2K Note Withdrawl: 2016లో ఏం జరిగింది? ఏం చెప్పారు?

ABN , First Publish Date - 2023-05-20T18:07:24+05:30 IST

న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి సరిగ్గా 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీవీ స్క్రీన్‌పై కనిపించారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. దేశంలో నల్లధనాన్ని, అవినీతి సొమ్ముకు చెక్ పెట్టేందుకు, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీసేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. సామాన్య ప్రజానీకం మాత్రం కేంద్రం నిర్ణయంతో బెంబేలెత్తిపోయింది.

2K Note Withdrawl: 2016లో ఏం జరిగింది? ఏం చెప్పారు?

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (Demonetisation) అంశం మళ్లీ చర్చకు వచ్చింది. రూ.2000 నోట్లను మార్కెట్‌లో నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ (RBI) శుక్రవారంనాడు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడంతో మళ్లీ డీమోనిటైజేషన్ అంశం తెరమీదకు వచ్చింది. మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ చెప్పిన రూ.2,000 నోట్లను స్యయంగా ఆర్బీయేనే 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాకపోతే అప్పటికీ, ఇప్పటికీ ఉన్న ఏకైక తేడా ఏమిటంటే... రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్వయంగా దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ఈసారి అందుకు భిన్నంగా ఆర్బీఐ రూ.2,000 నోట్లకు చెక్ పెడుతూ ప్రకటన చేసింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొద్ది కాలం క్రితమే రూ.2,000 నోట్లు జనవరి 1 నుంచి రద్దవుతున్నాయని, ఆ స్థానే రూ.1,000 నోట్లు మళ్లీ తెస్తున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (PIB)...అబ్బే అలాంటిదేమీ లేదంటూ వివరణ ఇచ్చింది. నకిలీ వార్తలు నమ్మొద్దని, వాటిని సృష్టించవద్దని, షేర్ చేయవద్దని కోరింది. కాస్త అటూ, ఇటూగా ఇప్పుడు రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ ప్రకటన చేయనే చేసింది. దీంతో విపక్షాలు విమర్శలు గుప్పించింది. మొదటిసారి పెద్ద నోట్లు రద్దు చేసి, రూ.2000 నోటును తెచ్చినప్పుడు ఏమి చెప్పారు? ఇప్పడు రద్దుకు కారణం ఏమి చెబుతారు? అని ప్రశ్నించింది. సోషల్ మీడియా అయితే ఓ అడుగు ముందుకు వేసి ప్రతి ఎన్నికలకు ముందు పెద్ద నోట్లు రద్దు చేసేందుకు ఒక జాతీయ విధానం తెస్తే బాగుంటుందంటూ పోస్టింగ్‌లు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడేళ్ల క్రితం అంటే..2016లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

2016లో ఏమి జరిగింది?

2016 నవంబర్ 8వ తేదీ రాత్రి సరిగ్గా 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీవీ స్క్రీన్‌పై కనిపించారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. దేశంలో నల్లధనాన్ని, అవినీతి సొమ్ముకు చెక్ పెట్టేందుకు, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీసేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. కేంద్రం నిర్ణయంతో అవినీతిపరులు, అక్రమార్కుల మాట ఎలా ఉన్నా...సామాన్య ప్రజానీకం బెంబేలెత్తిపోయింది. ఎందుకంటే...అప్పుడు అందరి దగ్గరా చలామణిలో ఎక్కువగా ఉన్న నోట్లు రూ.500, రూ.1000 నోట్లు కావడమే. కేంద్రం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో హాహాకారాలు మొదలయ్యాయి. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు కల్పించిన కొద్ది పాటి వ్యవధిని ఉపయోగించుకునేందుకు జనం బ్యాంకులకు పోటెత్తారు. బ్యాంకుల్లో విత్‌డ్రా చేసుకునే సొమ్ముకూ ఆంక్షలు పెట్టడంతో సాధారణ జనం లిక్విడ్ క్యాష్ లేక అల్లాడిపోయారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని మరింత నష్టపోయారు. దేశ జీడీపీకి కీలకంగా భావించే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హెల్త్ కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఏవియేషన్, ఆటోమొబైల్...ఇలా అనేక రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థకు రూ.5 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లందంటూ అంచనాలు వేశారు. మీడియా సంస్థల సమాచారం ప్రకారం బ్యాంకుల వద్ద అహోరాత్రులు పడగాపుల పడి, క్యూలల్లోనే కుప్పకూలిన వారితో సహా దేశంలో 108 మంది వరకూ మరణించారు. 1.4 లక్షల పరిశ్రమలు మూతపడి, 62 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారని అప్పట్లో ఓ అంచనా.

ఆర్బీఐ లెక్కలు ఏం తేల్చిందంటే..?

ఉగ్రవాదుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, చలామణిలోకి రాకుండా నల్లధనంగా ఉండిపోయిన సొమ్మును వాడకంలోకి తీసుకురావడం పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి కారణంగా ఆర్బీఐ చెబుతూ వచ్చింది. ఆసక్తికరంగా నోట్ల రద్దు తర్వాత దాదాపు 99 శాతం కరెన్సీ తిరిగి బ్యాంకులకు చేరినట్టు ఆ తర్వత ఆర్బీయేనే స్యయంగా ప్రకటించింది. దీంతో పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నీరుగారిపోయిందనేది విమర్శకుల వాదన. ఉగ్రవాదం వెన్ను విరగడం అటు ఉంచి, కొత్త మార్గాలను వెతుక్కుందనే వాదన కూడా ఉంది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం 2016 నవంబర్ 8న జారీ చేసిన నిర్ణయం చెల్లుబాటును సవాలు చేస్తూ లెక్కలు మించిన కేసులు నమోదయ్యాయి. దాదాపు 56 పిటిషన్లను ఒకచోట చేర్చి సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం 2023 జనవరి 2న సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. జస్టిస్ ఎన్ఏ నజీర్ సారథ్యంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో నలుగురు పెద్ద నోట్ల రద్దును సమర్ధించగా, జస్టిస్ నాగరత్న మాత్రం తప్పుపట్టారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అడ్డుకోలేమని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న లక్ష్యాలను గుర్తించామని, వాటిని చేరుకోవడంతో మాత్రం తేడాలు ఉన్నాయని తెలిపింది. వాటి ఆధారంగా పెద్ద నోట్ల రద్దు తప్పని చెప్పలేమని వివరించింది. జస్టిస్ నాగరత్న మాత్రం కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టారు. చట్టం ప్రకారం ఆర్బీఐ ఈ ప్రకటన చేయాలని, కానీ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. రహస్యంగా చేసిన ఈ చట్టం ఒక అర్డినెన్స్ వంటిదని తప్పుపట్టారు. అయితే ఇప్పుడు దీనిపై ఎలాంటి స్టే ఇవ్వలేమని, ఇప్పటికే నోట్ల రద్దు కూడా జరిగిపోయినందున పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమన్నారు. కాగా, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయం లోఫభూయిష్టంగా లేదని జస్టిస్ గవాయ్ చెప్పారు. సుప్రీం తీర్పు కేంద్రానికి ఊరట కలిగించగా, సామాన్యులను మాత్రం నాటి 'పీడకల' వెండాడుతూనే ఉందని, గాయాలు మానలేదనే అభిప్రాయలు నేటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి.

Updated Date - 2023-05-20T18:13:31+05:30 IST