Share News

హరోం హర

ABN , First Publish Date - 2023-11-28T00:00:13+05:30 IST

కార్తీక సోమవారం పూజలతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరోం హర అంటూ శివ నామ స్మరణతో మార్మోగాయి. శివాలయాల వద్ద అభిషేకాలు, జ్యోతిర్లింగార్చన, దీపారాధన చేశారు.

హరోం హర
ఏలూరు పత్తేబాద శివాలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

శివ నామ స్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు

ఆలయాల్లో కార్తీక సోమవారం పూజలు

ఏలూరు కార్పొరేషన్‌, నవంబరు 27: కార్తీక సోమవారం పూజలతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరోం హర అంటూ శివ నామ స్మరణతో మార్మోగాయి. శివాలయాల వద్ద అభిషేకాలు, జ్యోతిర్లింగార్చన, దీపారాధన చేశారు. మహిళలు కార్తీక పౌర్ణమి కావడంతో ఉపవాస దీక్షలు నిర్వహించి సోమవారం రాత్రి చంద్ర దర్శనం అనంతరం ఉపవాసాలను విరమించారు. నగరంలోని గాంధీనగర్‌ అవిముక్తేశ్వరస్వామి ఆలయం వద్ద స్పటిక లింగాన్ని భక్తులు దర్శించుకున్నారు. పాత శివాలయం, పత్తేబాదలోని చౌడేశ్వరి రామలింగేశ్వరస్వామి ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో అభిషేకాలు నిర్వహించి అనంతరం ధ్వజస్తంభాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. పలు దేవాలయాల వద్ద భక్తులు లింగాకారం, ఓం ఆకారం, స్వస్తిక్‌ ఆకారంలో జ్యోతులను ఏర్పాటుచేసి పూజలు చేశారు. అంబికాదేవి ఆలయంలో అమ్మవారిని అంబికా కృష్ణ ప్రాకార మహోత్సవాన్ని నిర్వహించారు. మార్కండేయస్వామి, జరాపహరేశ్వరస్వామి, నగరేశ్వరస్వామి, ప్రతాప విశ్వేశ్వరస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాల వద్ద భక్తులు విశేష పూజలు చేశారు. సత్యనారాయణపేట రేవు లింగేశ్వరస్వామి ఆలయం వద్ద స్వామివారికి విభూదితో అభిషేకం నిర్వహించారు.

కామవరపుకోట: మండలంలో పలు శివాలయాల వద్ద సోమవారం పూజలు, నోములు నోచుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, బిల్వార్చన నిర్వ హించి కార్తీక దీపాలను వెలిగించారు. తులసికోట వద్ద పసుపు, కుంకుమ లతో అర్చన జరిపి కర్పూర జ్యోతులు వెలిగించారు. భద్రకాళీ సహిత వీరభద్రస్వామి, ఆడమిల్లి కంచి కామాక్షి సమేత ఏకాంబరేశ్వరస్వామి, మందా సమేత శనీశ్వరస్వామి, తడికలపూడి గంగా పార్వతీ సమేత గాంగేశ్వరస్వామి, జీలకర్రగూడెం ధర్మలింగేశ్వరస్వామి ఆలయాల వద్ద భక్తులు పూజలు చేశారు. జీలకర్రగూడెం కొండగట్టుపై గల ఆరామాలను, బౌద్ధ స్థూపాలను, కట్టడాలను, పాలరాతి స్థూపాలను పలువురు సందర్శించారు.

పెదపాడు: భక్తుల శివ నామ స్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగాయి. పెదపాడులోని గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు కార్తీకమాస ఆఖండ దీపారాధన, పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. విశేషాలంకరణలో సోమేశ్వరస్వామి దర్శనమిచ్చారు.

పెదవేగి: శైవక్షేత్రాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. పెదవేగి పార్వతీ పరమేశ్వరస్వామిని విశేషసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. జ్యోతి ర్లింగార్చన, ఆకాశదీపం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

భీమడోలు: శివాలయాల్లో కార్తీక సందడి శోభ సంతరించుకుంది. భీమడోలు, గుండుగొలను, పూళ్ళ, పోలసానపల్లి, అంబర్‌పేట తదితర గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భీమడోలు శ్రీ పార్వతి సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. గుండుగొలను భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో పంచామృత నవరస ఫల అభిషేకాలు, జ్యోతిర్లింగార్చన చేసుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్పటిక లింగ దర్శనం చేసుకున్నారు. పోలసానపల్లి రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

ఉంగుటూరు: మండలంలో శైవ క్షేత్రాలు ఓంకారంతో మార్మోగాయి. భక్తులు శైవక్షేత్రాలను దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి బ్రాహ్మణులకు స్వయం పాకాలు సమర్పించారు. ఉంగుటూరు, చేబ్రోలు. నారాయణపురం ,కైకరం, కంసాలిగుంట, గొల్లగూడెం, బొమ్మిడి, కాగుపాడు, బాదంపూడి, తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-11-28T00:00:15+05:30 IST