Dream11: డ్రీమ్11 కీలక నిర్ణయం.. ఇకపై రూ.1 లక్ష జరిమానా !

ABN , First Publish Date - 2023-01-12T18:24:36+05:30 IST

అవిశ్రాంతంగా శ్రమించే ఉద్యోగులకు (Employees) సెలవులు (Vacations) పునరుత్తేజాన్ని కలిగిస్తాయి. పని ఒత్తిడికి దూరంగా ఉల్లాసంగా గడపాలని చూస్తారు...

Dream11: డ్రీమ్11 కీలక నిర్ణయం.. ఇకపై రూ.1 లక్ష జరిమానా !

ముంబై: అవిశ్రాంతంగా శ్రమించే ఉద్యోగులకు (Employees) సెలవులు (Vacations) పునరుత్తేజాన్ని కలిగిస్తాయి. పని ఒత్తిడికి దూరంగా ఉల్లాసంగా గడపాలని చూస్తారు. ఆనందంగా గడిపే ఈ సమయంలో ఆఫీస్ పనిమీద ఎవరైనా కొలిగ్ (colleague) నుంచి కాల్ వస్తే మాత్రం చిర్రెత్తుకొస్తుంది. విసుగు, చిరాకు కలుగుతాయి. ఉద్యోగి ప్రశాంతకు భంగం కలిగించే ఈ అనుభవం ఎవరికీ ఎదురుకాకూడదని భావించిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్11’ (Dream11) కీలక నిర్ణయం తీసుకుంది.

సెలవుపై ఉన్న సహచర ఉద్యోగికి ఫోన్ చేస్తే ఉద్యోగికి రూ.1 లక్ష జరిమానా (Fine) విధించాలని కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు డ్రీమ్11 సహ-వ్యవస్థాపకుడు భవిత్ షేత్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా 2008లో స్థాపించిన ఈ డ్రీమ్11 కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు సంవత్సరంలో కనీసం ఒకవారమైనా సెలవు ఇవ్వాలనే నిబంధన కొనసాగుతోంది.

ఏడాదిలో ఒక వారం పాటు పని వ్యవస్థకు దూరంగా ఉంటామని, ఈ సమయంలో కూడా ఫోన్లు, ఈ-మెయిల్స్‌తో ఉద్యోగులను విసిగించడం సబబుకాదని భావిస్తున్నట్టు షేత్ చెప్పారు. వారంపాటు ఉద్యోగి అందుబాటులో లేకపోతే ఎవరిపై ఆధారపడుతున్నామనే విషయం కూడా తెలుస్తుందని ఆయన చెప్పారు. ఈ విధానం ప్రభావవంతమైనదని ఇప్పటికే తేలిందని ఆయన అన్నారు. వారంపాటు ఉద్యోగులను ప్రశాంతంగా గడపనిస్తే పునరుత్తేజాన్ని పొందుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-12T18:25:42+05:30 IST