర్లతో మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. జగనన్న ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని, జిల్లాలో నిర్మాణాల పనులను వేగవంతం చేసేందుకు డిసెంబరు 1వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు 60 రోజుల పాటు ప్రత్యేకంగా మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటికీ ప్రారంభించిన 21వేల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. గృహ నిర్మాణ లక్ష్యాలను మండల, గ్రామ సచివాలయాల వారీగా నిర్దేశించామని, గ్రామ /వార్డ్‌ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డు అమినిటీ సెక్రటరీలు రానున్న రెండు నెలలు జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖాధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్‌, ఐరన్‌కు ఎటువంటి కొరత లేదని, ఇళ్ల నిర్మాణ పనులలో లబ్ధిదారులకు పూర్తిస్థాయి సహకారం అందించి త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, డ్వామా పీడీ ఎ.రాము, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సత్యనారాయణ, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ, జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:46:12+05:30 IST