తెలంగాణ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2023-05-02T10:56:28+05:30 IST

ఒక పక్క ప్రవేశ పరీక్షలు, మరో పక్క నియామక పరీక్షలు. దీంతో మే.. పరీక్షల నెలగా మారనుంది. పేపర్‌ లీక్‌తో రీషెడ్యూల్‌ అయిన కొన్ని పోస్టుల

తెలంగాణ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే..!
Telangana

పరీక్షల నెల

మేలో వివిధ ప్రవేశ, నియామక పరీక్షలు

10 నుంచి వరుసగా ప్రారంభం

వారం రోజుల్లో టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ఒక పక్క ప్రవేశ పరీక్షలు, మరో పక్క నియామక పరీక్షలు. దీంతో మే.. పరీక్షల నెలగా మారనుంది. పేపర్‌ లీక్‌తో రీషెడ్యూల్‌ అయిన కొన్ని పోస్టుల పరీక్షలను మేలో నిర్వహిస్తున్నారు. అలాగే ఉన్నత విద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు కూడా ఈ నెలలోనే ఉన్నాయి. వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షలు ముగియడంతో ఉన్నత విద్య కోర్సుల అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 10 నుంచి 14వరకు ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. తర్వాత వరుసగా ఎడ్‌సెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇలా పలు కోర్సుల అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఒక పక్క జరుగుతుండగానే.. మరో పక్క వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 16న అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ పరీక్ష, 17న ఫిజికల్‌ డైరెక్టర్ల పరీక్ష, 19న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పరీక్షను నిర్వహిస్తున్నారు.

టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు కూడా..

ఈ నెలలోనే టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మార్చి 15 నుంచి 29 వరకు ఇంటర్‌ పరీక్షలను, ఏప్రిల్‌ 3 నుంచి 11 వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వాల్యుయేషన్‌ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఈ వారం రోజుల్లోనే టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలను ప్రకటించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

exam.jpg

Updated Date - 2023-05-02T10:56:28+05:30 IST