Syria : బొడ్డుతాడు కోయకుండానే భూకంపాలు... మృత్యువును జయించిన పసికందు...

ABN , First Publish Date - 2023-02-08T16:57:43+05:30 IST

విధి చేసే వింతలు ఎన్నో. పిల్లల్ని చంపే తల్లులు, తల్లుల్ని చంపే పిల్లలు మన కళ్లెదుటే కనిపిస్తారు. అయినా పేగు బంధం గొప్పతనం

Syria : బొడ్డుతాడు కోయకుండానే భూకంపాలు... మృత్యువును జయించిన పసికందు...
Syria Earthquake

న్యూఢిల్లీ : విధి చేసే వింతలు ఎన్నో. పిల్లల్ని చంపే తల్లులు, తల్లుల్ని చంపే పిల్లలు మన కళ్లెదుటే కనిపిస్తారు. అయినా పేగు బంధం గొప్పతనం ఎన్నటికీ చెదరదు. భయానక, విషాదకర సంఘటనలు జరిగినపుడు ఆ ఔన్నత్యం మరింత ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. టర్కీ, సిరియాలలో ఈ నెల 6న సంభవించిన భూకంపాలు సృష్టించిన విలయం అత్యంత భయానకం. ప్రకృతి ప్రకోపించడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకన్నా ఎక్కువ మంది క్షతగాత్రులయ్యారు. అందమైన భవనాలు రాళ్ల కుప్పలుగా మిగిలిపోయాయి. సహాయం కోసం అర్థించే శక్తిలేక అనేక మంది వాటి క్రింద చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ పసి కందు మృత్యువును జయించింది.

టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపాల వల్ల బాధితులైనవారి ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసినవారు చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఓ వార్తా సంస్థ పోస్ట్ చేసిన ఫొటో మరింత ఆవేదనకు గురి చేస్తోంది. అప్పుడే పుట్టిన పసికందు బొడ్డుతాడు తన తల్లికి అతుక్కుని ఉన్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది. దురదృష్టవశాత్తూ ఆ తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఆ పసికందు మాత్రం మృత్యువును జయించింది. ఈ బిడ్డకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.

సామాజిక మాధ్యమాల్లో ఈ పసికందును చూసినవారంతా తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఇది అత్యంత హృదయవిదారక సంఘటన అని, చాలా భయానక దృశ్యమని అంటున్నారు. ఈ బిడ్డ సజీవంగా ఉండటం అద్భుతమని మరికొందరు చెప్తున్నారు.

ఈ బిడ్డకు చికిత్స చేస్తున్న డాక్టర్ హని మారూఫ్ మాట్లాడుతూ, సిరియాలోని జిందరీస్ అనే ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల ఈ పసికందు కుటుంబం నివసిస్తున్న భవనం కుప్పకూలిందని చెప్పారు. ఈ కుటుంబంలో ఈ పసికందు మాత్రమే సజీవంగా ఉందన్నారు. శిథిలాల క్రింద నుంచి ఏడుపు వినిపించడంతో సహాయక బృందాలు హుటాహుటిన ఆ పసికందును సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయన్నారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత పొరుగింట్లో ఉన్న ఓ మహిళ ఆ పసికందు బొడ్డుతాడును కోసి, వెంటనే అఫ్రిన్ పట్టణంలోని చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ప్రస్తుతం ఆ పసికందును ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.

ప్రసవ సమయంలో ఈ పసికందు తల్లి అఫ్రా అబు హడియా స్పృహలోనే ఉండి ఉండవచ్చునని, ప్రసవానంతరం ఆమె మరణించి ఉండవచ్చునని చెప్పారు. పసికందు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయిందని, దీనినిబట్టి కొద్ది గంటల క్రితం ప్రసవం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నామని చెప్పారు. భూకంపం సంభవించడానికి ముందే ఆమె జన్మించి ఉంటే, చలి తీవ్రంగా ఉండటం వల్ల బ్రతికి ఉండేది కాదన్నారు. సహాయక బృందాలు ఆమెను కాపాడటం మరో గంట ఆలస్యమైనా ఆమె ప్రాణాలతో బయటపడగలిగేది కాదని చెప్పారు. ఆమె బరువు 3.175 కిలోగ్రాములు ఉందని చెప్పారు. ఆమె వీపుపైన చిన్న గాయం ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2023-02-08T16:57:47+05:30 IST