Share News

రాకుంటే పథకాలు కట్‌

ABN , First Publish Date - 2023-11-28T23:30:38+05:30 IST

బస్సు యాత్ర జరుగుతోంది. దీనికి సీఎం వస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలి. లేకుంటే పథకాలు రావు’ అంటూ చెప్పి బలవంతంగా వలంటీర్లు, సీసీలు, బుక్‌ కీపర్లు దగ్గర వుండి వ్యానులు, ఆటోల ద్వారా సమావేశానికి మహిళలను తరలించారు.

రాకుంటే పథకాలు కట్‌
సమావేశం మధ్యలో తిరిగి వెళ్లిపోతున్న ప్రజలు

కైకలూరు వైసీపీ బస్సు యాత్రకు జన సమీకరణలో బెదిరింపులు

కట్టుబాట్ల మధ్య కొల్లేరు ప్రజల తరలింపు.. మధ్యలోనే తిరుగుముఖం

జాతీయ రహదారి దిగ్బంధం.. వారపు సంత నిలిపివేత.. జనం పాట్లు

కైకలూరు, నవంబరు 28 : ‘కైకలూరులో మంగళవారం సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరుగుతోంది. దీనికి సీఎం వస్తున్నారు. కావున నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలి. లేకుంటే పథకాలు రావు’ అంటూ చెప్పి బలవంతంగా వలంటీర్లు, సీసీలు, బుక్‌ కీపర్లు దగ్గర వుండి వ్యానులు, ఆటోల ద్వారా సమావేశానికి మహిళలను తరలించారు. కొల్లేరు కట్టుబాట్ల మధ్యన మైకులలో ప్రచారం చేసి ప్రతీ ఒక్కరు సమావేశానికి హాజరు కావాలని హుకుం జారీచేశారు. ఒక్కొక్క మహిళలకు రూ.500 ఇచ్చినట్లు సమా చారం. లేకుంటే గ్రామ కట్టుబాట్ల మధ్య చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురై తప్పనిసరి పరిస్ధితుల్లో సమావేశానికి వచ్చామని వాపోయారు. ఇలా వచ్చిన మహిళలను కైకలూరులో ఏపీఎం సత్యనారాయణ దగ్గరుండి దింపి వారిని సమావేశానికి పంపించారు.

వారపు సంత నిలిపివేత.. హైవే నిర్భందం

కైకలూరు నీలం సంజీవరెడ్డి మార్కెట్‌లో ప్రతీ మంగళవారం వారపు సంత జరుగుతుంది. దీనికి పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి కూరగాయలు, నిత్యావసర సరుకులు కొంటుంటారు. ఈ సంతను ముందస్తు సమాచారం లేకుండా నిలిపి వేయడంపై స్థానికులు మండిపడ్డారు. అలాగే సోమవారం రాత్రి నుంచే పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిని దిగ్బంధిం చారు. పెద్ద మసీదు సెంటర్‌ నుంచి వారపు సంత మార్కెట్‌ వరకు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మార్కెట్‌ వద్ద బైపాస్‌ రోడ్డు అనుసంధానమైన ప్రదేశంలో సభా వేదిక ఏర్పాటుచేశారు. దీంతో భీమవరం నుంచి వచ్చే వాహనాలను కైకలూరు మండలం అటపాక నుంచి అగ్రహారం మీదుగా వరహాపట్నం, రాచపట్నం, గోపవరం మీదుగా తరలించారు. ఏలూరు, గుడివాడ నుంచి వచ్చే బస్సులను గోపవరం, వరహాపట్నం మీదుగా తరలిం చారు. దీంతో కైకలూరు బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘ఆసుపత్రికి వచ్చాం. ముందే తెలుసుంటే కైకలూరు వచ్చే వాళ్లం కాద’ంటూ ఆలపాడు, కొల్లేరు గ్రామాలకు చెందిన వృద్ధులు వాపోయారు.

మంత్రి రజని అవగాహన లేని మాటలు

సభలో ప్రారంభం నుంచి మంత్రుల అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులే కన్పించాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదేనంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పదే పదే ఉపన్యాసంలో దంచికొట్టారు. మంత్రులు విడదల రజని, జోగి రమేష్‌, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పాల్గొన్నప్పటికి ప్రజలు వారి ఉపన్యాసాలు వినేందుకు సుముఖత చూపలేదు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రజలు తిరుగు ముఖం పట్టారు. ‘కొల్లేరు ఎప్పుడూ మంచి నీటితో కళకళలాడుతూ వుంటుంది’ అంటూ మంత్రి విడదల రజని చెప్పడంతో కొల్లేరు వాసులు ఆశ్చర్య పోయారు. అసలే కొల్లేరు కాలుష్యంగా మారి, తాగేందుకు చుక్క మంచి నీరు లేక ఇబ్బందులు గురవతుంటే కొల్లేరులో మంచినీరు ఉందంటూ అవగాహన లేకుండా మంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శించారు.

సదస్సుకు వెళ్లకుండా నిర్బంధించారు

వైసీపీ నాయకురాలు తిరువీధుల శారద

ముదినేపల్లి, నవంబరు 28 : ఏలూరు జిల్లా కైకలూరులో మంగళవారం జరిగిన సామాజిక సాధికార సదస్సుకు వెళ్లనివ్వకుండా పోలీసులు తనను అక్ర మంగా నిర్బంధించారని ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన వైసీపీ నాయకురాలు తిరువీధుల శారద ఆరోపించారు. తాను కైకలూరు సభకు పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లే విషయాన్ని వైసీపీ రాష్ట్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లానని సదస్సుకు వెళ్లకుండా బీసీ వర్గానికి చెందిన తనను అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది స్థానిక పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలి పారు. ఈ విషయమై ముదినేపల్లి ఎస్‌ఐ వెంకట్‌ కుమార్‌ వివరణ ఇస్తూ కైకలూరులో మంగళవారం జరిగిన వైసీపీ సామాజిక సాధికార సదస్సుకు ర్యాలీ నిర్వహించేందుకు వీలు లేదని తాము ముందుగానే శారదకు నోటీసులు జారీ చేశామని అయినా ఆమె ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతుండ టంతో ముంద స్తుగా ఆమెను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సాయంత్రం విడుదల చేసి శ్రీహరిపురంలోని ఆమె ఇంటికి పంపించామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-11-28T23:30:40+05:30 IST