డిగ్రీ చదువుతూనే 10 వేలు సంపాదన.. ఎలా అంటే..!
ABN , First Publish Date - 2023-04-25T11:37:20+05:30 IST
డిగ్రీ చదువుకు (Degree) వచ్చినా.. అమ్మానాన్నే అన్నిటికీ ఆధారం.. పుస్తకాలకైనా.. ఇతర అవసరాలకైనా వారు ఇవ్వాల్సిందే.. అలాంటి పరిస్థితి లేకుండా చదువుతూనే సంపాదించగలిగితే..
చదువుతూనే నెలకు రూ.10వేల దాకా..
డిగ్రీతో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు!
ఈ ఏడాదే 100 కాలేజీల్లో ప్రారంభం
బీఏలో కంటెంట్, క్రియేటివ్ రైటింగ్
బీబీఏలో రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్
బీఎస్సీలో గేమింగ్, యానిమేషన్
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ చదువుకు (Degree) వచ్చినా.. అమ్మానాన్నే అన్నిటికీ ఆధారం.. పుస్తకాలకైనా.. ఇతర అవసరాలకైనా వారు ఇవ్వాల్సిందే.. అలాంటి పరిస్థితి లేకుండా చదువుతూనే సంపాదించగలిగితే.. కన్నవారికి కాస్త తోడ్పాటుగా నిలిచినట్లే.. ఇందుకు డిగ్రీ విద్యలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు చదువుకుంటూనే నెల వారీగా కొంత మొత్తంలో సంపాదించుకునేందుకు వీలుగా ఈ కోర్సులను డిజైన్ చేశారు. ఇందులో మూడు రోజులు కాలేజీకి వెళ్లడం, మిగిలిన మూడు రోజుల పాటు ఆయా రంగాల్లోని పరిశ్రమల్లో ఇంటర్న్‌గా చేరాల్సి ఉంటుంది. ఇంటర్న్ చేసినందుకు నెలకు కొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. మొదటి దశలో రాష్ట్రంలోని 100 కాలేజీల్లో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఒక్కో కాలేజీలో 60 సీట్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోర్సుల ప్రారంభానికి సంబంధించి 28న కేంద్ర, రాష్ట్ర అధికారులు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సోమవారం ఆయా విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కోర్సులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారత నైపుణ్య మండలి(స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కౌన్సిల్ ఒప్పందాన్ని కూడా చేసుకుంది. ఇందులో భాగంగా బీఏలో కంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్ వంటి స్కిల్ కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. బీబీఏలో రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ కోర్సులను, బీఎస్సీలో గేమింగ్, యానిమేషన్ వంటి స్కిల్ కోర్సులను ప్రారంభించనున్నారు. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు వారంలో మూడు రోజుల పాటు కాలేజీకి వెళ్లాలి. మిగిలిన మూడు రోజులు ఆయా కోర్సులకు అటాచ్ చేసిన పరిశ్రమ లేదా ఇతర వాణిజ్య కేంద్రాలకు వెళ్లాలి. ఈ కేంద్రాల్లో విద్యార్థులకు ఆయా రంగాలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్పించనున్నారు.
ఇలా ఇంటర్న్‌లో పాల్గొనే విద్యార్థులకు నెలకు సుమారు రూ. 10 వేల చొప్పున ఉపకార వేతనం కూడా చెల్లించేలా చర్యల్ని తీసుకుంటున్నారు. సాధారణ డిగ్రీ మాదిరిగానే దీన్ని మూడేళ్ల పాటు విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి కాగానే డిగ్రీ సర్టిఫికెట్‌తో పాటు, స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌ను కూడా జారీ చేయనున్నారు. ఈ సర్టిఫికెట్‌ల ఆధారంగా అభ్యర్థులు ఆయా రంగాల్లో ఉద్యోగాలను పొందడానికి వీలుంటుందని అంచనా వేస్తున్నారు. లేదా ఇంటర్న్ చేసిన కంపెనీలోనే వీలునుబట్టి అవకాశాన్ని కల్పించనున్నారు. స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులను ప్రస్తుతానికి 100 కాలేజీల్లో ప్రారంభించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని కాలేజీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి పట్టణాల్లోని కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఎంపిక చేసిన కాలేజీల్లో 60 సీట్ల చొప్పున అనుమతించాలని నిర్ణయించారు. ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.