Share News

41 laborers are safe : ఎట్టకేలకు బయటి ప్రపంచంలోకి

ABN , First Publish Date - 2023-11-29T05:21:43+05:30 IST

అధికార యంత్రాంగం అలుపెరగని ప్రయత్నం ఫలించింది.. సహాయ సిబ్బంది నిర్విరామ కృషికి ప్రయోజనం దక్కింది.. కుటుంబసభ్యుల ఎదురుచూపులకు తెరపడింది..! ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా

41 laborers are safe : ఎట్టకేలకు బయటి ప్రపంచంలోకి

ఎట్టకేలకు బయటి ప్రపంచంలోకి

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితం

ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ రంగంలోకి దిగడంతో చకచకా

17 రోజుల నిరీక్షణకు తెర.. బంధువుల ఆనందం

దేశంలోనే అతి భారీ, అత్యంత సంక్లిష్ట ఆపరేషన్‌

గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటుతో తక్షణమే ఆస్పత్రికి..

కూలీలు 8 రాష్ట్రాలవారు.. 15 మందిది ఝార్ఖండ్‌

ఎన్జీటీ నిషేధించిన ర్యాట్‌ హోల్‌ మైనింగే కాపాడింది

రెస్క్యూలో ఆస్ట్రేలియా నిపుణుడు డిక్స్‌ కీలక పాత్ర

బృంద కృషికి నిదర్శనం

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కూలీలను కాపాడిన బృందాలకు నా సెల్యూట్‌. ఈ ఆపరేషన్‌ మానవత్వం, బృంద కృషికి నిలువెత్తు నిదర్శనం. ఇది అందరినీ భావోద్వేగానికిగురిచేసింది. సొరంగంలో చిక్కుకున్నా కూలీలు చూపిన ధైర్యం, ఓపిక స్ఫూర్తిదాయకం. వారి కుటుంబాలూ ధైర్యంగా నిలిచాయి.

- ప్రధాని మోదీ

ఉత్తరకాశీ, నవంబరు 28: అధికార యంత్రాంగం అలుపెరగని ప్రయత్నం ఫలించింది.. సహాయ సిబ్బంది నిర్విరామ కృషికి ప్రయోజనం దక్కింది.. కుటుంబసభ్యుల ఎదురుచూపులకు తెరపడింది..! ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కూలీలు బతుకు జీవుడా అంటూ 17 రోజుల తర్వాత బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మంగళవారం రాత్రి రెస్య్కూ బృందాలు వీరిని సురక్షితంగా తీసుకొచ్చాయి. దీంతో దేశంలోనే అతి భారీ, అత్యంత సంక్లిష్ట ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. ఈ నెల 12న దీపావళి పండుగ నాడు తెల్లవారుజామున సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం కూలడంతో 8 రాష్ట్రాలకు చెందిన కూలీలు చిక్కుకుపోయారు. నాటినుంచి కేంద్ర, రాష్ట్ర విపత్తు నివారణ దళాలు, ఐటీబీపీ, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో)లు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. కాగా, టన్నెల్‌లో 57 మీటర్ల వరకు శిథిలాలు పేరుకున్నాయి. వీటిని తొలుస్తూ.. 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లైన్‌ వేసి దానిలో నుంచి కూలీలను తీసుకురావాలని అధికారులు ప్రణాళిక రచించారు. క్లిష్టమైన డ్రిల్లింగ్‌నూ చేయగల అమెరికన్‌ ఆగర్‌ యంత్రాన్ని తెప్పించారు. దాదాపు 47 మీటర్ల మేర తవ్వాక.. సొరంగం నిర్మాణంలో ఉపయోగించిన ఇనుప పట్టీలు అడ్డుపడి ఆగర్‌ యంత్రం బ్లేడ్లు పూర్తిగా విరిగిపోయాయి.

నిలువునా తవ్వేందుకూ ప్రయత్నం..

ఆగర్‌ యంత్రం విరిగిపోవడం.. మరో యంత్రాన్ని ఇండోర్‌ నుంచి తెప్పించినా ప్రయోజనం లేదని తేలడంతో అధికారులు సొరంగంపైన ఉన్న కొండను నిలువునా తవ్వాలని నిర్ణయించారు. 86 మీటర్లకు గాను సోమవారం 36 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన ప్లాస్మా కట్టర్‌ను రప్పించి సొరంగంలో పది మీటర్ల శిథిలాల్లోని అడ్డంకులు, ఆగర్‌ యంత్రం భాగాలను తొలగించారు. అనంతరం బొగ్గు గనుల్లో సన్నటి మార్గాలను తవ్వడంలో నిపుణులైన 12 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ను రంగంలోకి దింపారు. సోమవారం రాత్రి పని ప్రారంభించిన వీరు 24 గంటల్లోపే పూర్తిచేశారు. మొత్తం 57 మీటర్లకూ అడ్డంకులు తొలగడంతో పైప్‌లైన్‌ను పంపి కూలీలను సురక్షితంగా తీసుకొచ్చారు.

పూలదండలతో స్వాగతించిన సీఎం

పైప్‌లైన్‌ ద్వారా ఒక్కొక్క కూలీని బయటకు తీసుకురాగా.. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి వారికి పూలదండ వేసి స్వాగతించారు. అటు 4 డిగ్రీల చల్లటి వాతావరణంలో ఇన్ని రోజులూ టన్నెల్‌ వద్దనే ఉంటూ వచ్చిన బంధువులకు ఈ మాటతోనే ప్రాణం లేచి వచ్చినట్లైంది. కాగా, కూలీలందరూ నడవగలిగేంత ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. శిథిలాల నుంచి అటువైపు ఉన్న మార్గం వరకు 2 కిలోమీటర్ల మేర ఖాళీ ప్రదేశం ఉండడంతో కూలీలు కాస్త స్థిమితంగా ఉండగలిగారు. తొలి రోజుల్లో వీరికి ఆరు అంగుళాల పైప్‌ ద్వారా సాధారణ ఆహారం పంపారు. పదిరోజులుగా 8 అంగుళాల పైప్‌తో డ్రైఫ్రూట్స్‌, పప్పుతో కూడిన ఆహారం తదితరాలను చేరవేశారు.

చార్‌ధామ్‌ మార్గం ఇది..

చార్‌ధామ్‌ రోడ్డు ప్రాజెక్టులో బ్రహ్మఖల్‌-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్‌గావ్‌ సమీపాన 4.5 కి.మీ. మేర ఈ సొరంగం తవ్వుతున్నారు. చార్‌ధామ్‌ యాత్రకు అన్ని కాలాల్లోనూ ప్రయాణించేందుకు వీలుగా దీనిని నిర్మిస్తున్నారు. ధారాసు-బార్‌కోట్‌-యమునోత్రి మార్గంలోని 134వ నంబరు జాతీయ రహదారి 26 కి.మీ. కిలోమీటర్ల మార్గం శీతాకాలంలో మంచుతో మూసుకుపోతుంది. టన్నెల్‌ నిర్మాణంతో ఈ దూరం 4.5 కిలోమీటర్లకు, ప్రయాణ సమయం 50 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తగ్గుతుంది. రెండు వరుసల్లో రూ.1,383 కోట్ల వ్యయంతో టన్నెల్‌ నిర్మాణం చేపట్టారు. ఈ నెల 12వ తేదీన 260-265 మీటర్ల మధ్యన కూలీలు పనిచేస్తుండగా.. 205వ మీటరు నుంచి 260 మీటరు ప్రాంతం కూలిపోయింది.

ఏ రాష్ట్రం వారు ఎంతమంది కూలీలంటే?

టన్నెల్‌ కూలీల్లో అత్యధికులు జార్ఖండ్‌ (15)కు చెందినవారే. యూపీ వారు 8 మంది, ఒడిశా, బిహార్‌కు చెందినవారు ఐదుగురు చొప్పున ఉన్నారు. బెంగాల్‌ వాసులు ముగ్గురు, ఉత్తరాఖండ్‌, అసోం వారు ఇద్దరేసి కాగా. మిగతా ఒక్కరు హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర వ్యక్తి. కాగా, కూలీలకు టన్నెల్‌ వద్దనే ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. ఒక్కొక్కరిని ఒక్కో అంబులెన్సులో 30 కిలోమీటర్ల గ్రీన్‌ కారిడార్‌ ద్వారా 41 పడకలతో చిన్యాలీసౌర్‌ ఆస్పతిలోని తాత్కాలిక వార్డుకు తరలించారు. కూలీలతో మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించారు. బయటకు వచ్చాక వీరందరినీ ఓ గదిలో ఉంచగా మోదీ ఫోన్‌ చేశారు.

2dixton.jpg

డిక్స్‌ భేష్‌

అర్నాల్డ్‌ డిక్స్‌.. ఉత్తరాఖండ్‌లో సొరంగం సహాయక చర్యల్లో 17 రోజులుగా వినిపించిన పేరిది. ఆస్ట్రేలియాకు చెందిన డిక్స్‌ భూగర్భ శాస్త్రవేత్త. అంతర్జాతీయ టన్నెలింగ్‌ అండ్‌ అండర్‌గ్రౌండ్‌ స్పేస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడైన ఈయన.. రెస్య్కూ ఆపరేషన్‌ను ఆసాంతం పర్యవేక్షించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పర్వతం ఎప్పుడూ మనకు ఓ మాట చెబుతుంది.. అది వినయంగా ఉండమని’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

నిషేధించిన విధానమే కాపాడింది

అనేక మార్గాలు అనుసరించినా, ఆలోచించినా, ఉత్తరాఖండ్‌ సొరంగంలోని కూలీలను రెండు వారాలు బయటకు తీసుకురాలేకపోయారు. కానీ, ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌తో ఒక్క రోజులోపే ఫలితం వచ్చేసింది. వాస్తవానికి అశాస్త్రీయం, సురక్షితం కాదంటూ ఈ పద్ధతిపై 2014లో ఎన్జీటీ నిషేధం విధించింది. ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌.. 4 అడుగుల వెడల్పు మించని ప్రదేశంలో బొగ్గు గనుల్లో సన్నటి మార్గాలను తవ్వడంలో నిపుణులు. ఒక్కరు మాత్రమే పట్టే ఈ మార్గంలో బొగ్గు లేయర్‌ను చేరాక.. సొరంగం తవ్వడం ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ ప్రత్యేకత. ఇది ఎలుక తవ్వే కందకాన్ని పోలి ఉంటుంది కాబట్టి ర్యాట్‌ హోల్‌ అనే పేరు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో పిల్లలతో ఈ పని చేయిస్తున్నారు. పర్యావరణ కోణంలోనూ దీనిని ఎన్జీటీ నిషేధించింది.

Updated Date - 2023-11-29T05:21:46+05:30 IST