Share News

జగనన్న ఇళ్లకు దారేది ?

ABN , First Publish Date - 2023-11-28T23:54:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లోని ఇళ్ల నిర్మాణాలు జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి

జగనన్న ఇళ్లకు దారేది ?
పోణంగి రోడ్డులో నిలిచిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు

జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు అంతంత మాత్రమే

స్థలాలు అనువుగా లేక ముందుకురాని లబ్ధిదారులు

మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం

ఇళ్ల నిర్మాణాల్లోనూ కొనసాగుతున్న ఆలస్యం

మంజూరైన ఇళ్లు 59,040, పూర్తయినవి 8,587

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లోని ఇళ్ల నిర్మాణాలు జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 98,874 ఇళ్లు మంజూరు కాగా, జగనన్న కాలనీలకు సంబంధించి 778 లే–అవుట్లలో 59,040 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 8,587 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని జిల్లా గృహ నిర్మాణ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన ఇళ్లల్లో ఇప్పటికే కొన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాకపోగా మిగిలిన ఇళ్ల నిర్మాణాలు మాత్రం పలు దశల్లో కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణాలు పూర్తికాకపోవడానికి ముఖ్యంగా లబ్ధిదారుల్లో అనాసక్తత, కాలనీల్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండడం. కొన్ని లే–అవుట్లలోని స్థలాలు ఇళ్ల నిర్మాణాలకు అనువుగా లేకపోవడం, ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి కేటాయించే నిధులు సరిపోక పోవడంతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయని లబ్ధిదారుల అభిప్రాయాల ద్వారా తెలుస్తోంది. కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో జాప్యం కొనసాగుతోందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కూడా ఈ ఇళ్ల నిర్మాణాల పురోగతి అంతంత మాత్రంగానే ఉండడం గమనార్హం.

– ఏలూరు సిటీ

జిల్లా వ్యాప్తంగా మొత్తం 98,874 ఇళ్లు మంజూరు కాగా వీటిలో జగనన్న కాలనీలకు 59,040 ఇళ్లు కేటాయించగా మిగిలినవి వ్యక్తిగతంగా ఉన్న స్థలాల్లో నిర్మించుకుంటున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు 26,784 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వ్యక్తిగతంగా నిర్మించుకునే ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతుండగా కాలనీల్లోని ఇళ్ల నిర్మాణాలలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినవస్తున్నాయి.

ఏలూరు టూ టౌన్‌ : ఏలూరు నియోజకవర్గంలో నగరానికి కనీసం పది కిలోమీటర్ల దూరంలో మూడు స్థలాల్లో జగనన్న లే అవుట్లు వేశారు. లక్ష్మీపురం 140 ఎకరాల్లో 11వేల మంది, పోణంగిలో 180 ఎకరాల్లో 12 వేల మందికి, కోమడవోలులో 205 ఎకరాల్లో 11 వేల మందికి జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీటిలో కనీసం 70 శాతం స్థలాల్లో పునాదులు కూడా పడలేదు. వైసీపీ నాయకులు బెదిరింపులతో 30 శాతం మంది పునాదులు వేసిన వీటిలో 10శా తం మంది కూడా ఇళ్లు పూర్తిచేసుకున్న పాపాన పోలేదు. జగనన్న కాలనీలు అన్నీ లోతట్టు ప్రాంతాలే.. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోతున్నాయి. రవాణా సౌకర్యాలు లేవు. ప్రభుత్వ సహకారం కొరవడడంతో సగంలోనే నిలిచిపోయాయి.

స్థలాల్లో తుప్పలు, పొదలే..

పోలవరం : పోలవరం మండలంలో మూడేళ్ల క్రితం జగనన్న ఇంటి స్థలాలంటూ ఆర్బాటం చేసి నాయకులు, అధికారులు కొన్ని ఎకరాల భూములు కొనుగోలు చేసి పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. నాటి నుంచి ఆ భూముల్లో తుప్పలు, పొదలు మొలిచాయి తప్ప ఒక్క ఇంటికి కూడా పునాది పడలేదు. ప్రగడపల్లి పంచాయతీలో 23 మందికి, పోలవరం పంచాయతీ ఇటుకలకోట సమీపంలోని 308 మందికి, పట్టిసీమ పంచాయతీలో 212 మందికి గూటాల, కొత్తపట్టిసీమ పంచాయతీల్లో 163 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కేటాయించిన భూముల విషయంలో కొన్ని పొరపాట్లు జరగడం వల్ల భూమి యజమానులు కోర్టుని ఆశ్రయించడంతో కొంతమంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రహదారి లేకుండా ఇళ్ల నిర్మాణమెలా ?

మండవల్లి : మండవల్లిలోని మూడుతాళ్లపాడు రోడ్డులో 180 మందికి ఇళ్ల స్థలాలు కేంటాయించినప్పటికీ కనీసం రహదారి సౌకర్యం లేక గృహ నిర్మాణానికి మెటీరియల్‌ తరలింపు సాధ్యంకాక లబ్ధిదారులు పునాదులు కూడా వేసేందుకు ముందుకు రావడం లేదు. రోడ్డు మార్గం లేక మెటీరియల్‌ తరలించేందుకు అధిక ఖర్చు కావడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన రోడ్ల మెరుగుపై దృష్టి సారించలేకపోతు న్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది లబ్ధిదారులు చొరవ చూపినప్పటికీ కష్టం కావడంతో మధ్యంతరంగానే నిలిచిపోయాయి.

కొద్దిపాటి వర్షానికే బురదమయం

కలిదిండి : కలిదిండిలో 18 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 755 మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేశారు. వీటిలో 600 మంది లబ్ధిదారులు కాంట్రాక్టర్‌ పక్కా గృహాలు కట్టించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటిలో సుమారు 20 పక్కా గృహ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం కొన్ని గృహాలు బేస్‌మెంట్‌ దశలోను మరికొన్ని శ్లాబ్‌ దశలో ఉన్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా లే అవుట్‌కు వెళ్లే ప్రధాన రహదారి సక్రమంగా లేకపోవడంతో మెటీరియల్‌ వెళ్లే పరిస్థితి లేదు. మట్టి రోడ్డు కావడంతో కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది.

శ్రీహరిపురం, వడాలిలో పూడికల్లేవు..

ముదినేపల్లి/ముదినేపల్లి రూరల్‌ : ముదినేపల్లి మండలంలోని శ్రీహరిపురంలో జగనన్న కాలనీ నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. ఈ కాలనీలో గృహాల నిర్మాణాలకు స్థలం సేకరణ జరిగి మూడేళ్లు గడిచినా పూడిక జరగలేదు. శ్రీహరిపురం పంచాయతీ ఏరియాలోని 71 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాల పంపిణీ పూర్తయిన లే అవుట్‌లో గృహాల నిర్మాణం చేపట్టలేదు. ఈ లే–అవుట్‌లో స్థలాన్ని పూడ్చడంలో జరుగుతున్న జాప్యమే దీనికి కారణం. పూడిక పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. ముదినేపల్లి మండలంలోని వడాలిలో 46 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినప్పటికీ పూడిక చేయకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. గడ్డి, ముళ్లకంచెలు దర్శనమిస్తున్నాయి.

అడవులను తలపిస్తున్న లే–అవుట్‌లు

ముసునూరు: ముసునూరు మండలంలోని జగనన్న కాలనీల లేఅవుట్లు అడవులను తలపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఫేజ్‌–2లో ఇళ్ల నిర్మాణాలు జరగాల్సి ఉంది. నేటికి ఒక్క ఇల్లు నిర్మాణం కూడా పూర్తికాలేదు. 16 గ్రామాల్లో వేసిన 25 లేఅవుట్‌ల్లో 2,108 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఈ లే–అవుట్లలో ముసునూరు–2, అక్కిరెడ్డిగూడెం–1, చెక్కపల్లి–1, యల్లాపురం–1, గోపవరం–1 మొత్తం 6 లే అవుట్లపై రైతులు కోర్టు వెళ్లగా నేటికీ వీటిపై స్పష్టత రాలేదు. బలివే గ్రామ లేఅవుట్‌లో ఇచ్చిన 42 స్థలాల్లో 15 ఇళ్లు పలు దశల్లో ఉన్నాయి. కొర్లకుంటలో 32కు 11, లోపూడిలో 82కు పది, రమణ క్కపేటలో 58కు ఎనిమిది ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించారు. మిగిలిన గ్రామాల్లో చిట్టడవులను తలపించేలా లేఅవుట్లు దర్శినమిస్తున్నాయి. ముసునూరులో సంధ్య వాగు వద్ద వేసిన లేఅవుట్‌–3లో ఇళ్లస్థలాలు, గోపవరం–2 లేఅవుట్‌ స్థలాలు ఇంటి నిర్మాణాలకు అనువుగా లేకపోడం, గ్రామానికి సూమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉండడంతో ఈ స్థలాలు వద్దని 532 మంది లబ్ధిదారులు లిఖితపూర్వకంగా అధికారులకు ఆర్జీలు అందించారు.

2,869కి 393 మాత్రమే పూర్తి

నూజివీడు టౌన్‌ : నూజివీడు పట్టణ పరిధిలో మొత్తం 13 లేఅవుట్‌లు ఉండగా, 11 లేఅవుట్‌లలో గృహ నిర్మాణం ప్రారంభమైంది. మరో రెండుచోట్ల ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రాలేదు. పట్టణ పరిధిలో మొత్తం 3,315 స్థలాలు ఇవ్వగా 2,869 మందికి నివాస గృహాలు మంజూరు అయ్యాయి. వాటిలో 393 గృహాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. పట్టణ పరిధిలోని రేగుంట, జగనన్న లేఅవుట్‌ పట్టణానికి చాలాదూరంగా ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులు విముఖత చూపించారు. ఇక బాపునగర్‌ లేఅవుట్‌లో కూడా లబిఽ్ధదారులు భవన నిర్మాణాలకు ముందుకు రాలేదు. నూజివీడు మండల పరిధిలో మొత్తం 25 లేఅవుట్‌లలో 3,482 మందికి స్థలాలు మంజూరయ్యాయి. వీటిలో బిలో బేస్‌మెంట్‌ లెవల్లో 1,218 ఉండగా, బేస్‌మెంట్‌ లెవల్లో 551, శ్లాబ్‌ లెవల్లో 169 నిర్మాణం పూర్తయ్యాయి. ప్రధానంగా ముక్కొల్లుపాడు, బోర్వంచ లేఅవుట్‌లలో నిర్మాణాలకు లబ్ధిదారులు విముఖత చూపారు. బోర్వంచలో 131 మందికి ఒక్కరు మాత్రమే నిర్మిస్తున్నప్పటికీ అసంపూర్తిగానే నిలిచింది.

9 లేఅవుట్లలో నిర్మాణం నిల్‌

చాట్రాయి : చాట్రాయి మండలంలో 35 జగనన్న లేఅవుట్లలో 26 లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మానం ప్రారంభమైంది. మొత్తం 1730 మంది పట్టాలు పొందగా వీరిలో 240 మందికి పక్కాగృహాలు మంజూరు చేశారు. వీరిలో 95 మంది ఇళ్ల నిర్మాణ చేపట్టారు. చాట్రాయి గ్రామంలో 123 మందికి పట్టాలు ఇవ్వగా, 38మందికి ఇళ్లు మంజూరు అయ్యాయి. ఒక్కరు మాత్రమే ఇంటినిర్మాణం చేపట్టారు. పోలవరంలో 220 మందికి పట్టాలు ఇవ్వగా 37 ఇళ్లు మంజూరు చేశారు. వీరిలో ఒక్కరు మాత్రమే ఇంటినిర్మాణం చేపట్టారు.

స్థలాలు రాళ్లకే పరిమితం

జీలుగుమిల్లి/టి.నరసాపురం : జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణ పనులు లేఆవుట్‌లో వేసిన రాళ్లకే పరిమితం అయ్యాయి. జీలుగుమిల్లి మండలంలో 12 పంచాయతీలకు 8 లేఆవుట్‌లను ప్రభుత్వ అధికారులు గుర్తించి పట్టాలు అందజేశారు. కామయ్యపాలెం, పి.అంకంపాలెం, ములగలంపల్లి, టి.గంగన్నగూడెం, జీలుగుమిల్లి తాటియాకులగూడెం, దర్భగూడెం, వంకవారిగూడెంలలో ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కొంత స్థలం ఆక్రమణకు గురవుతోందని కొందరు లబ్ధిదారులు చెబుతున్నారు. టి.నరసాపురం మండలంలోని బందంచర్ల, బొర్రంపాలెంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో రాళ్ల గుట్టలు ఉండడంతో ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. ఇళ్ల నిర్మాణ పనులు నిలిచాయి.

ఒక్క ఇంటికీ పునాది పడలేదు

పెదవేగి : పెదవేగి మండలం జానంపేటలో 160 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన పట్టాలను చూసుకుని మురుచుకోవడమే తప్ప ఇంటి నిర్మాణానికి ఒక్కరూ ముందుకు రావడంలేదు. దీనికి కారణం కాలనీ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్‌ క్వారీలో ఉండడమే. ఏలూరు– చింతలపూడి ప్రధాన రహదారిని ఆనుకుని లేఅవుట్‌ ఉంది. కానీ రహదారికి 15 అడుగుల దిగువుగా ఉంది. ఆ ప్రాంతం క్వారీభూమి కావడంతో గతంలో రహదారికి 20 అడుగులకుపైగా లోతున తవ్వేసి గ్రావెల్‌ను తరలించేశారు. ఇప్పుడు జగనన్న కాలనీని అదే క్వారీభూమిలో ఏర్పాటు చేయడంతో చిన్నపాటి వర్షానికే చెరువులా మారుతుంది. దాదాపు రూ.20లక్షల వ్యయంతో స్థలాన్ని ఇప్పటికే పది అడుగులకుపైగా మెరక చేశారు. మరో పది అడుగులకుపైగా లోతుగానే కాలనీ ఉంది. లబ్ధిదారులు అక్కడ ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. ఆ స్థలమంతా పిచ్చి మొక్కలు నిండిపోవడంతో రెండుసార్లు ఆ మొక్కలను తొలగించారు. ఒక్క ఇంటికి కూడా పునాది పడలేదు. కాలనీని ఆనుకుని దిగువున రక్షణ గోడ నిర్మిస్తే తప్ప అక్కడకు రాబోమని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

కొప్పులవారిగూడెంలో..

కొప్పులవారిగూడెంలో మూడెకరాల విస్తీర్ణంలో 62 ఇళ్ల స్థలాలతో జగనన్న కాలనీ లేఅవుట్‌ వేశారు. ఇది గ్రామానికి దూరంగా పంట పొలాల మధ్య ఉండడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడంలేదు. ఆ కాలనీలో రెండేళ్ల కిందట రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణానికి పునాది వేశారు. స్తంభాలు పైకి లేచిపోవడంతో దానిని నిలిపేశారు. ముగ్గురు లబ్ధిదారులు మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఆ ప్రాంతమంతా ముళ్ళచెట్లతోపాటు కొన్నిచోట్ల పుట్టలు కూడా లేచాయి. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుని భూమి కావడం, దానికి అధికమొత్తంలో ధర చెల్లించి మరీ ఊరికి దూరంగా పొలాల మధ్య లేఅవుట్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడంలేదు.

ఫౌండేషన్‌ స్థాయిలోనే ఇళ్లు

తణుకు : తణుకుకి సంబంధించి అజ్జరం, డీఎల్‌కే రోడ్డు, పైడిపర్రు, కొండాలమ్మ పుంతరోడ్డుల్లో జగనన్న లేఅవుట్‌లు ఉన్నాయి, ఆయా లేఅవుట్‌లతో పాటు సొంతస్థలాలు ఉన్నవారికి 6,414 గృహాలు మంజూ రయ్యాయి. వాటిలో కేవలం 1200 మాత్రమే పూర్తయ్యాయి. 4600 అసలు నిర్మాణాలే మొదలు పెట్టలేదు. కొంతమంది ఫౌండేషన్‌ వేసి వదిలేశారు. కొంత మంది ఇళ్లు వివిధ స్టేజిలలో ఉన్నాయి. గతంలో ఉపాధి హామీ పథకంలో కాలనీలో మట్టి పూడికలు చేశారు. మళ్ళీ చేయడానికి నిధులు మంజూరు అయినప్పటికి మట్టి అందుబాటులో లేకపోవడం వల్ల పూడిక పనులు ఎక్కడవి అక్కడే అన్న చందంగా ఉంది.

కనీస సదుపాయాలు లేకుండా ఎలా ?

ఇరగవరం : ఇరగవరం, ఎర్రాయిచెర్వు, రేలంగి, అంతన్నవారిపాలెం తదితర గ్రామాల్లో నిర్మాణాలకు కావాల్సిన సామాగ్రి తెచ్చుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. రవాణా సౌకర్యం లేని ప్రదేశాల్లో నిర్మాణం ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేలంగిలో గ్రామానికి దూరంగా ఉన్నాయని లబ్దిదారులు వాపోతున్నారు. దీంతో లే అవుట్లలో తుప్పలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి.

ముందుకు సాగని ఇళ్లు

పెంటపాడు: పెంటపాడు మండలంలో మొత్తం 2,283 ఇళ్లు మంజూ రవగా 1,303 మంది మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారిలో 47 మంది స్లాబ్‌ దశ పూర్తి చేసుకోగా, 64 మంది స్లాబ్‌ పనులు ముగించుకున్నారు. 414 మంది బేస్‌మెంట్‌ దశలోనే ఆపేశారు. మిగిలిన 442 మంది అసలు నిర్మాణాలే చేపట్టలేదు. ఇంటి నిర్మాణానికి సుమారు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నుంచి రూ 1.80 లక్షలు మాత్రమే అందుతుంది. ఈ సొమ్ము ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో లబ్దిదారులు అంతగా మొగ్గు చూపడం లేదు. మండలంలో ప్రత్తిపాడు, బీ.కొండేపాడు, ముదునూరు గ్రామాలు మినహా మిగిలిన గ్రామాల్లో పనుల వేగం పెద్దగా కనిపించడం లేదు. పెంటపాడులో ఇంతవరుకూ ఇళ్ల స్థలాల ఊసే లేదు. పెంటపాడులో స్థలం లేని కారణంగా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జగన్నాధపురంలో ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగించారు. వివిధ కారణాల కారణంగా అక్కడ కూడా ఇంతవరుకూ స్థలాలు ఇవ్వలేదు.

1,299 ఇళ్లకు 400 ఇళ్లు

ఆచంట : ఆచంట మండలంలో 37 జగనన్న లే అవుట్‌లలో 1,577 ప్లాట్‌లు ఏర్పాటు చేశారు. 1,299 ఇళ్ల నిర్మాణం చేపట్టవలసి ఉండగా ఇప్పటి వరకు సుమారు 400 ఇళ్లు మాత్రమే నిర్మించారు. మండలంలో ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో ఇళ్లు కట్టుకోలేదు. వల్లూరు శివారు ఉత్తర పాలెం, పెదమల్లం లంకలో రెండు లేఅవుట్‌లలో కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోలేదు.

లే అవుట్‌లలో పిచ్చిమొక్కలు, గడ్డి

యలమంచిలి : యలమంచిలిలో పేద ప్రజలకు ఇళ్లస్థలాలు కేటాయించిన జగనన్న లేఅవుట్‌లో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్క ఇంటి నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఈ లేఅవుట్‌లో ప్రభుత్వం 90 మందికి ఇళ్లస్థలాలు కేటాయించింది. తాడిగరువుతోట శివారు నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న జగనన్న లేఅవుట్‌కు వెళ్లే పుంతదారి అస్తవ్యస్తంగా ఉండేది. వరిచేలు,ఆక్వా చెరువులు ఉన్న ప్రాంతంలో పట్టాలు ఇచ్చారు. ఈ లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు ఇంతవరకూ ప్రారంభం కాకపోవడంతో పిచ్చి మొక్కలు, చెత్తతో దర్శనమిస్తోంది. తమకు వేరే ప్రాంతంలో స్థలాలు కేటాయించాలని గతంలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

రవాణా మార్గం లేక వెనకడుగు

పెనుమంట్ర : మండలంలో 47 లేఅవుట్‌లకు 39 చోట్ల ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. సత్యవరం, నత్తారామే శ్వరం–2, పెనుమంట్ర–1 లే–అవుట్‌లల్లో పనులు ప్రారంభం కాలేదు. 39 లేఅవుట్‌లలో 24,446 ఇళ్లకు 400 బేస్‌ మెంట్‌ స్థాయిలో ఉన్నాయి. 400 ఇళ్లు జనవరిలోగా పూర్తి చెయ్యాలని లక్ష్యంగా ఇచ్చింది. నత్తారామేశ్వం–2 లేఅవుట్‌లో 12 ఇళ్లు నిర్మాణానికి మంజూరు కాగా పల్లంగా ఉండడంతో పాటు, రవాణా మార్గం లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.

మూడేళ్లయినా..దారి చూపలేదు

నరసాపురం రూరల్‌ : మండలంలోని వైఎస్‌పాలెం పంచాయతీ పరిఽధిలో 45 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. లక్ష్మణేశ్వరం గ్రామ శివారున ఎఫ్‌సీఐ గోడౌన్‌ దగ్గర, పితానిమెరక సమీపంలో మూడేళ్ల క్రితం స్థలాలు సేకరించారు. అయితే నేటికి ఈ స్థలాలకు దారి చూపలేదు. దీంతో శంకుస్థాపనలకే నివాసాలు పరిమితమయ్యాయి. కొంతమంది లబ్థిదారులు గృహనిర్మాణ మెటిరీయల్స్‌ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే వెళ్లేందుకు దారి లేదు. ఈ సమస్యపై లబ్థిదారులు జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇదే గ్రామంలో పితాని మెరకలో కూడా ఎకరం భూమిని సేకరించి 47 మందికి పట్టాలిచ్చారు. దీనికి కూడా దారి లేదు. న్యాయస్ధాన పరిధిలో ఉండ టంతో నిర్మాణాలు ముందుకు సాగలేదు.

Updated Date - 2023-11-28T23:54:53+05:30 IST